గుండెపోయింది…గుప్పెడంత గుండెకి ఏమైందో పడిపోయింది
ఎంత వెతికినా సరే ఆచూకీనే తెలియకుంది
అదేమని అర్థం చేసుకుని నిర్ణయించుకుందో 
ఏ అవసరం లేదనుకుని వదిలేసిపోయింది!

ఎక్కడ ఎలాగుంటుందో ఏమోనని బెంగగుంది
ఆకలేసినా అడగలేని అమాయక అల్పప్రాణది
ఎండావాన తట్టుకోలేనిది ఒంటిరిగా ఎలాఉందో
హఠాత్తుగా వెళ్ళాలి అనుకుంది వెళ్ళిపోయింది!

ఊపిరే నాకది ఎవరినెలా అడిగి తెలుసుకునేది
చితికిందో చిరిగిందో చిల్లుపడిందో తెలియకుంది 
ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని అవస్థలు పడుతుందో
నలుపురంగు నచ్చక రంగుల్లో కలిసిపోయింది!

ఆశలు ఆశయాలని అణచివేసుకున్న ప్రాణమిది
గతంలో నన్ను ఒదిలేసి భవిష్యత్తు వెతుక్కుంది
ముతకదారంకన్నా పట్టుకుచ్చు మోజనిపించిందో   
విసుగని వేసారిపోయి నిశ్శబ్దంగా నిష్క్రమించింది!

చిన్నిగుండెకేం తెలుసునని భావవలలో నేచిక్కింది
వడగాలికొదిలి వయసుగాలి దొంతర్లో దొర్లిపోయింది
నాజూకు గుండె నన్ను నమ్మి లాభంలేదనుకుందో 
గుణపాఠం వల్లిస్తూ జీవితమే జీవచ్ఛవమయ్యింది!

తారతమ్యం..

అభిమానించడం ధ్వేషించడం ఆస్వాధించడం
ఇరువురిలో సమాన స్థాయిలో ఉన్నప్పుడు 
స్త్రీలు మాత్రమే జాతులుగా విభజించబడడం
పురుషుడు ఆమెలోని నాణ్యతలు ఎంచడం..
ఎంత వరకూ సబబో నాకు అర్థంకానే కాదు!

పద్మినీ జాతిలో శుభలక్షణాలు ఉన్నాయనడం  
మురిపించి మరిపించి మెప్పించేదామైనప్పుడు
ఆమెకు సరైన జోడి పురుషులలో లేకపోవడం  
పైగా పద్మినీజాతి స్త్రీ కావాలని కోరుకోవడం..
ఎంతైనా ఇది న్యాయ సంబంధిత కోరిక కాదు!

చిత్రిణీ జాతి స్త్రీలు అందచందాలు చిందించడం
ఆకర్షించడం ఆమెకే చెల్లును అనుకున్నప్పుడు
తిరిగి ఆకట్టుకునే మగమహారాజులు కొరవడడం        
స్థిరచిత్తం లేని ఆమెని చూసి చొంగ కార్చడం..     
మగ అహానికిలా ముసుగేయడం మంచిదికాదు!

శంఖినీ మగువలు కస్సుబుస్సుతో చిర్రుమనడం
కుటిల స్వభావంతో కర్కశంగా ప్రవర్తించినప్పుడు
వీరిని ప్రేమించడం కోరి కయ్యానికి కాలుదువ్వడం       
ఏదో కోరి అనవసర ఆసక్తితో అర్హులు చాచడం..      
వివేకుల నాగరికత్వపు చత్వారం అస్సలు కాదు!

హస్తినిజాతి ఆడది నల్లగా అధికబరువు ఉండడం  
మెచ్చని పుంగవులు వంకల కోసం వెతికినప్పుడు  
ఆకార హొయలు ఆమెకేనని గేలిచేసి మాట్లాడడం
అంతరంగ అందాన్ని చూడలేని అంధత్వ లక్షణం..
అలాంటి మహోన్నతుడినందుంది మగతనం కాదు!           
    

దారిమళ్ళింది..

