ఖబడ్దార్ కరోనా..


రానా వద్దాని అడక్కుండానే వచ్చిసచ్చిందిగా కరోనా..
కలవరమెందుకు దాన్ని తరిమికొట్టడం మనకు చేతకాకనా
అన్నీ శుభ్రంగా కడుక్కోవడం మనకు తెలియదనుకునా
వచ్చాక చావకొట్టే ప్రయత్నం గట్టిగానే చేద్దాం ఏదేమైనా!

ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చి మమ్మల్ని హడలుగొడతావేమే కరోనా..
ఎడమెడంగుంటూ కలవకుండా నిన్ను మట్టు పెట్టలేమనా
బయట తిరక్కుండా ఇంటిపట్టునుంటే నీకు లేదుగా టికానా
రెక్కాడితేగాని డొక్కాడని మాతో పెట్టుకోకే చుప్పనాద్దానా!

తుమ్ముదగ్గు జలుబు జ్వరంగా వచ్చి జలదరింప చేయకే కరోనా..
మాస్క్ ముసుగేసుకుంటే నీకు ఊపిరాడదంట అవునా
ఎప్పుడెలా అంటుకుంటావోనని చస్తూ బ్రతుకుతున్నాం ఏదైనా
మేమంతా తలచుకుంటే నిన్ను నాశనం చేయడం పెద్దపనా!

ప్రభుత్వ నియమనిబంధనలు పాటిస్తాం కాచుకో కరోనా..
ధైర్యమే మా ఆయుధం తెలుసుకోవే కర్కోటకమైనదానా
ఇరవైఒకటి రోజులు ఇంట్లో ఉండి దీక్ష చేస్తున్నాం పారిపో సైతానా
 కోవిడ్-19 పుట్టగతుల్ని కాల్చిబూడిద చేయడానికి అందరూ రెడీనా!

నిద్ర దేహీ..

అడుక్కుంటున్నా..ఆరుగంటలు నిద్రను దానం చేస్తారా?
ఆశ్చర్యపోకండి..నిజంగానే నిద్రను దేహీఅని అడుగుతున్నా 
కుదిరితే ఆరుగంటలు లేదంటే కనీసం అరగంటైనా సరే..
అరగంటా గంటా అడుక్కుంటే కలిపి ఆరుగంటల పైనే కదా!    

అడగంది అమ్మైనా పెట్టదంటారని..అడుగుతున్నా ఇస్తారా?   
కళ్ళు ఎన్నిగంటలు మూసుకున్నా ఆలోచన్లని అణచుకున్నా
గతం వర్తమానంతో కలబడి భవిష్యత్తుతో బేరం కుదరక..  
శరీరం పక్కపై అటూఇటూ దొర్లి పొర్లినా నిద్రపట్టి చస్తే కదా! 

అప్పుడెప్పుడో హాయిగా నిద్రపోయా..మరోసారి నిద్రపోనిస్తారా?   
నిద్ర నావైపు కన్నెత్తి చూడకున్నా కౌగిలించుకోమని అంటున్నా  
మీ దగ్గర మిగిలిన చిన్నా చితకా నిద్రని కాస్త బిచ్చం వేస్తే..
మెదలక మదితలుపులు మూసి ఆదమరచి నిదురపోతా కదా! 

అందరూ నిద్ర ఆరోగ్యసూత్రమని చేప్పేవారే..అది ఇవ్వలేరా?
నిశిరాతిరితో రమించి అలసిపోయి వెన్నెల్లో వెల్లకిలా పడిఉన్నా   
రానని మారాం చేస్తున్న కునుకుని ఒప్పించి నాపైకి తోస్తే..
నా వ్యధలవేటుకు బలైన నిద్రతో సంభోగమే చేసి తరిస్తా కదా!

మీమాంసలో..

ఈ కాలమెంత కఠోరమైనదననా..
లేక మనం చేసిన నేరమనుకోనా!

నా హృదయంలో కాపురమననా.. 
లేక నా దగ్గరలేవు ఎందుకనుకోనా!

ప్రేమలో పస తగ్గెనని బాధపడనా..
లేక నావలపు లోపం ఉందనుకోనా!

మన కలయికకే అడ్డంకులేలననా..
లేక ఎదురీదని ప్రేమ ఎందుకనుకోనా! 

నేను తాకంది నామది తాకెనననా..
లేక ప్రేమించడం నీలక్ష్యం కాదనుకోనా!

                        ***