వలపు విశ్లేషణ

ప్రేమంటే తెలియకనే ప్రేమించాలనుకుని
ఏరికోరి ఎదను చూసి మరీ ఎంచుకుని...
దరకాస్తుకై దర్యాప్తులెన్నో చేసుకుని..ప్రేమిస్తే!
తెలిసిందది ఒక అసంకల్పిత ప్రతీకార్యచర్యని

వాదనలేల వలపు వలలో పడ్డాక అనుకుని
చెప్పుకున్నాం ఎన్నో కాలక్షేపపు కబుర్లని...
ఇచ్చుకున్నాం బహమతుల ఎరలని..ఇస్తే!
తెలిసింది ధనరాసులకది ఒక పరాన్నజీవని

కాలగమనంలో ప్రేమయే ప్రతిష్టంగా నిలవాలని
నమ్మకాన్ని నమ్మి కట్టాం కష్టాలకంచుగోడలని...
ఆకలితో అలమటించి జీవితయానంలో చెమటోడిస్తే!
తెలిసింది అదీ ఒక అనిశ్చల ఆకర్షణల పరావర్తనేనని

ఏమైనా ప్రేమంటే తెలిసీతెలియక ప్రేమించేసానని
చేతులేవో కాల్చుకుని ఆకులు నులుపుకుని...
కళ్ళెమేయలేని కోర్కెలతో అందలమెక్క ప్రయత్నస్తే!
తెలిసింది విధి చేతిలోన విఫలమయ్యే వక్రీకరణమని

54 comments:

  1. మీ కవితని విశ్లేషించాలంటే ఎన్ని శాస్త్రీయ గ్రంధాలని తిరగవేయాలో :-) మొత్తనికి ప్రేమ ఒక మైకం అంతేనంటావా?

    ReplyDelete
    Replies
    1. శాస్త్రీయ గ్రంధాలెందుకండి!....సామాన్య శాస్త్రంలోని నాలుగు పదాలు చాలుగా :-)

      Delete
  2. నేను ప్రేమించనుగా.....ప్రేమించబడతాను:-)

    ReplyDelete
    Replies
    1. ఆహా....మంచి ఆలోచన :-) నేనూ ప్రేమిస్తాను

      Delete
  3. ప్రేమ విధిచేసే వింతగా విశ్లేషిస్తే ఇంక ఎవరూ ఎవరినీ ప్రేమించలేరు.

    ReplyDelete
    Replies
    1. ఎవరూ ప్రేమించరు అని అనుకోకు.....అయినా ప్రేమకి కొదవేంటి :-)

      Delete
  4. అమ్మో! నాకు తెలియదు గానీ... ప్రేమంటే ఇంత సంగతుందా?? పద్మార్పిత గారు...

    ReplyDelete
    Replies
    1. తెలీదు అంటే ఎలా? తెలుసుకోవాలి....తీరిక దొరికినప్పుడు ప్రేమించాలి

      Delete
  5. పద్మార్పిత గారు... ఇంత అందమైన కవిత రాస్తూ అందులో చక్కని సందేశాన్ని చొప్పించి నొప్పించకుండా మా మనస్సులో ఎక్కిస్తారే.. ఎలా సాధ్యం మేడం మీకు??

    ReplyDelete
    Replies
    1. మనస్ఫూర్తిగా స్పందించే మీలాంటివారుండగా నాకేంటి చెప్పండి.

