సరాగాలు!!!

నీ చిలిపి చూపులు, అవిచేసిన బాసలు
మైమరపించే నీ అనురాగపు మాటలు
నా మనసును దోచెను నీ చిరునవ్వులు
మానోహరా నిజంచేయి నా బంగరుకలలు
ఎన్నో కధనాలు, మన వలపుల కవనాలు!!!

దూరమైతే గతితప్పును నా హృదయ లయలు
ఎడబాటులో నా మది రాల్చునెన్నో నిప్పురవ్వలు
నీవు దరినుంటే చాలు అవే నాకు ఋతుపవనాలు
మన కౌగిళ్ళ ఆవిరిలో వర్షించును ప్రేమ మేఘాలు
అవి వెన్నెల ఒడిలో చెప్పుకునెడి కమ్మని ఊసులు!!!

మూడుముళ్ళువేసి నడిచేయి నాతో సప్తపదులు
కొంగునబంధించక అందించెద నా సొగసుపరువాలు
అవి మనసు పలకాలపై లిఖించు మధుర జ్ఞాపకాలు
నా ప్రేమలో మంచువలె కరగిపోనీ నీ ప్రేమ శిఖరాలు
ఏకమైనామంటే సాగరాన్న సాగు అమృతమధనాలు!!!

ఏమని బదులీయను!!

ఏమని బదులీయను నా దగ్గర జవాబులేని ఆ ప్రశ్నలకు...
ఏమైనాయి నీవు ఊహించిన ఆ మధురక్షణాలనడిగితే,
నాతో నడచిన నా తోడు ఏదని నా నీడే నన్ను అడిగితే!!

ఏమని బదులీయను సంధ్యవేళ సూర్యుడడిగిన ప్రశ్నకు...
వేసారినవెన్నెలే వేడెక్కి నాపై రేయంతా మంటలు వెదజల్లేస్తే,
మానసచోరుణ్ని బంధించలేని నా నిస్సహాయతను గేలిచేస్తే!!

ఏమని బదులీయను రంగులన్నీ ఏకమై అడిగిన ప్రశ్నలకు...
వాన నీరెండా కలిసి అపురూపమైన ఇంధ్రధనస్సుగా ఏర్పడితే,
ఒంటరినై కనే నా రంగుల కలలో అంతా నలుపే కనపడితే!!

ఏమని బదులీయను మేఘం ఉరిమి అడిగే ఆ ప్రశ్నకు...
వానకి పోటీ అంటూ నా కన్నీటిధారలే కుంభవృష్టిగా కురిస్తే,
ప్రేమ తీయనైనదైతే మరి కన్నీరేల ఉప్పగా అని ప్రశ్నిస్తే!!

ఏమని బదులీయను బేలగా నా ఊపిరి అడిగే ప్రశ్నలకు...
నీవులేవని తెలిసాక ఇంకా నేనెందుకంటూ నన్నే అడిగితే,
నీ ప్రాణమే నీకు పరాయిదైనదంటూ దూరంగా నన్నేనెడితే!!

అతడా >< ఆమెనా?


ఇరువురి ఆలోచనల్లో, పనిచేసే విధానంలో బోలెడంత వ్యత్యాసం!
అందుకేనేమో ఆమెపై అతనికి అతనిపై ఆమెకి ఆ అధికారం!
ఏమైనా ఇది మాత్రం కేవలం చిరు చమత్కార ప్రయత్నం!
మీరంతా చదివి ఆనందిస్తే నాకెంతో సంతోషం!!!!

గమనిక:-నవ్వొచ్చినా రాకపోయినా నవ్వాలి మరి:-)

షీ/She >< హీ/He
బహుళ ప్రక్రియలపై ఒక కన్నేస్తే...
ఆమె: ఒకే సమయంలో బహుళ పనులు చేయగలదు. టీవీ చూస్తూ వంటచేస్తూ ఫోన్ మాట్లాడగలదు.
అతను:ఒక సమయంలో ఒకే పని చేయగలడు ( సింగిల్ ప్రాసస్ అన్నమాట) కావాలంటే పరీక్షించుకోండి. చూస్తున్నప్పుడు కాల్ వస్తే కట్టేయకుండా మాట్లాడే వాళ్ళెంతమందో మరి మీరే చెప్పాలి.

