ఎందుకు?

 దరహాసానికి దరకాస్తెందుకు
దండించి దరహాసమెందుకు?

మదిభావాలకు ఉనికెందుకు
మనసులేని మనుగడెందుకు?

వేదనగాటుకి లేపనమెందుకు
అతికినమదికి నగీషీలెందుకు?

వాస్తవాలకి వాస్తుదోషమెందుకు
వరమిస్తూ వంక పెట్టడమెందుకు?

అంతర్ సౌందర్యానికి అత్తర్లెందుకు
అద్దెఅందానికి ఆడంబరమెందుకు?

ముఖస్తుతిమంత్ర మాటలెందుకు
మాయలో మర్మానికి మత్తెందుకు?

అక్షర అరంగేట్రం

అక్షరాలతో అరంగేట్రం చేయబోయి...
కుప్పిగంతులే వేసి కూచిపూడి ఇదని
కోలాటమాడి భరతనాట్యం అనుకోమని
కథాకళి చేసి కాలు బెణికి కట్టుకట్టుకుని
కధక్ చేస్తే అర్థమైంది ఆరంభం ఇలాకాదని
గెంతులేస్తే నాట్యం, పదాలల్లితే కవిత్వంకాదని

అక్షరాభ్యాసమంటూ అడుగులేయబోయి..
తప్పటడుగు వేయకుండా సంభాళించుకుని
భావాక్షరాలతో నర్తించబోయా వీధిభాగవతాన్ని
మణిపురీనృత్యాన్ని, ఒడిస్సీ, తెయ్యం అనుకుని
మోహినీఅట్టాన్ని, తమాషా, కాదు యక్షగానమని
ఆడబోతూ అనుకున్నా భావంలేని కళకి జీవంలేదని

అక్షరాలకి భావాల మువ్వలెన్నో కట్టి గెంతబోయి..
నాట్యమని పడిలేచి అక్షరాసరాతో ఆత్మ సంతృప్తిని
వర్ణచిత్రాలకి అక్షరాలని జతచేసి ఆనంద అభిమానాన్ని
పొందాలన్న ఆశతో బాంగ్రా, ఝుమర్, నౌటంకీ నృత్యాలని
తెలియక కజ్రీ, జత్రా, ఛావ్, గర్భా, ఛక్రీ, స్వంగ్. బిహూలని
కలిపి పులినాట్యం ఆడబోతూ తడబడుతున్నా తప్పేమోనని


2008 నవంబర్ చివరి వారంలో వ్రాయడం ప్రారంభించిన నా అక్షర అరంగేట్రం ( మొదటి కవిత వ్రాసాను ) ఇప్పటికి ఐదు వసంతాలు పూర్తిచేసుకుని నా కవితాప్రస్థానం మీ అందరి ఆశిస్సులూ కోరుతూ మీముందు ప్రణమిల్లుతున్నది._/\_

భారతీయ నృత్యాల పేర్లని కొన్నింటిని కవితాక్షరాలతో అల్లాలన్న నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీ పెద్దమనసుతో ఆస్వాధిస్తారన్న మరో ఆశతో......

సాహసమేల!


చలిగాలికి నిను తాకాలన్న తపనేల!
వలపువిరహ సెగనై నే నిను తాకగా

నీరెండ లేతకిరణాల వెచ్చదనం నీకేల!
నా మునివేళ్ళు నీ నుదుట నర్తించగా

వానజల్లు నిన్ను తడిపి మురియనేల!
సుగంధ పరిమళ స్వేదమై నే తడపగా

చిగురాశలకు నిన్ను చుట్టేసే తాహతేల!
చక్కదనాల చుక్కను నీ చెంతనుండగా

సప్తస్వరాలు కనుసైగతో నిను పిలవనేల!
సరిగమ శృంగారనాదస్వరమే నే ఊదగా

చీకటిరేయి నిను బంధించి భయపెట్టనేల!
నాకురుల వింజామరలు లాలిలా జోకొట్టగా

పూలకి మత్తుజల్లి మాయచేసే మర్మమేల!
ప్రేమమత్తుకి కొత్తదనాన్ని నేను పేనానుగా

ప్రకృతికి మన ప్రణయమంటే పరిహాసమేల!
జగతికే ఈర్హ్య పుట్టేలా నే ప్రేమను పంచానుగా 

                            *******
                      
                                                                                                        

మాననిగాయం

కన్నీరంతా కలంలో నింపి కాగితాన్ని తడిపితే
వియోగం హద్దుదాటి కవితగా మారిపోయింది
అప్పుతెచ్చి అక్షరాలతో వేదనాదప్పిక తీర్చబోతే
పదాలు కరువై అసంపూర్తి పంక్తి చిన్నబోయింది

