ఏంకాలేదు!

రెండడుకులు నువ్వు ముందుకు వెయ్యలేదు
నాలుగడుగులు వేసి నేనూ ధైర్యం చెయ్యలేదు
విడిపోతే కానీ ఎడబాటు ఏమిటో తెలియలేదు!

నువ్వొస్తావని పాతికేళ్ళు నేను వేచి చూడలేదు
నువ్వో పాతికవసంతాల ముందు కబురంపలేదు 
వలపు జ్యోతులే ఆరిపోయాయి వెలుతురేలేదు!

నీవు లేవన్న వ్యధను మనసూ మరచిపోలేదు
గుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
నీ గమ్యమే నాకు శాపమని నాడు తలచలేదు!

సాంత్వన మాటలెన్ని చెప్పుకున్నా ఊరటలేదు
ఓదార్పులే ఇచ్చిపుచ్చుకున్నా కన్నీరాగడంలేదు
దాహార్తితో అరచిన ఆశాశయాల దాహం తీరలేదు!
 
కాలమే పగతో కాలకూటవిషమౌనని అనుకోలేదు
కలలన్నీ సమాధైపోయె కనులు ఇది కాంచలేదు
హృదయం నుండి ఊపిరి వెళ్ళి మరల రానేలేదు!

కలిసుందాం..

నమ్మకూడదు అనుకుంటూనే నిన్ను నమ్ముతూ
సమాధానంలేని ప్రశ్నవని తెలిసి కూడా ప్రశ్నిస్తూ
అంతరంగంలో అన్నీ నీవనుకుని పైకి ఏం కావని
నా ప్రతీఅడుగులో నీవున్నావని జీవించేస్తున్నాను!

ఎదపై సేదతీరుతుంటే గుండె నిబ్బరమనుకుంటూ
లేనిపోని ఆశయాలెన్నో మనసు నిండా నింపేస్తూ
ఆలోచనలు అన్నింటినీ నువ్వే దొలిచేస్తుంటే బేలనై
నువ్వు నా రేపై మిగులుతావంటూ బ్రతికేస్తున్నాను!

ఎప్పుడూ వెన్నంటి ఉంటానన్న నీ బాసని స్మరిస్తూ
చూసుకుంటే నా ప్రక్కన లేని నీ పై ఆవేశపడుతూ
ఎందుకు స్వార్థం వలలో బంధీవైనావని ప్రశ్నించలేక
నా మదికి సమాధానం చెప్పలేక తల్లాడుతున్నాను!

విడిపోవడానికే కలిసామన్న వాస్తవాన్ని రావద్దంటూ
లేని ఢాబుని కన్నీటి పై కప్పి అజమాయిషీ చేస్తూ
ఇలా కల్సి అలా విడిపోయే కనురెప్పలని ఊరడిస్తూ
ఎప్పటికీ కలిసుండే వరమియ్యమని అడుగుతున్నాను!       
     

  

ఒకానొక రాత్రి...

ఎక్కడైనా మనిద్దరం ఏకాంతంగా కలుద్దాం
మెల్లగా వొకరి కన్నీటిని... 
యింకొకరి మనసులోకి వొంపుకొని
ఎడబాటు మలినాలు కొన్ని పోగొట్టుకుని
గాఢమైన కౌగిళ్ళతో కుశలప్రశ్నలు సంధించుకుందాం!!!

మనసులో నలుగుతున్న కొన్ని ఉధ్వేగాలను
సున్నితంగా పెకళించి వలపుతంత్రులు మీటి.. 
మౌనరాగాన్ని నిశ్శబ్ధంగా ఆస్వాదిద్దాం
లెక్కలేనన్ని జీవిత చిక్కుముడులని
ఓపిగ్గా విప్పుకుంటూ కొత్తసమాధానాలను అన్వేషిద్దాం!!

గతకాలపు గురుతుల మన పుస్తకంలో
ఇంకొన్ని పుటల్ని ప్రేమతో అతికించి...
బ్రతుకు గ్రంధాన్ని అందంగా రాసుకుందాం
ఆశల నక్షత్రాలతో అందంగా అమరిన ఒకానొక రాత్రిని 
మన చిరునవ్వుల వెన్నెల్లతో సుందరంగా ముస్తాబుచేద్దాం!

అస్థిర హామీ..

సంతోషంగా ఉంటానని ఒట్టేసి నీకు చెప్పి
మారిపోతానని నీకు హామీ ఇవ్వలేనుగా..
నా మనోభావాలు క్షణికాలేనని మభ్యపెట్టి
నీ ఆనందంకోసం అంటాకానీ నిజంకావుగా..

నిన్ను ఎప్పుడైనా తెలియక బాధిస్తానే తప్ప
తెలిసెన్నడూ నీ భావాలనైనా గాయపరచనుగా..
నీకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని కలిగించక
వాగ్దానం చేసి నిబ్బరంగా మసలుకుంటానుగా..

నీకు ఎల్లప్పుడూ అన్నింటా మద్దతుని ఇచ్చి
నీ విజయాలకు నేను వారధిని అవుతానుగా..
నవ్వడం ఏడవడం నీతో కలిసి మెలిసి చేస్తూ
నిన్ను ప్రేమించే వారిలో నాదే ముందు పేరుగా..

భాగస్వామ్యం కోరక బాధల్లో భాగం పంచుకుంటూ
నిజాయితీకి నిర్వచనమే నేనని నిరూపించుకుంటాగా!

జ్ఞాపకాలబొంత..

మనసు ఇప్పటికీ ఆ జ్ఞాపకాల బొంతనే కప్పుకుంటానంది
 చాలాకాలంగా దాని క్రిందే ఎన్నో ఊహల్తో కాపురం చేసింది
ఇతర ఏ ఉతికిన కొత్తబొంతలోనూ ఆ అనుభూతి రాకుంది
చెప్పాలంటే ఆ జ్ఞాపకాల బొంతలో నాదన్న ధీమా ఉండేది 
దాన్ని కుట్టడంలో చూపిన శ్రద్ధ ఓపిక ఇప్పుడు కొరవడింది
అపోహలను ఎన్నింటినో పొరల మధ్యనదాచి కలిపికుట్టిందది
వేలిముద్రలు కళ్ళ ముందు చేసిన నాట్యమే కదలాడుతుంది 
దారపుపోగుల చిక్కుముళ్ళు విప్పడం ఇప్పుడింకా గుర్తుంది
అల్లరితో అలిగి లాక్కుని చుట్టుకుదొర్లిన స్పర్శ వీడనంటుంది 
అందుకేనేమో పాతబడి ఎన్ని తూట్లుపడినా వదల్లేకపోయింది

కానీ ఇప్పుడు ఆ ఇరుశ్వాసల పరిమళం మాయమైపోయింది
ఎందుకంటే నేను ఒంటరిగానే బొంతను చుట్టుకుని దొర్లుతుంది
   కోటు వేసుకోవడం అలవరచుకున్నాడన్న రహస్యం దాగుంది!