మల్లెల మాటున...

విన్నవించుకున్న విరహవేదనని విని..
వాల్జడలో విరజాజులే వ్రేలాడేసుకు వస్తే
వడలిన విరజాజుల్లో వాడి ఎక్కడిదే అని
వాటేసుకుని నా వయ్యారమే వేడంటావు!

సంధ్యవేళ సన్నగా ఈలవేసి రమ్మన్నావని..
సన్నజాజి మాలలతో సొగసు విరబోయజూస్తే
సన్నని నడుము వంపే చాలు నలిగిపోతానని
సన్నజాజులేం సరికావు సౌందర్యరాశినంటావు!

చాటుమాటు సరసంలో తెలియని గమ్మత్తుందని..
చమేలీ పూలు కొప్పున చుట్టి చంగావి చీరకట్టుకొస్తే
సాయంకాల చమేలీ సువాసన రాతిరి మాయమని
చెంగావి చీరలో సన్యాసినితో సరసమాడినట్లంటావు!

నిండుపున్నమి జాబిలిని నొప్పించడమెందుకని..
నిత్యమల్లెపూలు పెట్టుకుని నిలువుటద్దంలో చూస్తే
పరిమళంలేని నిత్యమల్లెపూలు నిత్యారాధనకే అని
వెనకమాటుగా వచ్చి వెర్రిదానినంటూ వెక్కిరించేవు!

బుంగమూతితో నేనుంటే....బుట్టెడు బొండుమల్లెలని..
కుమ్మరించడం చూసి కందినమోముతో కెవ్వున అరిస్తే
ఏడుమల్లెలెత్తు సుకుమారి తొడిమతాకి కందిపోయెనని
జామురేతిరి తొడిమలుతీసి కోడికూసేవేళ కునుకుతీసేవు!

గీతలు-రాతలు

గీతలకేం తెలుసని చేస్తాయి గీతోపదేశాలు!!
అరచేతి గీతలుచూసి అఖండ సౌభాగ్యమని
అర్థంకాక అలికిన గీతల్ని అహా ఓహో అని
హస్తరేఖలతో జీవితాన్ని ఏం అంచనా వేస్తావు
చేతుల్లేక జీవిచడంలేదాంటే వెర్రిముఖం వేసేవు

గజిబిజిగీతలకేం ఎరుక గాడితప్పిన గమ్యాలు!!
నుదుటిపై గీతల్లో భవిష్యత్తు అంతా భవ్యమని
ఆకతాయిగా తిరిగి అదే అందిన ఆనందం అని
కష్టాల్లో కలిసిరాదని నుదుటిరాతనే నింధించేవు
ప్రయత్నం ఏం చేయకనే ఫలితాలని ఆశించేవు

సరళరేఖలకేం తెలుసని సహజీవన విధానాలు!!
నేలపై నిలువు అడ్డంగా గీతలేగీసి సరిహద్దులని
స్వార్ధసంస్కరణల చిందులనే విజయమనుకుని
విరిగిన మనసులకు మాటల లేపనమే పూసేవు
అద్దమంటి మదిని గీతకనబడకుండా అతకలేవు

గాట్లుచేసే గీతలకేం ఎరుక గాయాల సలపరాలు!!
పట్టింపు పగలతో శరీరంపై గాటుగీతలేసి శిక్షలని
రక్తం స్రవిస్తుంటే రంగొకటే అయినా మనం వేరని
ఆవేశంతో ఆలోచించకనే తృటిలో పరిష్కరించేవు
ఎన్నటికీ ఊపిరాగిపోని గీతలేవీ నీవు గీయలేవు

బంధాల మధ్య గీతలకి లేవు సంబంధ విలువలు!!
అనురాగాల తులాభారమేసి ఆపలేవు అడ్డుగోడని
పైకంతో వారధి కట్టి కాంచలేవు మమతల కోవెలని
అనుబంధమే తెగితే ముళ్ళు లేకుండా అతకలేవు
అంతరంగపు అడ్డుగోడలతో అందరిలో ఒంటరి నీవు

వలపు విశ్లేషణ

ప్రేమంటే తెలియకనే ప్రేమించాలనుకుని
ఏరికోరి ఎదను చూసి మరీ ఎంచుకుని...
దరకాస్తుకై దర్యాప్తులెన్నో చేసుకుని..ప్రేమిస్తే!
తెలిసిందది ఒక అసంకల్పిత ప్రతీకార్యచర్యని

వాదనలేల వలపు వలలో పడ్డాక అనుకుని
చెప్పుకున్నాం ఎన్నో కాలక్షేపపు కబుర్లని...
ఇచ్చుకున్నాం బహమతుల ఎరలని..ఇస్తే!
తెలిసింది ధనరాసులకది ఒక పరాన్నజీవని

కాలగమనంలో ప్రేమయే ప్రతిష్టంగా నిలవాలని
నమ్మకాన్ని నమ్మి కట్టాం కష్టాలకంచుగోడలని...
ఆకలితో అలమటించి జీవితయానంలో చెమటోడిస్తే!
తెలిసింది అదీ ఒక అనిశ్చల ఆకర్షణల పరావర్తనేనని

ఏమైనా ప్రేమంటే తెలిసీతెలియక ప్రేమించేసానని
చేతులేవో కాల్చుకుని ఆకులు నులుపుకుని...
కళ్ళెమేయలేని కోర్కెలతో అందలమెక్క ప్రయత్నస్తే!
తెలిసింది విధి చేతిలోన విఫలమయ్యే వక్రీకరణమని

తిట్ల కాపురం!

