అంతరంగం

అంతరంగంలోకి తొంగి చూడాలన్న ఆశ ఎందుకు?
అక్కడేం కాలక్షేపపు కుటీరాలు నిర్మించబడి లేవు
సప్తస్వరాలు వినిపించే వలపు వాయిద్యాలు లేవు
సేదతీర్చే గాలితెమ్మెర్ల వింజామరలు అస్సలు లేవు
నా భావావేశవీచిక ప్రతిధ్వనుల శంఖారావాలు తప్ప!

అందని పొదరింట అడుగిడాలన్న ఆతృత ఎందుకు?
అంతర్ముఖాలతో అలజళ్ళురేపే అంతఃపురాలు లేవు
తివాచీ పరచి ఆహ్వానించ పచ్చిక పరిసరాలు లేవు
సెలయేటి స్వచ్ఛ జలపాతాల సిరులంతకన్నా లేవు 
నాలోనే దాగిన కంటిఊసుల కీచురాళ్ళ అలికిడితప్ప!

అందమైన నూతనోత్సాహ మది అన్న తలపెందుకు?
అంతర్గత ఆందోళనలకి కారణాలు ఇక్కడ వెదక లేవు
ప్రగల్భపు ప్రాకులాట పసిడి పలుకులిక్కడ విన లేవు
విఫలయత్నంతో అంతర్లీన అంతరంగాన్ని చూడ లేవు
నా బలమైన అనుభవసారాల కాలాక్షరసుమాలు తప్ప!


 నా ఈ "అంతరంగం" తో 300 పోస్ట్ లు పూర్తిచేసాను.
నేనందించిన భావాలకి ప్రేమాభిమానాలతో స్పందించి నాకు, నా ఆలోచనలకు అక్షర రూపకల్పనాస్ఫూర్తిని ఇచ్చి తప్పుల్ని కూడా సహనానురాగాలతో సరిదిద్దిన ప్రతిఒక్క అస్వాధస్నేహశీలాహృదయానికి శతప్రణామ పద్మాల మాలార్పితాలు.

ఓడిగెలిచాను

పలుకరించబోయి నీ మౌనం ముందు ఓడిపోయాను
కుశలమడి జవాబివ్వని నీనిర్లక్ష్యం ముందు ఓడాను
చూడాలని కలవలేని నీ నిస్సహాయత ముందోడాను
మరువాలి అనుకుని మరింత దగ్గరై ఓడిపోతున్నాను
ఆలోచనల వలలో చిక్కుకుని ఒంటరినై ఓడిపోయాను


                                 ****
కాని....ఎప్పటికైనా నేనోడి నీవు గెలిచిన గెలుపు నాదే
నన్ను నేనోడి నిన్ను గెలిచే ప్రయత్నంలో ఓటమి నీదే


                                 ****
చదువగలను మౌనంతో నీవు భావాలకి కళ్ళెంవేసినా
మనసులో కొలువైనావు కనులకు కనబడకపోయినా
కాలేవు నా తలపులకి దూరం నిన్ను నీవు మరచినా
తనువును వీడిన మనసు గెలిచిందని జీవించగలనా
గెలుపు నాదే నేను ఓడి నువ్వు గెలిచి ఆనందించినా

వలపు ముస్తాబు...

నేడు మరల ముస్తాబౌతున్నా
నీవొచ్చి మరలి వెళ్ళకూడదని
ఆశలనద్దా నుదుట తిలకంగా
నిరీక్షణలని కనులకి కాటుకగా
కెంపుల ముక్కెరని నీ గుర్తుగా
ఊసుల ఊహలని జూకాలుగా
పచ్చలహారాన్ని నీకు ప్రతీకగా
చేసిన బాసలని చేతి గాజులుగా
కలలని కట్టాను కటిమురుగుగా
చివరికి అద్దంలో నిన్ను చూస్తున్నా
రెక్కలు కట్టుకుని రివ్వున రాలేదని
నిన్నునీవు చూడ సందేశమంపనా
వస్తున్నావని కాకి కబురు అందినా
నా వాలుజడ గంటల్ని మ్రోగించనా
అందెల మువ్వలతో స్వాగతమననా
నవ్వుముత్యాలని ముద్దుగా ఇవ్వనా
కౌగిళ్ళ సంకెళ్ళతో నిన్ను బంధించనా
మెట్టెలతో ప్రేమకి సాక్ష్యం చెప్పించనా!

నమ్మేదెలా?