ముగియలేదని ఊపిరాపి నిండుజీవితాన్ని కోరితే
స్మృతులెగసి నిరీక్షణాశృవులై ఆడ్డుకట్టని తెంపింది
ఇంకిన కన్నీరు కనబడనీయకుండా నవ్వేయబోతే
ఒంటరితనపు ఎడారి జ్ఞాపకాలని ఒయాసిస్సులంది

ఓటమే శత్రువుగానెంచి నిబ్బర అస్త్రం సంధించబోతే
ఎక్కుపెట్టిన బాణం గురితప్పి నన్నే గాయంచేసింది
కలసిరాని కాలాన్ని కసితో కసురుకుని జీవించబోతే
గతి నేనేనంటూ మృత్యువు పరాయిపంచన చేరింది

గాయం కనబడకుండా మనసుకి ముసుగేయబోతే
అలిగిన మది ఏడ్వలేక తనని తానే ఓదార్చుకుంది
గమ్యానికి ఆశ్రయం ఇవ్వబోయి ఆశలతో గూడల్లితే
నిరాశపొగ వేదనసెగతో మంటలెగసి కుప్పకూలింది

చిత్రాంగి

అధరాలమెరుపు అల్లరిచేసిన అలరించకంటావు
కనులకాటుక కన్నుగీటినా దూరం ఉంచుతావు
రవ్వలముక్కెర రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దంటావు
ముంగురులు మురిపించినా ముట్టుకోకంటావు
కొప్పునున్న మల్లెలు పిలిచినా వద్దు వద్దంటావు
నడుము వంపు నాజూకందాలను చూడనిస్తావు
సిరిమువ్వలు సడిచేస్తుంటే సరసమాడకంటావు
బొటనవేలు బిడియపడుతున్న బింకంగున్నావు
సిల్కు చీర నలగరాదంటూ లక్మణరేఖనే గీసావు
ఒంటరూగిసలాటలో తుంటరివై నన్ను కవ్విస్తావు
                             ********
                                *****
                                   **
ఎందుకిలా అని ప్రశ్నిస్తే చిద్విలాసంగా నవ్వేస్తావు
లోలాకులు లోగుట్టు చెప్తున్నాయంటూ లాలిస్తావు
తప్పంటూ తర్కించి తలూపించి కొంగున కట్టేసావు
మదిలోన మంటలు రేపి చందన లేపనం పూస్తావు

ఏమీకావు


నా చిరునవ్వు విలువెంతో తెలుసుకోలేని నీవు
చితివరకూ తోడుంటానని చిత్రంగా మాట్లాడేవు
చితిచింతేల!? నాలుగడుగులు కలిసి వేయలేవు


మదిలోతుల మమతల మర్మం ఎరుగని నీవు
మణి మకుట హారాలతో మనసు దోచుకోలేవు
మది దోచడమా!? మనసువిప్పి మాట్లాడలేవు

నా సొగసు సోయగాలను చూసి మురిసే నీవు
సొంతమైనా మదిమందిరంలో కొలువుండలేవు
మందిరమేల!? గుండెగుడిసెకు తాళమేయలేవు


వలపుల ఎరతో వాంచల గాలమేసి వలచే నీవు
వెళ్ళిపోతున్న వయసును వజ్రాలతో కప్పలేవు
కప్పినా!? కుటిలత్వానికి పరిమళాలు అద్దలేవు


నా లోపాలని సరిచేసి చేయూతమీయలేని నీవు
నీడనై ఉంటానంటూ ప్రగల్భాలు మెండు పలికేవు
                                                                           నీడేంటి!? నింగికెగసిన వేళ కన్నీరుకార్చ రాలేవు

నా చిత్రం

నన్నడగమాకు నాచిత్రంలో ఏముందని..
ఆమోములో కలల ప్రపంచమే దాగుంది
పద్మనయానాల పలుప్రశ్నల్లో నేనున్నది
అర్థంకాని జవాబులతో తల్లడిల్లుతున్నది!!

వెతకమాకు ఆలోచనల్లో ఏందాగుందోనని..
కారుమబ్బుల జ్ఞాపకాలతో కాటుకే దిద్దింది
కలువరేకై నవ్వేపెదవి వెనుక వేదనే దాగింది
వెన్నెలకు విప్పారితే పగలు చిన్నబోయింది!!