      Delete
  6. " ఏమైనా ప్రేమంటే తెలిసీతెలియక ప్రేమించేసానని
    చేతులేవో కాల్చుకుని ఆకులు నులుపుకుని...
    కళ్ళెమేయలేని కోర్కెలతో అందలమెక్క ప్రయత్నస్తే!
    తెలిసింది విధి చేతిలోన విఫలమయ్యే వక్రీకరణమని "
    ........ ...............................కవిత చదివాక,
    కనుబొమ్మలు అప్రయత్నంగా ముడుచుకు పోయాయి.
    భావాన్ని ఆస్వాదించి బాధను దిగమింగడానికి గడిచిన
    మధ్య కాలం కాస్తా బరువుగా నిలిచి పోయింది.
    జీవితంలో తెలిసీ తెలియని వయస్సులోనే కాదు ,
    అనుభవాన్ని పండించుకున్న ఎంతో మంది ఈ లాటి
    క్లిష్టతర సమస్యలను ఎదుర్కుంటూ ఏదో అతీత మయిన
    వ్యాకులతకు ఇప్పటికీ గురి అవుతూనే ఉన్నారు .
    కవిత చదివిన ప్రతి వారికీ తానీకవితలో ఎక్కడో కదిలాననే
    భావన కలుగుతుందని నిక్కచ్చిగా చెప్పగలను .

    గుండెకు హత్తుకు పోయేలా సాగిన 'వలపు విశ్లేషణ ' లో
    విశ్లేషించడానికి ధైర్యం చాలడం లేదు .
    సరళి చాలా బాగుంది .
    అభినందనలు పద్మార్పితా !
    అందరి మన్ననలను అపారంగా అందుకుంటున్నావ్
    ఇంతటి మంచి సాహిత్యాన్ని అందిస్తూ .

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. అమ్మో! శ్రీపాదగారు.....కనులు భృకుటిపడినాయని, భాధను దిగ మ్రింగుకున్నారని చదివి తడతారు అనుకున్నాను, మెచ్చుకున్నారుగా....ఎగిరి గంతేస్తున్నా....నెనర్లు.

      Delete
  7. పిల్లకాకులకేం తెలుసు ఉండేలు దెబ్బలు .....ప్రేమించేవారికేం తెలుసు సంపదలేని సంసారం దిబ్బలు:-P

    ReplyDelete
    Replies
    1. వామ్మో! మీ పేరు తెలీదు, సామెతలతో బెదరగొడతారని అస్సలు తెలీదు!

      Delete
  8. భళారే భళా...నీ ప్రతిభకి మరో కళికితురాయి. కొనసాగించు అర్పితా నీ కవితాయానం. సదా మా మనసులో నిలిచిన వనిత

    ReplyDelete
    Replies
    1. హవ్వారే హైలెస్సో అంటూ ఎగిరిపోతుంది మనసు :-) థ్యాంక్యూ సర్

      Delete
  9. ప్రేమ పుట్టడం గిట్టడం అంతా మిధ్య.

    ReplyDelete
    Replies
    1. ప్రేమ వేదాంతం ఏంటో :-)

      Delete
  10. ప్రేమను విశ్లేషించి ప్రేమించేవారి గురించి చెబితే అది ఆచరించగలం. అసలు ప్రేమించవద్దు మహాపాపం అంటే ఏమనగలం :-)

    ReplyDelete
    Replies
    1. ప్రేమించు వద్దు అని చెప్పడానికి నేనెవర్ని......అది నిర్ణయించుకోవలసింది ఎవరికి వారే కదా అనికేత్