భాషా పరిజ్ఞానం పై దృష్టిపెడితే...
స్త్రీ: సులభంగా అనేక భాషలను తెలుసుకోగలదు కానీ నిర్ణయాలను తీసుకుని పరిష్కరించడంలో కాస్త వెనుకే ఉంటుంది.
పురుషుడు: భాష నేర్చుకోలేడు కాని పరిష్కార మార్గాన్ని సులువుగా అన్వేషించగలడు.
ఒక 3 సం!!ల బుజ్జిది 3 ఏళ్ళ బుజ్జిగాడికన్నా మూడురెట్లు అధికంగా పదజాలాలని ఉపయోగించగలదు.

విశ్లేషణాత్మక నైపుణ్యం.....
షీ: ఒక క్లిష్టమైన మ్యాప్ ఏదైనా చూసి అర్థం చేసుకోవలసి వస్తే కాస్త ముందు కంగారుపడుతుంది. ముందుగా దాన్ని ఒక పిచ్చిగీతల చిత్రం గానే ఊహిస్తుంది (ఎంతైనా ముగ్గులువేసే ముదితకదండీ).
హీ: మెదడంతా విశ్లేషణాత్మక ప్రక్రియా స్థలమే. ఇలా చూడగానే అలా అర్థం చేసుకునే పరిజ్ఞానం ఈ విషయంలో మెండు.(హీస్ అంతా కాలర్ ఎగురవేసుకోండి).

డ్రైవింగ్ విషయంలో...
మేల్: కారు డ్రైవింగ్ విషయంలో దూరంగా ఉన్న వస్తువులను సులువుగా పసిగట్టి దిశను వెంటనే మార్చి వేగంగా నడుపగలడు.
ఫిమేల్: ఈ విషయం లో కాస్త స్లో అనే చెప్పాలి దూరంగా వస్తువుని ఆలస్యంగా గుర్తించి దానిపైనే దృష్టిని నిలపడం వల్లనే అతని ప్రక్కన ఆమె ఉంటే "జాగ్రత్త" "ఓష్" " మెల్లగా నడపండి" "భగవంతుడా" "ఓ గాడ్" అంటూ ఉంటుంది . (ఇది అతను పట్టించుకోడు, వేరో విషయం అనుకోండి).

అబద్ధం.....
లేడీస్: చాలా సార్లు అతను ఆమె ఎదురుగా అబద్ధం ఆడినప్పుడు ఆమె సహజసిద్ధమైన మెదడు సూపర్ పవర్ తో ముఖ కవళికలతో 70%, శరీర భాషతో20% మాట్లడే పదాలను బట్టి 10% పూర్తి 100% అబద్దం చెపుతున్నాడని గమనిస్తుంది.
జెంట్స్: ప్చ్.. ఈ పవర్ లేదు పాపం. అందుకేనేమో అతడు అతడితో సులువుగా అబద్ధం చెప్పగలడు.
(అబ్బాయిలు అందుకే మీ గర్ల్ ఫ్రెండ్ కి అబద్ధం చెప్పలనుకుంటే మొఖానికి ముసుగేసుకునో, ఫోన్ లొనో, లెక లైట్స్ ఆర్పేసో అబధం చెప్పంది, కళ్ళలోకి చుసి చెప్పే సాహసం చేసారో కుమ్మేస్తారు...తస్మాత్ జాగ్రత్త)