దొంగసచ్చినోడా.....నీకు ఇదేం పోయేకాలం!
తిట్టమనే తింగరోడా.....నీకిదేం మాయరోగం?
కోపంతో కాని కాపురానికి కళ్ళెం వేయబోతే
కసిరి, కొట్టి, గిచ్చి, రక్కి కొరికేయమంటావు!

చుప్పనాతోడా.....నీకు పూయాలి కొరివికారం!
కొవ్వెక్కినోడా.....నీదంతా తలతిక్క యవ్వారం
జాబిల్లివేళ జాజిమల్లెచెండు అడిగి అలిగానని
మండుటెండలో మంచమేసి కుమ్మమంటావు!

వెర్రిబాగులోడా.....నీకు ఎక్కింది ఎనలేని పైత్యం!
పోకిరోడా....నీవు నేనెన్నడు చూడని వింతచోద్యం
పట్టెమంచం పానుపేసి సరసానికి పండ్లు తెమ్మంటే
పళ్ళికిలిస్తూ పగటిపూట పనసపండ్లు పట్టుకొస్తావు!

గూట్లేగాడా.....నీకు అవసరమా ఈ విచిత్ర శోభనం?
పొగరుబోతోడా....నీలో ఉన్నది కేవలం కండకావరం
తొలిరేయి మురిపాలని వెండి పాలగ్లాసు చేతికందిస్తే
బంగారు బిందెడు బలమైన బాదాంపిస్తా పాలడిగేవు!

వచ్చేయ్!!

ప్రియా!...అని పులకరించిన మదిపలికింది
వ్రాయని ఊసుల ప్రేమలేఖ అందించింది!!
వెన్నెలవేళ వలపు వేడి నిట్టూర్పు విడిచే
పగటిపూట పరువం నీ ధ్యాసలో తడిచింది!!

తలచినదే తడువుగా పిలిచాను అనుకుని
రెక్కల గుర్రం ఎక్కి రివురివ్వున వచ్చేయ్!!

దారిలో విరజాజులు విచ్చుకుని ఉంటాయి
దోసిళ్ళతో దూసేసి దోచేసుకుని వచ్చేయ్!!

నీలి ఆంబరం అడ్డుగా రెపరెపలాడుతుంది
చీరగా నాకు చుట్టేయాలి తీసుకు వచ్చేయ్!!

తేనెటీగలు తీయనిరాగంతో కనుగీటుతాయి
వేచి ఉన్న నన్ను తలచి వేగిరం వచ్చెయ్!!

పిల్లగాలి కబుర్లు చెబుతూ చుంబనమిస్తుంది
మీసాలతో గుచ్చేసి తప్పించుకుని వచ్చేయ్!!

అలసివచ్చిన నిన్ను సేదతీర్చాలని నా శ్వాస..
తనువులోని ప్రతి అణువు దాసోహమంటుంది!!

"మత్తుమనిషి"

మత్తుమందు జల్లి మురిపించే మనసు నీదేనని
మాయమాటల మర్మమేదో చెప్పి మనసు దోచేసి
మగత నిదురోతున్నోళ్ళని లేపి మందుకొట్టలేదని
మందమెక్కిన నాలుకతో మొద్దుబారిన మెదడుతో
సారాలోని సారాంశమేదో చెబితే మత్తుదిగిపోవునా!

వింతరోగమేదో వచ్చెనని "విస్కీ"తో విందులేవో చేసి
బారుల్లో దూరి "బీరు" కొట్టినంతనే భారమే తీరునా!
రసికత తరిగిపోయెనని ఢ్రమ్ముతో "రమ్ము" కొట్టేసి
బ్రాండ్లే మార్చి "బ్రాంధీ" బాటిల్స్ తాగి తైతక్కలాడితే
జిజ్ఞాసలేని "జిన్" వంటి జీవితం జ్యూస్ గా మారునా!

కైపు ఎక్కించేది "కాక్ టెయిల్" అని కలిపి లాగించేసి
కిక్ అన్నంత "ఫెన్నీ" తో ఫేస్ వాల్యూ మారిపోవునా!
వైవిధ్యం కోసమని "వైన్" ని విడిగా తీర్థమని సేవించి
వట్టివేళ్ళ వంటిది "వోడ్కా" ఒక చలువ పానీయమని
మంచినీరులా గొంతు నింపుకుంటే దాహమే తీరునా!

"కల్లు"తో పాటు "బైజూ" "థెఖిలా" "సొజు" పేరేదైనా
మద్యమంటే "ఎథనాల్" విషం అని తెలిసి తీసుకుని
మత్తుతో మదమెక్కి మానవుడే మరో మృగంగా మారి
ఇంగితం కోల్పోయి వికృత చేష్టలతో వింతలోకమేగినా
మత్తు మనిషికి బానిసై జీవితభారం మోసి కడచేర్చునా!