                                                                    ఈ మధ్య భావాలు ప్రక్కదారులు తొక్కుతున్నాయి
                                                                    వద్దన్నా వినక అనవసరంగా రచ్చకెక్కుతున్నాయి!

సార్ధకత సాంద్రతల అన్వేషణలో దేన్నీ పట్టించుకోక
ఊహల్లో ఉండలేమని వాస్తవానికి దగ్గరౌతున్నాయి!

అందమైన అబద్ధపు తొడుగేసుకుని హాయిగా ఉండక
నీతి నియమాలు మనసాక్షంటూ కొత్తదారి పట్టాయి!
 
సన్నగా ఈలవేసి కన్నుకొట్టి కవ్వించి పబ్బంగడుపక
లేని వలపు ఎలా పుట్టించేదంటూ నిలదీస్తున్నాయి!

ఎవరేమైతే మనకెందుకని పట్టక నవ్వుతూ నవ్వించక
రాని నవ్వు నవ్వలేక ఇదీ ఒకబ్రతుకే అంటున్నాయి!

జీవితపాఠాల్ని చదువుతున్నాయనుకుంటాను చూడక
అందుకే జ్ఞానం ఎక్కువై మనసుని కెలుకుతున్నాయి!

చూడనట్లు పోక ఎందుకొచ్చిన రబస నీకిదన్నా వినక
నన్నో వింతజీవిననెంచి బ్రతికినా చచ్చినట్లంటున్నాయి!
       

ఏదో చేస్తివి!

మనసు మెదడు బుద్ధి అన్నీ వశం తప్పేంతగా
నాలో ఇమిడిపోయి నువ్వు కైవశం చేసుకుంటివి
ఇదిగో అదిగో వస్తున్నావు అనుకునే ఆరాటంలో
సిగ్గుపడ్డ మోముని ముంగురులు కప్పేలా చేస్తివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మార్చేస్తివి!

మనసు పొరల్లో కోరికలు పురివిప్పి నర్తించేంతగా
నా ఆలోచనల్లో నువ్వు మెదులుతూ మురిపిస్తివి
ఏదోలెమ్మంటూ సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో
ప్రకృతి అందించిన అందాల్లో నువ్వు అగుపడితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు ఏమారిస్తివి!

మనసు నిగ్రహించుకుని నేను సింగారించుకునేంతగా
నాలోని ఆహభావాల పై నీవు అజమాయిషీ చేస్తివి
నీది కాని నాదన్నది ఏమున్నదిలే అనుకునేంతలో
ఈర్ష్యకే కన్నుకుట్టేంతగా వలపందించి అలరించితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మాయచేస్తివి!

కొంచెం హాట్ గురూ..

                                                                          చల్లని శ్వాస వణికించె ఊపిరినల్లుకుని
నీ స్పర్శ తగిలి వేడిపుట్టనీ తనువులో
ఈ రేయి మంచంతా కరిపోనీ కౌగిలిలో
నేడు కాలిపోనియ్యి నీ బాహుబంధాల్లో!

జీవనాడి చలించనీయి ఊపిరి పోసుకుని
కలిసి కలవడి అలసి కరగనీ నన్నునీలో
పలికే పెదవుల్ని ఓడిపోనీ ముద్దులాటలో
శరీరాన్ని కప్పేయి నీ తనువు దుప్పట్లో!

రాపిడినీయి తడిమనసుకి ఉపశమనమని
ఆవిరైపోనీ శంకలు ఏమైనాఉంటే హృదిలో
కంపిస్తున్న కరముల్ని బిగపట్టు నీచేతిలో 
బీడుభూమిని తడిపేయి వర్షపు చుక్కల్లో!

నిందించకు వణికేపెదవులు సెగరగిలించెనని
స్తంభించనీ మేనిహొయలు సరససల్లాపాలలో 
ఏకమవనీ శరీరాలు ఒకటన్న మీమాంసలో
మంచుకే మంటపుట్టనీ మనిద్దరి బిగికౌగిట్లో!