సమస్య.....
మగ: సమస్యలెన్నైనా వాటిని విడగొట్టి ఒక్కోదానికి పరిష్కారాన్ని చివరికి కనుక్కుంటారు. అందుకేనేమో వారు అలా ఆకాశం వైపు చుస్తూ ఆలోచిస్తూ, వారిని పలుకరిస్తే విసుగు చెందుతారు ఎక్కువగా.(కొందరు అలా మైళ్ళకొద్ది దూరం నడిచేస్తూ ఆలోచనల్ని రింగు రింగులుగా పొగరూపంలో వదిలేస్తుంటారు)
ఆడ: ఈమె పరిష్కారించడం మానేసి అది ఎవరికో ఒకరికి చెప్పుకుని దానిగురించి అక్కడితో వదిలేస్తుంది( వీలుంటే ఒకసారి ముక్కు ఛీది కుదిరితే నాలుగు కన్నీటి బొట్లురాల్చి) అంతే ఇంక అయినా కాకపోనా పట్టించుకోదు.
(అందుకే రాత్రి భర్తకు అవి ఇవి చేరవేసి ఆమె ప్రశాంతంగా నిదురపోతుందని ఆయనేమో తిరిగే ఫ్యాన్ రెక్కలు లెక్కిస్తుంటాడని నానుడి)

కావలసినవి....
ఔరత్: సంసారం, పిల్లలు, కుటుంబం, బంధువులు, (ఇంకేం కావాలంటే... మరి అన్నీ కావలసినవే)
ఆద్మీ: మంచి ఉద్యోగం, విజయం, అంతస్తు, తాహతు, స్నేహితులు, మద్యం అలవాటుంటే పార్టీలో ఒక పెగ్ అంటూ ఫుల్ తో ఆపలేక హైరానా పడతాడు. (మంచి మాటతో, ఒక టీ ఇస్తే చాలు పొంగిపోతానంటూ ఇంకేవో ఊహించుకుని పొంగిపోయే వారుకూడా లేకపోలేదులెండి).

వాక్చాతుర్యం....
ఈ విషయంలో నైపుణ్యమంతా ఆమెదే.....ఆమె పరోక్ష పదాలను ఎక్కువగా వాడితే, అతను అన్నీ డైరెక్ట్ గానే చెప్పాలనుకుంటూ అప్పుడప్పుడు దెబ్బలు తింటుంటాడు అంటే బాగోదేమో.
ఒక కాఫీ షాప్ ని చూసిన వెంటనే ఆమె "మీరు బహుశా కాఫీ తాగాలనుకుంటున్నారేమో అంటుంది (ఆమెకి తాగాలని ఉంటుంది)....గమనించారో లేదో అతను మాత్రం కాఫీ తాగుదాం రా అంటాడు.
ఎమోషన్స్ & ఫీలింగ్స్ విషయానికి వస్తే...
మహిళలు ఆలోచించకుండా మాట్లాడితే, పురుషులు ఆలోచించకుండా పనిచేస్తారు...
ఇది ఎంతమంది ఒప్పుకుంటారో లేదో తెలీదుకానీ ప్రపంచంలో ఎక్కువ శాతం మగ ఖైదీలే ఉన్నారనేది మాత్రం వాస్తవం.:-)

నాతో-నీలో

ఏమాశించి ఏకమైనాయో ఇరుమనసులు ఇలా చెలిమితో
వీడిపోనైనాలేదు ఉండనైనాలేదు నీవు నాగుండెలయలో
నీకు నీవే చేరువైనావు నన్ను మరిచానన్న నెపముతో
నాపై ఈ అభియోగమేల నేను మైమరిచానని మత్తులో
సాక్ష్యాలు కావాలా పగిలిన నాహృదయపు సంతకాలతో
నలుపెక్కిన గోరింటను కానలేదా వధువైన నా చేతులలో
పల్లకీలో పయనమైనాను నీవేసిన భారమైన పలునిందలతో
మౌనంగా మనసు రోధిస్తున్నా మోము నవ్వింది నలుగురిలో
మిగిలిందేంటో కోల్పోయిందేమో తెలియకుంది ఈ ఎడబాటుతో

ఒకవేళ నిన్ను నేను మరవాలని శాసిస్తే నీవు ఈ జన్మలో.......
ఒట్టేసి చెపుతున్నా......నేలనే చీరగా చుట్టేసుకుంటాను నాతో!!!

హారర్ అంటూ హడలెందుకు?

దెయ్యాలకి దండుకోవడం
పిశాచాలై పీక్కు తినడం
భూతాలను బురిడీకొట్టించడం
నేర్పింది మానవజాతైన మనం!
ఇంకెందుకవ్వంటే మనకి భయం?

