అబ్దుల్ కలాం..మీకు..అందరి సలాం

అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు.
ఐశ్య్వర్య వంతుడు అంత కన్నా కాదు...
అఖండ భారతాన్న దుర్భినితో వెతికినా
ఒక్క శత్రువు అయినా కానరాడు.
ఏమిటయ్య నీ గొప్పతనం.....మేరు చిన్నబోయె
మాకు తెలిసిన అతిలోకసుందరాగుడవు నీవు!
సిపాయి కాదు, కత్తి పట్టనూలేదు.
క్షాత్రం కనుచూపు మేరలో కానరాదు...
రాముడు కాదు రహీము కాదు...
విల్లంబులెత్తిన అర్జునుడు కాదు...
సారథి కృష్ణుడూ కాదు...శౌర్యం మాటే లేదు
అయిననూ శత్రుదేశాన్ని బయపెట్టని క్షణంలేదు!
ఓడిపోయి ఆగింది లేదు, విజయ గర్వం లేదు.
అసలు అలిసిన ఛాయలేవీ నీలో లేనేలేవు...
కూడ బెట్టింది ఏంలేదు...కలి అంటింది లేదు.
పదవీగర్వం లేదు...పురస్కార వాంఛ పుట్టుకతోలేదు.
ఉన్న ఆస్తి అంతా కూడా లక్ష్యసాధనే.
మాకు తెలిసిన మహోన్నత వ్యక్తివి నీవు!
అంపశయ్య లేదు... ఆసుపత్రి సూది మందులేదు.
జుట్టు చెదరలేదు....నీ మోము పై నవ్వు ఆగలేదు.
భవబంధాలు లేవు...బయపడింది లేదు.
ఎక్కడమ్మా ఓ మృత్యుమాత...నువ్వు గెలిచింది.
ఒక చుక్క కన్నీరు నువ్వు కూడా రాల్చి ఉంటావు...
మాకు తెలిసిందింతే...మేమంతా ప్రేమించే మహాత్ముడవు!

(ఈరోజు అబ్దుల్ కలాంగారికి ఆశ్రుతనివాళులు అర్పిస్తూ...పోస్ట్ రాయకూడదు అనుకున్నాను. భూలోకంలో నాకు తెలిసిన మాహాత్ముని గురించి నాలుగు అక్షరాలు రాయని నా కలం వ్యర్థం అనిపించి ఇలా మీ అందరితో-పద్మార్పిత)

చెప్పకనే చెబుతున్నా...ఎవరికై ఈ అన్వేషణో వారికే ఎరుకేలేదు
నా అనురాగానికి కొలతలు వేయనేలేదు
నా పై తనకున్నది ప్రేమా అని అడిగితే...

నవ్వి అన్నాడు...తనకి అదేమో తెలీదని!
ఏదో అప్పుడు అనుకున్నాను నచ్చావని
ఇప్పుడు నే తప్ప తనకేదీ నచ్చడంలేదని
నన్ను తలవనిదే ఊపిరి ఉక్కిరిబిక్కిరని
శ్వాసతోనే జీవితమా లేక నీతోటేనా అని!!

తెలీదంటూనే తాను సర్వం నేనని చెబితే...
నేను అన్నీ చెప్పానంటూనే ఏం చెప్పలేదు
ప్రేమంటూ పెదవులతో పలికితేనే సరిపోదు.

వలపువగచె
సుదూరతీరాల నుండి సుమధురంగా పిలిచి
మదిని తాకి దాగినావు కనులకు అగుపించి
వేదనే బహూకరించావు వలపునే కురిపించి!

                        *****

నేడు గుండె వీధుల్లో అంతా గుబులుగున్నది
ఆనందమొగ్గ విరియకనే ముల్లై గుచ్చుతుంది
ప్రతిదీ ఓడి ప్రేమనీ కోల్పోయాను అనిపిస్తుంది!

                          *****

కంటి కునుకూ పోయె, మది నిబ్బరం కోల్పోయె
లోలోపలే వలపు వగచి కనుల నీరే ఇంకిపోయె
నిట్టూర్పుతో పగలురేయి యుగాలై గడిచిపోయె!

