పధకాల ప్రియుడు

నా రాకుమారుడవని ఎదను ఇచ్చి ఎదలోన దాగుండమంటే
పరువపు ఎత్తుపల్లాలు చూసి ఎత్తుపోతల పధకమే వేసావు!

ఉన్నతమైన ఊసులే చెప్పి ప్రేమికుడిగా ఉపాధి పొందమంటే
ఊహకందని ఊసులతో ఊపిరాడని ఉపాధి హామీ ఇచ్చావు!

మనువాడి ఆలిగా చేసుకుని అనురాగాన్ని కురిపించమనంటే
ఇదిగో అదిగో అంటూ అందీ అందని అభయ హస్తమిచ్చావు!

విజ్ఞానం ఉంది విద్యలెన్నో భోధించే వివేకవంతుడు అనుకుంటే
విర్రవీగే నైపుణ్యాన్ని చూపి విద్యోన్నతి పధకం అంటున్నావు!

సొగసుగాడి యవ్వారం చూసి శోభనంలో సున్నుండలు పెడితే
శృంగారమే కరువాయెనని పనికి ఆహారపధకం ఎందుకన్నావు!

సర్దుకుపోయి ఏదో ఒకగూటి పక్షులుగా కాపురం చేద్దామంటే
గుడిసెకన్నా గుండే పదిలమంటూ స్వగృహ పధకమనేసావు!

నేలపై నిలకడతో నిశ్చింతగా ఉండు నింగిలోకి ఎగిరిపోవద్దంటే
చేతిలో చిప్ప పెట్టి ఉడాయించి ఉడాన్ పధకాన్ని పాటించావు!

వ్యధాప్రవాహం..


నీకు సరిహద్దులంటూ ఏమీ లేవుగా
ప్రవహించు కన్నీరా ప్రవహిస్తూనే ఉండు
హృదయ వ్యధలన్నీ తీరేలా ప్రవహించు


నీవు కంట జారితే వేదనలు కరిగేను
నీకు నేనేం గిరిగీయలేదుగా పొంగుతూ 
సగం ప్రవహించి ఆగే నదిలా కాక 
సాగరంలా ఉప్పొంగి రోధించు...


కనుల భాషను కన్నీటి రూపంలో చెప్పి
వేదన తీరి మది భారం తీరేలా రోధించు
లోపల బడబాగ్నిని ఎవ్వరూ చూడలేరు
కనురెప్పల కదలికతో నువ్వు కాంచి చల్లార్చు!

నన్ను మరువకు

మధుర జ్ఞాపకాలనే హృదయ పల్లకీలో ఊరేగించి
మనసంతా నిన్నే నింపుకున్న నన్ను మరువకు!

కొంత కాలానికి నీవు వేరొకరి గుండెలో కొలువైనా
నా గుండె సవ్వడై కొట్టుకుంటావు ఇది మరువకు!

ప్రకృతి అందాల పూలపానుపుపై నీవు పవళించినా
పరిమళమంతా నాశ్వాసలో దాగుంటుంది మరువకు!

యవ్వనం జోరులో పరువపు మత్తులో బంధీవైనా
విషాదపు ఎండలో నీ భాస్వామినౌతాను మరువకు!

పరిస్థితులు తారుమారై గతులుమారి మనం వేరైనా
కంట్లో ఉన్న నీ ప్రతిరూపాన్ని ప్రేమిస్తాను మరువకు! 

నీవులేక..

అసలేం అర్థం కాదు అంతూ చిక్కదు
నీకు నాకున్న బంధమేమో తెలియదు
నాతో నీవుంటే నిండుపున్నమి జీవితం
నీవు దూరమైతే ఊపిరి నిండా శూన్యం!

క్షణాలన్నీ శత్రువులై పగబట్టెనని తెలీదు
మది మెదడు కలుషితమైనా కానరాలేదు
నీవులేక చెప్పుకున్న ఊసులే చిన్నబోయె
చెప్పాలనుకున్న మాటలేమో మూగబోయె!

గమ్యం దారిలో గల్లంతై అడుగు పడ్డంలేదు
నీడ కూడా వదిలేసె అందుకే వెలుగులేదు
నిర్మానుష్యం జీవితంపై పెత్తనం చెలాయించి
నాకునే అపరిచితురాలినైతి నీకై ఆలోచించి!

ఎడబాటుతో వేదనింత దగ్గరౌతుందనుకోలేదు
గుండెమంట చల్లారే మార్గం తెలియడంలేదు
నాతో నీవు లేక మరణం నన్ను తాకనంది
జీవించడం చేతకాని బ్రతుకు నరకంలాగుంది!