మహిలో మహిళ

అన్న రాముడి వెంట వెళ్ళుతూ ఒక్క మాటైనా నన్నడక్కపోతివి కదా లక్ష్మణా
నీవు లేనప్పుడు నిద్రపోక ఊర్లపొంటి నే తిరిగుంటే ఏమైయుండేదో నీ క్రమశిక్షణ  
రాముడు తోడున్నా సీతకు కావలి కాస్తివి కట్టుకున్న భార్యకు అక్కర్లేదా రక్షణ!
లక్ష్మణ గీత దాటిన సీత గతి ఎరుక అందరికీ కానీ ఎవరికి తెలుసునని ఊర్మిళ

రాకుమారుడై అన్నీ అనుభవించి జ్ఞానమని చెప్పకుండా ఉడాయించిన సిద్ధార్ధుడా 
కాపురంచేసి కావల్సింది పొంది సంసార బాధ్యతల్ని మరచిపోయినోడొక సమర్ధుడా
బ్రతుకు వెలిగించుకోవాలని ఆమే వెళ్ళుంటే గౌతముడు బుద్ధుడై కీర్తింపబడేవాడా!    
భౌద్ధభోధనలో సమస్తసారం తెలిసిన వారిని ఎవరినైనా అడక్కపోయావా యశోధర

పదితలలు ఉన్నప్పటికీ ఒక్క తలలో కూడా మెదడు లేకపోయెకదా రావణాసురా
పెరటిచెట్టని వదిలేస్తివే కానీ నాకన్నా అందంతెలివిహోదా ఆమెలో ఏమి చూస్తివిరా
అన్నీ ఉండి కూడా నిన్ను అదుపులో పెట్టుకుని నా కొంగుకు కట్టుకోకపోతినిరా!
బావిలోకప్పనై నీకు ఆలినైనా చివరికి విభూషణుడికి భార్యగా మిగిలెనీ మండోదరి  

చక్రవర్తివై ఉండీ సతిని సుఖపెట్టలేని నీవు లోకానికి మాత్రం సత్యహరిశ్చంద్రుడివా
భర్తనువాడు భార్యపిల్లల్ని రక్షించాలి కానీ అమ్ముకోవడం ఏమిటని అడగరాదంటివా
దొంగ హంతకురాలిగా నిందభరించి దాసినై పుత్రశోకం భరిస్తే నీవే నరకబూనితివా! 
సత్యసంధ స్ధిరచిత్త స్థితప్రజ్ఞ ధీరోదాత్త నీవు నాకొచ్చినపేరేమో మతిలేని చంద్రమతి 

పురుషుడు గొప్పవాడిగా కీర్తించబడాలని స్త్రీ ఎన్నింటిని త్యాగం చేసినా మెచ్చరుగా
అదే స్త్రీ తన ప్రత్యేక గుర్తింపుకోసం అడుగు బయటవేస్తే బరితెగించింది అంటారుగా
స్త్రీ ఉన్నతి వెనుక పురుషుడున్నాడేమోనని పురాణచరిత్రల్లో వెతికా కనబడలేదుగా
మీకు తెలిసినవి జరిగేవి జరుగుచున్నవి వ్రాస్తే చదివి సంతోషిస్తుందిగా పద్మార్పిత   

ఆమెను అమెగా చూడు..

మహిళా భౌగోళిక శరీరంలో దాగిన మనసు పొరల్ని తొలగించి 
తీరిగ్గా ఆమెనడక్కుండా అంతరంగ చరిత్రని చదివారా ఎవరైనా?

మాగాడికి భిన్నమైన మమకారమే ఆమె కులం అదే ఏకాంతం 
శతాబ్దాలుగా శ్రమించి దాచిన స్థిరాస్తులెన్నో చెప్పగలరా ఎవరైనా?

తన కాల్పనికతలో తనని తాను నిర్మించుకుని బహిష్కరించబడి
కలలో కూడా ఉరకలేసి జీవించే ఆమెని వెంబడించారా ఎవరైనా?

బంధుబంధాల నడుమ సాగే కురుక్షేత్రంలో ఆమెతో ఆమే పోరాడి
ఓడిపోయి గెలిచాననే అమె అంతర్గత మర్మం తెలుసా ఎవరికైనా? 

మౌనద్వారంపై కూర్చుని మోములోముఖంపెట్టి మనసు ముడివిప్పి
కవళికల్చెప్పే నిశ్శబ్ద పదాల్ని చదివి అర్థంచేసుకున్నారా ఎవరైనా?

భీజాన్ని మొలకెత్తించే ముందు మూలాన్ని అడుగరెవరూ ఇష్టమాని
ఆమెకున్న సంబంధాల వ్యాకరణమేమిటో విశధీకరించగలరా ఎవరైనా?

వంటగదీ వండివడ్డించి పక్కపై పొర్లేటి గణితశాస్త్రం మాత్రమే నేర్పించి
వ్యంగ్యంతో సమానత్వమంటారే కానీ స్వేఛ్ఛగా వదలగలరా ఎవరైనా?