      Delete
  11. చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను బ్లాగు చూసే దాదాపు నెల అవుతోంది. మీ కవితా కమలాల సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోయాను.
    కానీ.. ఇప్పుడు తీరుబడిగా అన్ని చదివాను. వాటి విశ్లేషణలను విడివిడిగా కన్నా ఒకే చోట రాస్తే బెటరని.. ఇలా రాశాను. పద్మగారు మీరు చాలా పరిణితి చెందారు. కవితల్లో అనుభవాల కలువ రేకులను, అనుభూతుల సుగంధాలను కలిపి... కవనమాలికలను అల్లుతున్నారు. రెండు మూడు సంవత్సరాల నుంచి మీ కవితలను ఫాలో అవుతున్నాను కాబట్టి... నా వ్యక్తిగత అభిప్రాయమిది. మీ తాజా కవితల విశ్లేషణలు... ముందుగా "మత్తు మనిషి" గురించి... చాలా బాగా రాశారు. మత్తులోకి దిగితే భారం తగ్గుతుంది. కానీ అది మత్తు దిగినంత వరకే.. తర్వాత అసలు బాధకు హాంగోవర్‌ కలిసి... మరింత చిత్తు. సూపరండీ. అయినా మత్తు ఇన్ని రకాలు మార్కెట్‌లో దొరుకుతోందో కదా. "వచ్చేయ్‌" అని పిలిచి.. ఎలా రావాలో కూడా చెప్పి.. అంత రొమాంటిక్‌ చిత్రం పెట్టి... వస్తే ఎలాంటి అనుభవం దొరుకుతుందో కూడా ఊరించి... (ఏమనుకోకండి).. అలా పిలిస్తే... అసలు రాకుండా ఉండే దుర్మార్గుడు ఎవరండీ... మనసు అలా, అలా... ఎక్కడికో విహరించింది... మీ కవితా నాయకి వచ్చేయమంటుంటే. మీ "వలపు విశ్లేషణ" లో వికల ప్రేమ కళ్ల ముందు కనిపిస్తోంది. చాలా మంచి పదాలు, మంచి పద ప్రయోగాలు ఉన్నాయి. రాటు దేరుతున్నారు. కలువ రేకుల లిఖిత పద పద్మార్పితకు... నా సలాం.

    ReplyDelete
    Replies
    1. సతీష్గారు మీ విశ్లేషణ చక్కగా ఆమె భావాలని కాచి వడపోసినట్లున్నాయి. అయినా నాదొక డౌట్ ఇంతింత పేరాలు వ్రాయడానికి పదాలు ఎక్కడ దొరుతాయి మీకు :-)

      Delete
    2. ఏం చెప్పారు సార్....ఇలా మీరు విశధీకరిస్తే మాలా చిన్న అర్థం కాని బుర్ర ఉన్నవాళ్ళకి మేలుచేసిన వారైపోతారు :-)

      Delete
    3. హమ్మయా....సతీష్ గారు ముందుగా రిలాక్స్ అవ్వండి (పాటవింటూ)
      ఇంక మీ కమెంట్స్ గురించి విశ్లేషించడంకన్నా....కుదురుగా "No Words To Express My Feelings అంటే హుందాగా ఉంటుందేమో!":-) ఎంతైనా కూసింత తెలివైన దాన్నేనండీ నేనూను. Thank you.

      Delete
    4. సంధ్యగారు.....నాకు ఈ డౌట్ వచ్చిందండోయ్ :-)

      Delete
    5. ఆకాంక్ష అంటే నేను అర్థం కానట్లు రాస్తున్నానా:-) సతీష్ గారు మీకు పనిపెడుతున్నాను తిట్టుకోకండి, నేను వివరిస్తే చదివేసి సంతోషించేస్తానుగా

      Delete
    6. నా విశ్లేషణకు ఇంత మందికి నచ్చినందుకు ధన్యవాదాలు

      Delete
  12. ప్రేమించే మనసులను ప్రలోభాలకు లోనుకాకుండా వుండేలా సున్నితంగా చెప్తూ ప్రేమ పాఠాలు చెప్పడం మీ కలానికి వెన్నతో పెట్టిన విద్య పద్మార్పిత గారు. చిత్రం కూడా అదిరింది ఎప్పటిలానే.. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. ఏం వెన్నతో పెట్టిన విద్యండీ బాబు......నేను చెప్పే వేడికి కరిగి నెయ్యిగా మారిపోతుందంటున్నారు ఆ విద్య :-)

      Delete
  13. ప్రేమకు నిఘంటువులా ....
    అభినందనలు పద్మార్పిత గారు! చక్కని పోస్టింగ్!

    ReplyDelete
    Replies
    1. మీ ఈ ప్రశంస ప్రేరణాత్మకం....ధన్యోస్మి.

