ఎందుకో ఏమో?

ఎందుకీ దాగుడుమూతలు? ఎందుకీ దోబూచులు?
నాలోనే ఉన్న మీకు ఎందుకీ ఎడబాటు దొంతరలు?
ఒంటరినైన నాకు మౌనంతో స్నేహం కుదిరింది
మౌనంగా భారమైన భాధని భరించాలని ఉంది
గత స్మృతులను తలచి మది పరితపిస్తుంది
గీసిన చిత్రాన్నే మనసు పలుమార్లు గీస్తుంది
చిత్రంలోని ముఖము మాత్రం అటు తిరిగుంది.

ఎందుకీ ఎదురుచూపులు? ఎందుకీ తడబాట్లు?
నాది కాని నాపైనే నాకెందుకిన్ని మమకారాలు?
పలుమార్లు ద్వారంవైపే చూపు మళ్ళింది
నాలో నేలేనని తెలిసి నన్నెవరో పిలుస్తుంది
ఎవరికోసమో నా హృదయం నిరీక్షిస్తుంది
ఏమిటో నాలోని వింత నాకే తెలియకుంది
నాదైన హృదయం వేరొకరికై స్పందిస్తుంది.

ఎందుకీ అలజడులు? ఎందుకీ కలవరింతలు?
నాకు చెందని నీపైనే నాకెందుకని ఆరాటాలు?
నిన్ను చూడాలని నామది కోరుకుంటుంది
నీవులేని చిరుగాలి కూడా చిరాకుపుట్టిస్తుంది
నవ్వుని నియంత్రించి ధుఃఖాన్ని మ్రింగుతుంది
పలకరిస్తే పెదవి విచ్చి గుండెలయ తప్పుతుంది
కలనైనా చూడాలని కనులు తెరచి నిద్రిస్తుంది.

"ఇలా నిదురపొండి"

"మత్తు వదలరా నిద్దుర మత్తువదలరా" అని జాగృతి పరచినా
"నిదురపోరా సామి నా ముద్దుమురిపాల సామి" అని నిదురబుచ్చినా
"నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదుర రావమ్మ రావే" అని జోల పాడినా
"నీవు రావు నిదుర రాదు" అని నిరీక్షించినా.....
ఇలా నిద్రపై ఎన్నో పాటలు పాడుకునే మనం.....
ఇలా నిద్రపోతే ఎలా ఉంటుందో అనే ఊహలకి.....
కవితా రూపకల్పనే "ఇలా నిదురపొండి"!!!!


వెల్లకిలా పడుకున్న వీరుడు
కలతలు ఎరుగని మగధీరుడు
కాస్త కబుర్లకి ప్రీతిపాత్రుడు
కావలసినంతే కష్టపడతాడు...
బోర్లా పడుకున్న ప్రతిమనిషి
కుచిత భావాలవైపు ఆకర్షి
తనదే వేదమనుకునే అభిలాషి
తీరుమారిస్తే కాగలడు మరోఋషి...

ఒకవైపు ఒదిగి పడుకున్న పడతి
వినయవిధేయతలే అత్యంతప్రీతి
ప్రేమ, ఆత్మస్థైర్యమే ఈమె మనోగతి
వీరిని మెచ్చును సకల జగతి...ఒంటికాలిని వంచి ఒకవైపు నిద్రించు
ప్రతిదానికీ కలతచెంది కలవరపరచు
బేలతనమే వీరి నేస్తమై వెంబడించు
దిశమారిస్తే ధైర్యమే వీరి దశమార్చు...ముడుచుకుని పడుకున్న నీవు
అసూయ స్వార్ధాలకి అదే నెలవు
చిరాకు విసుగు వీరి ఇంట కొలువు
మంచివారిని ఇవి దరిచేరనీయవు...