వాస్తవానికి ఎంత అణగద్రొక్కితే అంతకుమించి ఎదగడమే ఆమె రీతి
మాటలతో కాకుండా చేతల్లో చూపి రెక్కలు విప్పుకొని ఎగిరిపోతుంది 
ఎప్పుడోకప్పుడు ఆమే కోరుకుంటుంది తనకంటూ ఒక ప్రత్యేక లోకం   
స్త్రీ దృక్కోణం నుండి స్త్రీని చూడటం...ఆమె స్త్రీత్వానికి అదే నిర్వచనం!

రంగులకల..

అందమైన ఏడురంగులతో స్నేహం కుదిరిందన్న ఆనందంలో 
జీవితంతోటన్నా పద కలలుకన్న కళ్ళతో జూదమాడేద్దామని

సూర్యకిరణాల్ని దొంగిలించి ఎవ్వరికీ కనబడకుండా దాచేసి..
అక్కడొక కొత్త ఉదయం సృష్టించి దాని మనసు దోచేద్దామని!

పొగమంచు కరుగ వెలుగు తోరణాలను వరుసగా పేర్చేసి..
తోరణమట్టుకు జారే నీటి తుంపర్లతో మదిదాహం తీర్చేద్దామని! 

మధ్యాహ్నం సృష్టిగా భోంచేసి చెట్టునీడన నడుము వాల్చేసి..
ఊగుతున్న ఆకులతోపాటు ఊహల్ని కూడా ఊయలూపేద్దామని!

సంధ్యవేళ మారాంచేస్తూ ఎగిరేకురులను మందలిస్తూ ముడేసి..
అస్తమిస్తున్న సూర్యుడితో అలసిన ఆశల్ని నిదురపుచ్చేద్దామని!

చంద్రుడు చిన్నగా ఈలవేసి పిలువ ఆశేమో చిలిపిగా నవ్వేసి..
తెల్లచీర చుట్టుకుని సృష్టికార్యానికి సిద్దమయ్యే ఏదో ఉద్దరిద్దామని! 
   
తెల్లారితే నలిగిన చీరసర్దుకుని దుప్పటి మడతేసి దిశ మార్చేసి..
రంగులని రంగరించి కొత్తరంగును చేయడమే జీవితమనుకుంటాను
     

మనసు ముక్కలు

ముక్కలై మిగిలిన మనిద్దరమూ తక్కువేంకాదు
విరిగిన సూర్యకిరణంలో వేడీ తేమా లేకపోలేదు
అల్లిన మాలతోపాటు తెగినదారం పోగుమిగిలుంది
గోడపై రాస్తూ వర్షానికి కొట్టుకుపోతాయనుకోలేదు
వేరై బ్రతుకుతున్న ఇద్దరిలో ఇంకా ఆశచావలేదు!

ముక్కలు అయ్యింది మనసులే మనుషులంకాదు     
విరిగిన కలలని ప్రోగుచేసుకుని జీవించిక తప్పదు
సర్దుబాటు వాగ్దానాలతో కాలంగడపడమే మిగిలింది
హృదయానికి ఊపిరి ఉన్నంత వరకూ ఏదీ ఆగదు
విడివడిన గుండెలు కలవకపోతే ప్రేమకి అర్థమేలేదు!

ముక్కలకీ మనసుంది ఆలోచిస్తే మార్గందొరక్కపోదు
సమాధి చేరే వరకు సమయం ఉంది మించిపోలేదు
ఎప్పటికీ మనమొక్కటే అనే విత్తు మొక్కైమొలచింది
చెట్టు చిగురించి పువ్వులూ ఫలాలు ఇవ్వకమానదు
వేరైతేనేం ఆశాజీవులం బ్రతకడానికిదేం తక్కువకాదు!  

ఇప్పుడే చెయ్యి..

చెయ్యాలి అనుకున్నవుంటే యవ్వనంలోనే చెయ్యగలం
వృద్ధాప్యాన్ని చూస్తామోలేదో ఏమైనా ఇప్పుడే చేసేయ్!

కంటిచూపు సన్నగిల్లి మాట తడబడితే మనమేం చేస్తాం
చూడాలనుకున్నవి చూసి నీకు నచ్చినట్లుగా బ్రతికేయ్!

కాళ్ళనొప్పితో వినబడక ఆడిపాడలేనప్పుడేం చేయగలం
భజనాభక్తి ముక్తి లాంటివి కావాలంటే ఇప్పుడే చేసేయ్!

ఆత్మతో అవయవాలన్నీ వేరైపోతే అరచి గోల ఏం చేస్తాం
కండా కసి పసా ఉంటేనేగా జీవితమంటే అనుభవించేయ్!

గుండె బిక్కుబిక్కుమంటే ఏం చేయాలనుకున్నా చేయలేం
మనసున ఉన్నది చెప్పి చెయ్యాలంటే ఇప్పుడే చేసెయ్!

ముసలితనం వచ్చాక ముడిసరుకు లేనప్పుడు ఏం చేస్తాం
దానమైనా ధర్మమైనా కష్ట నష్టాలకోర్చి చేసి చూపించేయ్!

పనేదైనా పట్టుదలతో చెయ్యాలనుకుంటేనే కదా చేయగలం
రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అనుకుంటే ఏంచెయ్యకనే చస్తాం!