నీ నా గమకాలు...


సై అంటే సైయని సరదాగా సరసాలాడక
చిలిపిఊహలని చిదిమేసి చిత్రంగా నవ్వి
సన్నాయి ఊదరాక నాదస్వరం ఊదేవు!

కొంటె కోర్కెలతో కవ్వించి ఖుషీ చేయక
కమ్ముకున్న కారుమబ్బులా దరికి చేరి
కోడెత్రాచులాగ కస్సు బుస్సులు ఆడేవు!

వల్మీకపొదమాటున వలపు కురిపించక
మనసుని మెలిపెట్టి మోహము తీరెనని
కుబుసం వీడిన నాగులా సర్రున జారేవు!

ఇరువురి గమకాలతో సృష్టి గమనమనక
తెలిసిన కార్యం ఇదని తెలియకుండా చేసి
వీడని బంధమై చుట్టుకుని నాట్యమాడేవు!

భావమా నీవెక్కడ!

భావాల్లో భాషాపరిజ్ఞానమే కొరవడెనని
వ్యాకరణ వాస్తేదో అంతగా కుదరలేదని
అక్షరదోషాలకి శాంతి చేయించమనంటే
భావం మూగదై బంధీగా మిగిలిపోయె!!

ఆలోచనలకి రూపమీయ అర్థనగ్నమని
భీతితో అవి తడిసిపోగా, పాలిపోయెనని
లేని సామర్థ్యంతో రంగులే అద్దమనంటే
ఆలోచనలు అవాక్కై అకాశాన్ని గాంచె!!

వ్యంగ్య వ్యాఖ్యలతో తప్పులే సరిచేసామని
చంకలెగరేస్తూ నవ్వి నీతులే నేర్చుకోమని
అసూయ, వాక్యాలుగా మారి కాలుతుంటే
మర్మమెరుగని మదికన్నీరే స్వేదమై పారె!!

అక్షరాలని అభిమానిస్తే అదేదో నేరమని
భావాలకే రంకుగట్టి బావలతో సరసమని
పదాలే వేరుగా పలికి పెడార్థాలు తీస్తుంటే
వివేకుల విజ్ఞానమిదేనని వినమ్రత నవ్వె!!

నేను పతివ్రతను కాను!!

ఒక్క భర్తనే భద్రంగా కాపు కాయలేను
పాంచాలినై ద్రౌపదినంటూ ఎలా బ్రతికేది
ఆమె పతివ్రతే అనుకుంటే నేను కాను!!

నేనే బ్రతుకలేక చచ్చి బ్రతికేస్తున్నాను
సావిత్రినై పతి ప్రాణాలు దక్కించుకోలేక
పోరాడి ఊపిరిపోసి పతివ్రతను కాలేను!!

పని వత్తిడిలో ఒక్క పసివాడినే పెంచలేను
అనసూయలా ముగ్గురు పిల్లల్ని పోషించి
పాతివ్రత్యం నిరూపించుకోలేని పతివ్రతను!!

రకరకాల రోగాలతో నీరసించి ఉన్న నేను
పతిని సతీసుమతి వలె భుజాల పై మోసి
కోరింది తీర్చి పతివ్రతను అనిపించుకోలేను!!

ముసుగు మోములో కోర్కె గుర్తించగలను
కానీ, అహల్యలా నేటి ఇంద్రుళ్ళలో రాయినై
రామపాదం తాకి పావనం అవ్వాలనుకోను!!

నిందించడం రాక నన్నునే తిట్టుకుంటాను
వేరెవరో నిందలు వేస్తే సీతలా మౌనం దాల్చి
భరించమని భూమాతను బ్రతిమిలాడలేను!!

అతిరథ సతీమణులతో పోటీపడి గెలవలేను
ఎప్పటికీ రంగులు అంటుకోని శ్వేతపద్మాన్ని,
నేను పతివ్రతను కాను అనుకున్నా కాలేను!!

ఎంతెంత దూరం!

నీకూ నాకు మధ్యన అంతా శూన్యమే కదా..
ఒక రాత్రి మరో పగలు అన్న సన్ననిపొర తప్ప
మనసులో నీవు, బయటికి కనబడుతూ నేను,
ఒకరికొకరం పరిచితులమైనా తెలియని ఆంతర్యం!
నాతోపాటుగా నువ్వూ మౌనంగా నడుస్తుంటావు
ఎందుకంటే చెప్పుకోడానికి మాటలేం మిగల్లేదుగా
నీగురించి నాకు, నాగురించి నీకు అంతా తెలిసినా..
ఒక్కోసారి నిశ్శబ్దం మాట్లాడతానని మొండికేస్తుంది
అంతలోనే ఆలోచనలు ఆనకట్టగా అడ్డుకుంటాయి!
ఉరుకు పరుగుల్లో ఇంకెక్కడ సమయం మిగిలిందని
ఉబుసుపోని కబుర్లు చెప్పుకుని సంభాషించుకోడానికి
నన్ను తలచి నీవు నిన్ను తలచి నేను నవ్విన క్షణం,
అది చాలదా ముచ్చట్లు ముగిసాయని మురియడానికి!
ఇంకా ఏదో దగ్గరవ్వాలన్న అత్రుత నీలో నాలో ఎందుకు
రా...ఇకనైనా నువ్వక్కడ నేనిక్కడ ఒకటిగా నిదురించేద్దాం
కలలోనైనా కొన్ని అనుభూతులను ఆస్వాధించుకుందాం!!