అరచేతుల్లో ఆదమరచి నిద్రించువారు
తెలివిగా ఆలోచించి పనులు సాధిస్తారు
తొందరపడి ఎవరినీ అంతగా నమ్మరు
నమ్మినవారిని ఎన్నటికీ విడనాడరు...క్రింది నుండి ఒళ్ళంతా కప్పిన ముసుగు
నీలోనే దాగింది బిడియం మరియు సిగ్గు
తొలగించు మేకపోతుగాంభీరపు ముసుగు
లేకపోతే నీవు కాంచలేవు లోకపు వెలుగు...


నిర్భయముగా నిదురించలేనివాడు
గతాన్ని పలుమార్లు తలచి రోధిస్తాడు
ఒంటరి అయి జీవితాన్ని సాగిస్తాడు
ఎదుటివారి నుండి జాలిని కోరతాడు...

కాలుపై కాలేసుకుని దర్జాగా పడుకో
నడవడికను త్వరలో నీవే మార్చుకో
మార్పుపులు నచ్చక పోయినా ఒప్పుకో
ఇంకెలా పడుకోవాలో నీవే నిర్ణయించుకో...

అలుగకు....క, కా, కి, కీ, కు, కూ:-)

చాలించు నీవింక అలు, పగలేరేయిగా కానీయ""

ఎందుకింత నీకు అలుకా, చెంతలేనని నేను కిను"కా"

కునుకు రానీయి కంటికి, అలుక సరిపడదు ఒంటి"కి"

వీడను నిన్ను ముమ్మాటికీ, నీవే నా చెలి జన్మజన్మల"కీ"

చెలియా! నాపై అలుగకు, నవ్వుని దూరం చేయ"కు"

నా మది తెలుసు నీకూ, అయినా అలిగావెందు"కూ"

నీవలిగితే నేను(పదాలే కరువైనట్లు భావించాలి) "క్రు","క్రూ"

అలుకమాని సొంతముకావే నాకె, వెన్నెలవిరయు నీనవ్వు"కె"

యుగమైగడిచె నీ క్షణం అలుకకే, నీవింక అలుగ"కే"

వేచి ఉంటా నీ ప్రేమకై, ఎదురు చూస్తున్నా ప్రేమతో నీ"కై"

నన్ను నీ కంటిపాపలా కాచుకొ, నామనసున నీవే చూసు"కొ"

అలిగి నీవలుసెందుకో, నీడైనా నిన్ను వీడిపొతుంది తెలుసు"కో"

అలుగక కౌగిలిలో గిలి నాకిస్తే మిగిలేది "కౌ"

అది నా మదిని మీటెడి తీయని తమ"కం"

పదమొకటి చెప్పవే దాని ఆది-అంత్యము "కః"

తిరిగిరాక...

పరిచయమే కదా అనుకుంటే ప్రణయం అయినావు...
పరిణయబంధం వలదని నా శ్వాసలో బంధీవైనావు!

తోడైతే మరుగున పడతానని నా నీడగ అయినావు...
కౌగిలిలో కరిగిపోతావనే కంగారులో నాప్రాణం నీవైనావు!

కంటపడి కలవర పెడదామనుకుని కనుమరుగు అయినావు...
కలలో కనబడితే కలతచెందెదనని తలచి కలలే నీవైనావు!

మాటలకి మౌనందాల్చి నా ప్రతిమాట నీవే అయినావు...
మనసిచ్చి మరచిన నీవు మరణం కూడా కాకున్నావు!

ఊహల ఊయలూగుతూ ఆనందానికి దూరం అయినావు...
మరచిపోదామని తలచిన తలపులో కూడా నీవే గుర్తొచ్చావు!

ఆటుపోటుల కాలక్రమంలో ఆశల అలవోలె అయినావు...
పశ్చాతాపంతో తిరిగివచ్చిన నీవు ఎన్నడూ నన్ను వీడిపోవు!

2012....స్మైల్స్:-)(-: హ్యాపీ న్యూ ఇయర్....అందరికీ:-)