అలా/ఇలా ఎందుకో?

అలా.....సెలయేటి గలగలవై
సంధ్యవేళ నుదుట సింధూరమై
మెరిసే ముక్కెరవైనావెందుకో?
ఇలా.....మదిలోనే దాగిన స్ఫూర్తివై
తామరాకుపై నీటి బిందువై
శృతిని వీడిన పల్లవైనావెందుకో?

అలా.....పసివాడిలా దోబూచులాడి
అసుర సంధ్యవేళ అల్లరేచేసి
అందకుండా ఆదమరిచావెందుకో?
ఇలా.....మబ్బుల్లో దాగిన వెన్నెలవై
నీలిసంద్రంలోని నిగూఢనిశ్శబ్ధానివై
చింతల కొలిమై కాలుతున్నావెందుకో?

అలా.....శుభోదయమై పలుకరించి
మంచిమాటలతో మైమరపించి
రేయంతా జాడలేకున్నావెందుకో?
ఇలా.....మరల చిగురించే ఆశవై
నీట పెనవేసుకున్న ప్రతిబింబానివై
ఏకంకాని నింగినేలలమైనామెందుకో?

పొగడమాకు!!!

పలు పూలతో నన్ను పోల్చమాకు
నింగికెగిసేలా నన్ను పొగిడేయమాకు... 
మల్లెలవంటిది నా మనసంటావు
నిరీక్షణలో నన్ను వాడిపోనిస్తావు 
కలువరేకుల కళ్ళదాన్నంటావు
కమ్మని కలవై కరిగిపోతున్నావు 
గులాబీల గుబాళింపు నేనంటావు
మొగ్గనై ముడిస్తే గుబులేలనంటావు 
చామంతి ఛాయంటి దానినన్నావు
చాలు పొమ్మంటే సరసమాడజూస్తావు 
బంతిపూలంత బరువైనాలేనంటావు
బలమెవ్వరిదంటే బయటపడకున్నావు 
జాజులై జాలువారె నా నవ్వులంటావు
జలతారునై నవ్వితే జగడమాడతావు 
సంపెంగలెన్నైనా నాకు సరికావంటావు
వదలకుండా ఒడిసిపట్టి వాడిపోకంటావు 
ముద్దమందారంలా ముద్దుగున్నానన్నావు
మరులుగొల్పి మరల మాపటేలకంటావు 
మొగలిపూలవాసనతో మత్తెకిస్తానంటావు
మురిపించ దరిచేరితే ముళ్ళున్నాయంటావు 
పొగడపూలతో పూజింతు నన్ను వీడమాకు
పారిజాత పూలకై పైకి ఎగబడమాకు......

ఈవేళ లెక్కతప్పవా!!!

ఓ కాలమా కాసేపాగలేవా!!!
ఓ క్షణమైనా లెక్కతప్పవా!!!
తన్మయత్వంతో తనువులు (1/౧)ఒకటైనవేళ
ఇరుజతల కళ్ళు (2/౨ )రెండుగా మారినవేళ
మురిపాలు (3/౩ )మూడు ముళ్ళు కోరినవేళ
పెనవేసిన పాదాలు (4/౪)నాలుగు పరవశించువేళ
ప్రణయమే (5/౫)పంచాక్షరిపై ప్రమాణమన్నవేళ
చేసినబాసలు (6/౬)ఆరునూరైనా తప్పమని పలికేవేళ
అనురాగమే ఆనందంతో (7/౭ )సప్త స్వరాలాలపించువేళ
ఆప్యాయతలో పడ్డ (8/౮)అష్టకష్టాలు మరచి మురియువేళ
అతనిలో భాగమై అమె (9/౯)నవమాసాలు మోయనెంచినవేళ
మరోజీవి (10/౧౦)పదిమందికి ఉపయోగపడేలా ఊపిరిపోసుకునేవేళ
ఓ కాలమా కాసేపాగలేవా!!!
ఓ క్షణమైనా లెక్కతప్పవా!!!

ఇంకేమనను!

...వేధించే వేసవిలో చల్లని వెన్నెలనై రానా...
...నీ కనుపాపల సన్నలలో నేనుండిపోనా...
...నీవు కాదన్నవేళ నేను కడదేరిపోనా...

...నీ ఊపిరిలో నేనే ఉన్నాను అంటావు...
...మరి నా నిఛ్ఛ్వాసలో నాకు దూరమౌతావు...
...ఎందుకిలా అంటే నవ్వి నా ఊపిరై పోతావు...

...కంటికి కనబడలేదు కాని నీలో నేను లేనా...
...తలచి చూడు నీ తనువంతా నేనే కానా...
...పిలిచి చూడు చితినుండి నేను లేచిరానా...

...నీ అందమైన ఊహల్లో నేనున్నానంటావు...
...మరి కలనైనా నన్ను మురిపించకున్నావు...
...ఎందుకిలా అంటే ప్రేమకు పరిభాషే నీవంటావు...

...ఇంక అడిగే సాహసం నేనేమైనా చేయగలనా...
...నిన్ను వీడినచో నా అస్తిత్వాన్ని నేకోల్పోనా...
...నీ తనువు అణువులో నేను ఏకమైపోనా...

వెలయాలి

వేదాలు వల్లించే వయసు నాది కాదు
ఏ రాశి కూడా నా రాత మార్చలేదు
ఎందుకిలా అని ఎవరినీ నింధించలేదు
రేయి ఏనాడు హాయిగా నిదురించలేదు
వరించలేదని వచ్చిన వాడ్ని కాదనలేదు!

పక్క ఎక్కని నాడు డొక్క ఆడలేదు
ఢోకొస్తుంది అన్నా విటుడు విడవలేదు
వెలయాలి అన్నా విరుచుకు పడలేదు
రుసరుసలాడితే రుసుము చేతికందదు
పెదవులకి రంగులద్దనిదే రసికతే లేదు!

ఊరూరు తిరిగినా ఏ ఊరు నాది కాదు
కవ్వించమన్నారే తప్ప కనికరించలేదు
తనయుడిని కూడా తల్లెవరనడగలేదు
వాధించి ఏదో సాధించాలన్న ఆశలేదు
సుఖఃమైన చావైనా నుదుటరాయలేదు!