నా పల్లెలో

పల్లెలో ఏముందని పట్నమొచ్చి ఫోజ్ కొట్టబోతే
పిచ్చిదాన్ని అంటూ పల్లె నన్నుచూసి నవ్వింది
ఎందుకా వెక్కిరింపుమాటలో చెప్పి నవ్వమంటే...

నీ దగ్గరేముంది నువ్వు పెంచే నీలిగే ఓ కుక్కపిల్ల
నా పల్లెలోన పాలు ఇచ్చే పాడి పశువులు ఎన్నో

నడుమునైనా పూర్తిగా తడుపుకోలేని స్నానపుగది
నా పల్లెలోన జలకమాడ చెరువులు బావులు ఎన్నో

వెలుగు కోసమై వెంపర్లాడి వాడిపోయిన నీ మోము
నా పల్లె పండువెన్నెల్లో పరుచుకున్న పక్కలు ఎన్నో

గాలిలేని చిన్నిగదుల్లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి నీవు
నా పల్లెన ఆనందంగా ఆహ్వానిస్తూ పిలిచే చెట్లు ఎన్నో

నిన్ను పలుకరించే నేస్తం నీ కంప్యూటర్ నీ సెల్ ఫోన్
నా పల్లె నిండా పలుకరించి ప్రేమించే మనసులు ఎన్నో

సొంతంకాని సంతోషాలని కొనుక్కునే సొమ్ము నీదగ్గర
నా పల్లెలో డబ్బుతో కొనలేని ఆనందపు ఆస్తులు ఎన్నో

వద్దంటూ వదిలేసి వలస వెళ్ళిన నీకు ఏమని చెప్పను
నా పల్లెటూరి గొప్పలు చెప్పుకుంటూపోతే ఇలా ఎన్నెన్నో!!

నీ జాడలేదు

పలుకైనా పలుకలేదు ఒక కబురైనా పంపలేదు
ఏమైనావో ఎక్కడున్నావో వివరమే తెలియలేదు
ఎదను భారంచేసి ఎందు దాగినావో జాడనేలేదు!

నిట్టుర్పేదో వదిలే ఉంటావది నా చెవిని తాకలేదు
సందేశం ఏదో పంపే ఉంటావు నా దరికి చేరలేదు
నా ఏమరుపాటిది అనుకోనిదే ఊపిరి ఆడ్డంలేదు!

సూచాయిగా సూచనే చేసావు నేనది చూడలేదు
కనులు మూసి తెరిచే కునుకులోన కనబడలేదు
ఏల క్షణమైనా కునుకు వేసానో అర్థకావడంలేదు!

నా మోముపై అశ్రువక్షరాలు నీవు చదువలేదు
వెళ్ళొద్దని దారిలో నా మాటలేవీ నిన్ను ఆపలేదు
మూగబోయిన మనసు దూరాన్ని తగ్గించలేదు!

జ్ఞాపకాల ముళ్ళే గుండెలోదిగి నొప్పి ఆగడంలేదు
నీ నిరీక్షణలో కారిన కన్నీటిధార ఆవిరైపోవడలేదు
నిన్ను మరువమంటే మనసుమాట వినడంలేదు!

కలానికి వేవిళ్ళు


ఊహలతో ఊసులే చెప్పి వలచేవట
అందుకే నిన్ను వేదనే వరించానంది
ఉబుసుపోక వేసే వేషాలని వదిలేవా
వయసు మారాంచేస్తూ విరబూస్తుంది!

కోరికలే గుర్రాలై ఉరకలేయబోయెనట
అందుకే ఆశయమే కాలుజారిపడింది
ముక్కలైన మనసు అతికించబోతివా
మరపు లేపనమై గతం జ్ఞాపికౌతుంది!

బ్రతుకు ఆశతో ఏడడుగులు వేసెనట
అందుకే నిరీక్షణయే కౌగిలి కావాలంది
తమకానికి తలపుల్ని కాపలా పెడితివా
రెప్పలమాటున భావమై మిగిలిపోతుంది!

భావాలు కలలతో కాపురం చేసెనంట
అందుకే కామోసు కలమే కక్కుకుంది
కలాన్ని సిరా వేవిళ్ళంటూ వెక్కిరించబోవ
కవితలే పుట్టునని కాలం కబురుపంపింది!



అస్థిర జీవం

తటస్థంగా ఉండలేనన్న అసంతృప్తి ఆత్మను అనలేక
నిరాశ ఆమ్లక్షారాలని గొంతులో పోసుకుని గోలచేస్తూ
కళ్ళనే చెమ్మచేసె, ఆవేదనపు సాంద్రతను తెలుపలేక
మస్తిష్కమే వేదనతో పొంగ, మోమేమో ముసురుపట్టె!

రంగులేని వర్ణం లోలోన చిగురాశ స్పటికంగా జనించి
కనిష్టమైన కోర్కెలు గరిష్టమై జ్ఞాపకాల పరిభ్రమణంలో
ఆటపాటలకి దూరంగా ఆవేశపు ఆలోచనలలో అలసి
పాలపుంతలాంటి శరీరం అగ్నిగోళమై భగభగా మండె!

వెలుగు చూడలేని హృదయ దర్పణం పారదర్శకమై
కాలానికి వ్రేలాడదీయబడ్డ నిర్లిప్తత ఆశలవైపు చూడ,
ఒంటరితనంతో స్నేహం చేయనన్న జీవితం డోలకమై
బ్రతుక్కీ చావుకీ మధ్య ఊగిసలాడే యంత్రంగా మారె!!!