శాఖినీ...ఢాఖినీ అంటూ
హాం ఫట్! ఛలో ఛట్ అంటూ
ఆత్మ...ప్రేతాత్మలున్నాయంటూ
మనచెడుని మనమే తలచుకుంటూ!
లేనివి ఉన్నాయంటూ వాదనలెందుకు?

విభూధి పూనకాలతో
మాయమంత్ర తంత్రాలతో
మసిపూసుకున్న ముసుగుతో
పరులను భయపెట్టాలన్న నెపముతో!
మంచిని మరచి ఎందుకిలా దోచుకోవడం?

మానవత్వంతో మనం మసలుకుంటే
దెయ్యం దరిచేరను పొమ్మంటుంది
పిశాచి పూలతో గులామునంటుంది
భూతం భువి నీదేనంటూ ఏలమంటుంది!
ఇక పదండి…హారర్ అంటూ హడలెందుకు?

తలవాలని తలవకు

నన్ను తలచే తీరిక లేని నిన్ను
నే తలుస్తున్నా తీరిగ్గా కూర్చుని
తలచిందే తడువుగా మేఘం వర్షిస్తే
నే తాకిన ప్రతిచినుకులో నీ మోముకని
వేయికళ్ళతో ఎదురు చూస్తున్నా నీవస్తావని!

నన్ను నే వెలి వేసుకున్న నాతో
నీవేం స్వగతం చెప్పమని కోరేవు
కళ్ళలోకి చూసి నన్ను నీవు చదివి
తడిసి ముద్దైనానని తెగ సంబర పడేవు
నీలో దాగిన నన్ను ఎన్నటికీ నాలో కానలేవు!

తలవాలని తప్పనిసరై తలపుల్లో తడవకు
మది నన్ను కోరినవేళ మభ్యపెట్టి దాన్ని
మాయచేసి చిరునవ్వుని లంచంగా ఇవ్వకు
గుర్తుకు రానని సమర్ధించుకునే నెపంతో
మరిచానన్న మరుపులోనే పలుమార్లు తలవకు!

ఇదిచాలదా!

వర్షించిన మేఘం నిన్నేం మాయచేసింది
ఒంటరిగా తడవాలన్న కోరికను నీలో రేపింది!
వానలో తడవడం అంత ఇష్టమైతే
నా కనురెప్పలమాటున ముద్దైపో....
మేఘాలు వానై మనుషుల్ని తడిపేస్తే
నా కన్నీటిధారలో నీవు మొత్తం కరిగిపో....
ఋతుపవనాలతో పనేల నీ తలపుల జడివానకి
ఆవిరైన నీ దూరమే చాలు కన్నీరై కురవడానికి!

ఎదపై తన్ని ఎరుపెక్కిన నామోము గాంచింది
ఎదలో దాగిన ఎర్రని తనమోము చూడకుంది!
చెక్కిళ్ళపై ఎరుపుకై నీవు ఆశపడితే
నా గుండె నలుమూలల దూసుకుపో....
గుండెలయకై సిరధమనుల్లో రక్తం ప్రవహిస్తే
అవితాకి ఎరుపెక్కిన చెక్కిళ్ళతో మెరిసిపో....
ఆయుధాలతో అవసరమేల నే అంతమవడానికి
నీ ఛీత్కారమే చాలదా నే కనుమూయడానికి!

మీ అందరిలో....

అరిగిన కుంచెతో అందాలు అద్దనా
పూరించని చిత్రానికి నా పేరుపెట్టనా
మెప్పించలేని మాటలు పలుకగలనా
జగమెరిగినవాడి జాతకం నే చదవనా!

బ్రతకలేని భావాలు ఎన్నని వ్రాయగలను
మదిమెచ్చకుంటే మెదడుకు అందించను
మరపన్నదేలేని నన్నునేనేం తలుచుకోను
మనసులోనే పదిలమంటే మెప్పులేం కోరను!

మీరే నిండిన మోముకి అలంకారాలెందుకు
పూలై విరిసివాడే పేరుప్రఖ్యాతులు ఎందుకు
మంచి చెబితే ముళ్ళైనా మణిహారమే నాకు
గుచ్చుకుని భాధలో గుర్తొస్తుంది తడవతడవకు!