      Delete
  14. ప్రేమలో ఇది మరో కోణం
    వలపుల వాకిట్లో రణం
    ఆప్యాయతల పందిరి తోరణం
    వెలుగు చూసేన కొత్త కిరణం

    ReplyDelete
    Replies
    1. మీ కవితా వ్యాఖ్యాల అల
      మదిని తాకి ఎగసింది అలా
      ఎప్పుడూ చెదరనీయకండి ఈ కల
      మీ అభిమానం ఎప్పటికీ నిలవాలి ఇలా

      Delete
  15. పద్మా నావల్ల కావాడంలేదు నీ భావప్రవాహాన్ని తట్టుకోవడం. ఏంటి ఆ పదాల ప్రయోగాలు ఎక్కడివి ఇన్ని ఆలోచనా తరంగాలు.

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారు ఎండవేడి వరంగల్ లో ఎక్కువగా ఉండి అలా అంటున్నారే కానీ......భాషాభిమానం మెండైన మీకు ఇదో లెక్కా :-

      Delete
  16. సైన్స్ ఇంగ్లీష్ లో చదువుకుని తెలుగు పదాలని అర్థం చేసుకోవడం కష్టమే , కానీ మీరు కష్టమైన పనులని ఇష్టంగా చేయడం మీకు సరదా.:) మొత్తానికి మీ విశ్లేషణ బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. నీవు కూడా నాలాగే కష్టమైన వాటిని ఇష్టంగా చేస్తావు కదా :-)

      Delete
  17. పరిపక్వత చెందని వయసులో పుట్టేది ప్రేమని నేననుకోను....అదో అద్భుతమైన భావన..నిజంగానే మీ విశ్లేషణ బాగుంది..అది కవితాత్మకంగా చెప్పడం ఇంకా బాగుంది...మొత్తానికి తెలుగు బ్లాగు లోకంలో సెలబ్రటీ అయిపోతున్నారు ....శుభాకాంక్షలు ...

    ReplyDelete
    Replies
    1. నేనూ మీ భావాలతో ఏఖీభవిస్తాను.....సెలబ్రిటీని అంటూ అభిమానుల నుండి సెపరేట్ చేయకండి, మీలో ఒకదాన్ని. ధన్యవాదాలు.

      Delete
  18. ఏంటేంటి ఇంతలోనే ఇలా మారిపోతే ఎలా ప్రేమార్పితా....ప్రేమను మార్చి మార్చి ప్రేమించమని వెరైటీ విశ్లేషణ ఇస్తారు అనుకున్నా :-)

    ReplyDelete
    Replies
    1. ప్రేమా దోమా జాంతా నహీ అంటే మీరు నేను మారిపోయాను అనాలి....అందులోని ఒడిదుడుకులు చెప్పానంతే :-)

      Delete
  19. ఆకలితో అలమటించి జీవితయానంలో చెమటోడిస్తే!
    తెలిసింది అదీ ఒక అనిశ్చల ఆకర్షణల పరావర్తనేనని
    నెకే సాధ్యం ఇలాంటి సరళీకృత పదజాలం

    ReplyDelete
    Replies
    1. ఎలా ఉన్నారు.....ఈ మధ్య బిజీ అనుకుంటాను. థ్యాంక్సండి

      Delete
  20. మేడం జీ ఎప్పుడైనా నాగు లైన్లు నే వ్రాసినవి కూడా చూడండి. అలాగే రిప్లైస్ ఇవ్వండి మేడం

    ReplyDelete
    Replies
    1. చూడకుండా ఉంటానా....ఆ కళ్ళతోనే ఆకర్షించేసావు, నాగు ముక్కల్లో మొత్తం సారాంశం చెప్తావుగా

      Delete
  21. Its nice Padmarpita garu.

    ReplyDelete
  22. Marvelous Madame Its super:-)

    ReplyDelete
  23. ela rastarandi asalu super andi miru

    ReplyDelete
    Replies
    1. welcome to my blog padma. :-) thank you.

      Delete
  24. ప్రేమ గురించి తెలిస్తే ఓస్ ఇంతేనా అని ప్రేమించరు ఎవరూ...మీరు తెలియ ప్రేమించారు. వట్టి అమాయకుల్లా ఉన్నారు :-)

    ReplyDelete