ఆరాతీయకు చెప్పనిఊసుల్లో ఏంచెప్పానోనని..
చిన్నగా చెవిలో చెప్పబోతే తుమ్మెద జుమ్మంది
తామర తహతహ తెలుసుకోలేని నీకెలా తెలిపేది
విరహ గుండంలో తెల్లకలువ ఉనికిని ఎలా ఆపేది!!

చూడబోకు చిత్రంలో కుంచెకున్న వంపులెన్నోనని..
అద్దినరంగులు నీరుకార్చితే చూడలేక మోముకంది
కమలం చలువ నీడలో విరబూయని మదొకటుంది
ఆశల అందాలతో అలంకరించుకుని కాపురముందది!

జంటపదాలమై...

ఉండి-ఉండి అనుకోకుండా దగ్గరైనావు
మెల్ల-మెల్లగా నా మనసునే దోచేసావు

చూస్తూ-చూస్తూ వెర్రిమది నీదైపోయింది
తియ-తీయని నీ ప్రేమలో పడిపోయింది

పదే-పదే పెదాలు నీపేరే పలుకుతున్నాయి
నన్ను-నన్నుగా నిలువనీయక ఉన్నాయి

చిన్ని-చిన్ని సైగలతో నన్ను మాయచేసావు
మిణుకు-మిణుకుమన్న కోర్కెల సెగ రేపావు

ఏవో-ఏవో కలలంటూ మనసు మాటవినకుంది
నువ్వే-నువ్వే కావాలని కునుకు కలవరిస్తుంది

ఇలా-ఇలా తెలియకనే నావన్నీ నీ వసమైనాయి
క్రమ-క్రమంగా నాలోనే నన్ను లేకుండా చేసాయి

చిలిపి-చిలిపి చేష్టలతో చిత్రంగా ఒకటి అయినాము
ఏడు-ఏడు జన్మలకి జంటపదమై మనముందాము

పయనం

ఈ జీవితంలో జవాబులేని ప్రశ్నలు ఎన్నో
అడిగడిగి విసిగిస్తున్నాను నేను ఎందుకనో
కొన్నింటికి జవాబు తెలిసినా సరిపెట్టుకోలేక
సరైనదో కాదో తెలీని ప్రశ్నగా మిగిలున్నానో
సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ వేధిస్తున్నానో
తెలీక ప్రశ్నించి నన్ను నేను అన్వేషిస్తున్నా!!

సమాజంపై సంధించబోయాను శరాలు ఎన్నో
యోచిస్తే సమాజమంటే నేనున్నా అందులో
ఇక ఎవరిపై ఎక్కుపెట్టేది వక్రించిన బాణాలను
అందుకే బంధీనైతి సంస్కరణల విల్లంబులలో
కర్తవ్యమేదో కాళ్ళనిచుట్టేసింది నేనేం చేయాలో
కార్యాచరణలో ఇక ప్రశ్నించక సాగిపోతున్నా!!

ఈ పోరాటంలో గెలుపు ఓటములు ఎన్నెన్నో
ప్రయాణంలో మజిలీ ఎరుగని మైళ్ళు మరెన్నో
అలసి విరామమంటూ స్వేదాన్ని ఆవిరవనిస్తే
దూసుకుంటూ పోయే పదునైన మలుపులెన్నో
కాలానుగుణమై సాగితే దొరికే జావాబులింకెన్నో
అందుకే నేను నేనుగా ఆగకుండా అడుగేస్తున్నా!!

ఎవరికోసం


సవ్వడి చేయని గుండెకి లయ ఎక్కడిది?
వెలిగించని ఒత్తుకి దీపకాంతులు ఎక్కడివి
ప్రేమించని మనసుకి వేదనవేడెలాతెలిసేది
వ్యధలేని ప్రేమకి అర్థమేలేదని ఏం చెప్పేది
ఎగసిపడని కోర్కెలసెగలో ధూపమెలాతీసేది

కవితలూ కావ్యాలు రాసి ఏం వినిపించేది
పలుకుల మధ్యన పదాలెన్నని జోడించేది
లిపికోసం వెతికితే కంటిభాషేలే కనిపించేది
ఒకరికోసం ఒకరున్నప్పుడు ఎవరికేంచెప్పేది
ప్రేమేలోకమైతే ఎవరి కోసం వేడుకలు చేసేది

ప్రాణం ప్రణయం రెండొకటని ముడి వేసింది
నీటముంచినా పాలముంచినా ఒకటేననంది
జ్ఞాపకాలతో హాయిగా కాలాన్ని సాగనివ్వంది
మరింక నన్నునేను మరచి ఎవరిని తలచేది
ఉఛ్ఛ్వాసలోని నిన్ను నిఛ్ఛ్వాసలో ఎలావీడేది!