ఉచ్ఛ్వాస నేనుగా మారిపోతానంది నిచ్ఛ్వాస నీవైతే
ఒక నయనం వర్షించే మరోనయనం నిన్ను మరువమంటే
ఒక అధరం మౌనంకోరే మరోఅధరం నీపలుకు కోరితే
ఒక కర్ణం నీ ఉసులే వింటుంది వేరొకటి పేరైనా తలవకుంటే
ఒక మదిభాగం కౌగిలినికోరె మరోభాగం ఎడబాటడిగితే
ఒకవైపు ఉదరం దప్పికేలేదంది మరోవైపు ఆకలి అరుస్తుంటే
ఒక పాదం నీవైపు పయనం వేరొకటి వేరుగా అడుగేస్తే!
ఊహకందని ఈ చీలికలెందుకని నన్ను నేను ప్రశ్నించుకుంటే
రెండు నయనాలు చూసుకోలేమన్నాయి నువ్వునేనులా
రెండు పెదవులుకలిస్తే పలుకెక్కడిది మౌనం రాజ్యమేలుతుంటే
రెండు కర్ణాలకి ఊసులెక్కడివి మోముండగా ఎడబాటులా
రెండైన హృదయాలకి ప్రయోజమేమి విడివడిగా పెనవేసుకుంటే
రెండు కాని ఉదరపు ఆకలితీరినా ప్రేమతృష్ణ తీరునా ఇలా
రెండు పాదాలు కలిసి అడుగేయనిదే పయనం సాగుతుందంటే!
నీలోని నన్ను నే నమ్మేదెలా? నీవులేని నాతో చెప్పేదెలా?

అంతలా...

అంతగా నన్ను ప్రేమించకు
నీ కళ్ళలోకి నే తొంగి చూస్తే
నా మోము నాకే కనిపిఉంచేలా!

అంతగా నాలో ఇమిడిపోకు
కనులుమూసుకుని యోచిస్తే
నీకు నా ఎడబాటే గుర్తొచ్చేలా!

అంతలా నాకై వేచిచూడకు
బంధీనై సమయానికి రాకపోతే
ఓడి అలసి నీవే దోషివై నిలబడేలా!

అంతలా దగ్గరై ఏకమైపోకు
తనువులు రెండు ప్రాణం ఒకటని
లోకం అనుకుని మనం వేరైయ్యేలా!

పనికిమాలిన ప్రేమ

ఉదయాన్నే కలిసి ఉడాయిద్దామంటే "ఊ" అన్నాను
కట్టుబట్టలతో పాటు 50కేజీల బంగారం నీదన్నాను..
పాక్కుంటూ వచ్చి పిలవకుండానే పరిగెత్తిపోయావు
ఫోన్ కాల్ చేసి ప్రశ్నిస్తే బిజీగున్నానని కట్ చేసావు..
నీవంటావు పరికిణీపైట పారిపోవడానికి అనువుకాదని
నాకు తెలిసింది టామీగాడి అరుపులు బెదగొట్టాయని!

మధ్యాహ్నం ముహూర్తమంటే "హ్మ్" అనుకున్నాను
మండుటెండలో మారుతీకారైనా తెస్తాడని ఆశపడ్డాను..
దాహమని మినరల్ నీళ్ళుతాగి మరీ మూర్చపోయావు
సేదతీర్చి సంగతేందంటే సడిచేయకని కనుసైగ చేసావు..
నీవన్నావు వేడికి మిడ్డీ స్కర్ట్ లో నా కాళ్ళు కందేనని
నే కనిపెట్టాను నీ పిరికితనాన్ని కప్పడానికి ఇదో వంకని!

సాయంకాలం సరదాగా షికారుకు అంటే "సై" అన్నాను
విజిలేసి రమ్మంటావని కిటికీలు బార్లా తెరచి ఉంచాను..
బైక్ పై జివ్వునవచ్చి రయ్ రయ్యంటూ వెళ్ళిపోయావు
కారణం అడిగితే కిమ్మనకుండా 'కీ'ని కొరుకుతున్నావు..
నీవు చెప్పే కారణం నేవేసుకున్న జీన్స్ ప్యాంట్ 'టీ'షర్టని
నాకు తెలుసు గుమ్మం దగ్గర మానాన్న నిల్చున్నాడని!

రా......రా......అంటూ రాత్రివేళ నేనే రమ్మని పిలిచాను
నా చేత్తోనే అద్దాలని రాతిగంధం తీసి రెడీగా ఉంచాను..
దొంగచాటుగా గోడదూకి వచ్చి హీరోలా ఫోజ్ ఇచ్చావు
పగటివేళ పిరికివాడివై రేయిమాత్రం నీ బుద్ధి చూపావు..
నీవు చూస్తున్నది నా షిఫాన్ చీరలో దాగిన అందాలని
నాకు తెలిసింది పిరికి హృదయమెన్నడూ ప్రేమించలేదని!