కొత్త పుష్పంనాలో నీకై దాచిన అనురాగమే సుగంధాలై
విన్నవించని వలపుని అష్టోత్తరమాల పేని
అభ్యంగన స్నానమే చేసి ఆతృతగా అందిస్తే
నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె!

నాకు నీవు నీకు నేనన్ననమ్మికే నైవేద్యమై
రెండొత్తులు ఏకమై జ్యోతిలా వెలిగిపోవాలని
పసుపు కుంకుమార్చనలే విడి విడిగా చేస్తే
మంగళప్రదమే కాదని మనసుకే మసిపూసె!

నాది నేనన్న అహంకారమే కాలిన అగరొత్తులై
గుండెలో మ్రోగవలసిన గుడిగంటలే కీచుమని
నా హావభావాలని హారతి కర్పూరంలా హరిస్తే
సహనమే సాంబ్రాణి ధూపమై సరిహద్దులే గీసె!

నాపై నాకు ఉన్న ఆత్మవిశ్వాసమే హోమమై
తెలిసీతెలియని పూజాపునస్కారాలు ఏలనని
మర్మంలేని మనసే మంచిని మకుటంగా ఇస్తే
కవితల కొలనులో మరోకొత్త పద్మం విరబూసె!

సృష్టికార్యం

గుండెల్లో నక్షత్ర కూటమే మువ్వలతో మ్రోగె
నువ్వు మనసుపెట్టి ముచ్చటగా మాట్లాడితే

కనుల ఎదుట కల్పవృక్షమే గజ్జె కట్టి నర్తించె
నువ్వు నిండుపున్నమిలా నాకెదురై నవ్వితే

చంద్రుడిలోని తెలుపే మెరిసి తెల్లబోయి చూసె
నీ స్వఛ్ఛమైన మనసు నాకే ఇచ్చావని చెబితే

నరాలన్నీ వీణాతంత్రులై కళ్యాణి రాగమే పాడె
నీ ఉఛ్వాస నిఛ్వాసలకి నా పైట రెపరెపలాడితే

గోధూళి సైతం పరిమళాలని రాయబారం పంపె
నువ్వు నా కంటిపై ముంగురులే తొలగించబోతే

తనువుల ఘర్షణలో మన్మధుడు మధనం చేసె
నువ్వూ నేనొకటై సృష్టికార్యానికి శ్రీకారం చుడితే

మాచెడ్డ మాయరోగం


రింగురింగులతో ఒత్తైన జుట్టుంటే
అబ్బో నా రాజు హీరోలే అనుకున్నా...
గుట్కా నమిలి ముద్దు ఇమ్మనడిగితే
మానేయి మామా ముద్దులే ముద్దులన్నా...
పరగడుపునే ప్రొగతాగి రింగులొదలడం చూసి
మెల్లగా మెత్తగా చెప్పి మార్చుకోవాలనుకున్నా!

పాలిపోయిన ముఖాన్ని చూసి
పాలమీగడంటి పసివాడనుకున్నా...
ఎర్రబడిన కళ్ళని నలుపుతుంటుంటే
ఎర్రి నా వాడికి ఎంత కష్టమో అనుకున్నా...
పొరుగూరెళ్ళి పేకాడొచ్చి ప్రేమ ఒలికిస్తే
నీకు ఇదేం పోయేకాలమొచ్చే పుండాకోరన్నా!

ఏమైనా చుక్కల్లో చంద్రుడల్లే
చూడ చక్కనోడు అనుకున్నా...
తలొంచి తూలుతూ వచ్చి వాలితే
కాయ కష్టంతో అలసినాడనుకున్నా...
చూడకనే సుందరాంగినని నన్నంటే
సందేలనే సుక్కేసుకొచ్చావేరా సచ్చినోడాన్నా!

తిడతావు ఎందుకే అని కలబడితే
వీడికి బడితపూజ తప్పదనుకున్నా...
మాటలకి మానని మాచెడ్డ మాయరోగమని
తిక్క కుదర్చడానికి తిరగబడి తన్నబోతున్నా...
మరి నాకు వత్తాసు పలికి సై అనేవారు ఎందరో
తప్పని చెప్పి తిట్టేవారు ఎవరో ఎదురు చూస్తున్నా!