అరిషడ్వర్గాలు

కామ క్రోధ లోభ మోహ మదాలన్నీ విసర్జించి
చీకటివెలుగులై ఉన్న సుఖధుఃఖాలను తృంచి
నాలో దాగిన పరమాత్మ దర్శనం నేను గాంచి
అండపిండ బ్రహ్మాండ శక్తులు కైవశమనుకున్నా!

కారముప్పూ మసాలా తిన్న కామం మదమెక్కి
మనసు నిగ్రహం కోల్పోయి మాయావలకు చిక్కి
అవధుల్లేని ఆవేశంతో ఇద్దరూ కామంగూట్లో నక్కి
తనువు తృష్ణతహ తీరినాక కామం వద్దంటున్నా!

కోరికలు తీరక కోపమే కక్షగా రూపాంతరం చెంది
రగులుతున్న పగ ఆలోచించకనే ఉద్రేకపడుతుంది   
ఇది మనిషిని మదిని ప్రకృతిలా దహించి వేస్తుంది 
అహం బూడిదైతే చేసేదేముంటది క్రోధం ఉండొదన్నా!

వాంచాపూరిత కోరికలతో సంపాధించింది సొంతమని
అనుభవించకా ఇతరులకూ పంచక కూడబెట్టుకుని
కాకి ముందు కూడా విధిలించలేని ఎంగిలి చేయిని
లాభం ఏముంటది లోభి దగ్గర లక్షలు ఎన్నిఉన్నా!

సంపాదించింది సరిపోలేదంటూ మరింత కూడబెట్టి
విపరీతమైన కసరత్తులెన్నో చేసి ధనాన్ని నిలబెట్టి
చాలదంటూ ఇంకా కావాలన్న వ్యామోహన్ని బట్టి
మనలో తిష్టవేసిన పాపమే ఎక్కువ మోహంకన్నా!


కోరుకున్నవి అన్నీ దక్కాయన్న పొగరుతో విర్రవీగి
ఇతరుల సామర్ధ్యాన్ని చులకన చేస్తూ ఏదేదో వాగి
తనని మించినోళ్ళేరన్న అహంకారంవీడి పైనుంచి దిగి
అన్నింటినీ త్యధిస్తే వేరేముంది దైవత్వం అంతకన్నా!

Note:- అరిషడ్వర్గాల్లో మాత్సర్యాన్ని మరచిపోయాను అనుకోకండి...ఈ అయిదు వీడితే నా పై నాకు అసూయ అదే ఈర్ష్య ఎలాగో కలుగుతుంది కదాని 

ఏం లేదు..




మునుపటిలా ఏమీ లేదు..

పగలూ రాత్రి కళ్ళలో తేమ తప్ప
వాతావరణం అనుకూలంగా లేదు!
ఆకాశం మేఘావృతమై ఉంది తప్ప
గాలి ఉరుములే కానీ వాన లేదు!

ఎటువైపు పయనమో తెలీదు..

దారులు కనబడుతున్నాయి తప్ప
గమ్యం వరకూ ఎవరూ తోడు లేరు!
రా రమ్మని పిలచి అరవడమే తప్ప
ఎవ్వరూ రావడానికి సిద్ధంగా లేరు!

ఏమైనా మిగిలి ఉన్నాయేమో..

సంతోషాలు ఎక్కడని వెతకడం తప్ప
ఆనందాలు కను చూపుమేరలో లేవు!
విధి వక్రించింది అనుకోవడమే తప్ప
నడిచే సమయానికి సరిహద్దులు లేవు!

ఏం జరుగుతుందో తెలుసుకోలేము..

కలలు చివరి శ్వాస తీస్తున్నాయి తప్ప
నేనున్నానని వినిపించదు ఏస్వరమూ!
ఎవరి అక్కునో చేరాలన్న ఆరాటం తప్ప
ఏ ఎద సవ్వడిలోనూ మనముండము! 

సర్దుబాటు..


ఆటు పోటుల నూలుపోగులతో 
నేసిన ఆశనిరాశల అంచులకోక   
ఆరుగజాలకు నూలుదారం లేక 
నిడివి తగ్గించినారు కాదనలేక..

మిణుగురు పురుగుల కాంతితో
చిగురించే కోరికను వసంతమని  
సర్దుకుపోవడంలో సంస్కారమని
అదే నూరి పోస్తారేల ఘనతని..

చిరాకుగా ఉన్నా చిరునవ్వులతో
బ్రతకడం ఎప్పుడూ కాదు వ్యర్థం
పరికించి చూడ ఉంది పరమార్ధం
పరులకు చెప్పడమే నిస్వార్థం..  

జీవించడం అంటే సర్దుబాటులతో
వేరెవరి కొరకో ఎందుకు బ్రతకాలి 
ఇతరుల సంతోషానికై బలికావాలి
జీవితం ఎందుకు ఇలాగే ఉండాలి..  


ఆ..నువ్వే కావాలి!

మండుటెండలో మంచుకొండవై ఉండే
ఆ స్నేహ పరిమళమే నాకు కావాలి
నన్ను చూడాలని నాతో గొడవ పడ్డ
ఆ పాతరోజులు మళ్ళీప్పుడు రావాలి! 
బాధల సుడిలో బాసటబలమై నిలచి
ఆ మధుర గానము నువ్వు పాడాలి
నేను పంచుకున్న వేలభావాల రూపం
ఆ వెన్నెలలో నీలో నన్నునే చూడాలి!

అందనంత దూరాన్నుండి నన్నంటున్న
ఆ మధురానుభూతిని నువ్వు ఇవ్వాలి 
మాట్లాడాలనుందని గంటకోసారి పలికిన
ఆ కపటంలేని కోరిక ఇప్పుడూ ఉండాలి!

చిరాకేలేని చెలిమి కుంచెతో రంగులద్దేటి
ఆ మమతల మైత్రి నాతో జత కూడాలి
దాపరికంలేని దిగంబరినై ఒడిలో వాలితే
ఆ హిమహస్తం నా నుదుటిని నిమరాలి! 

గాయపడ్డ మదితనువులను నయం చేసే
ఆ శస్త్రచికిత్స సున్నితంగా నేనే చెయ్యాలి!
బాధలు మాయమైన మత్తులో పవిత్రంగా
ఆ తనువులే తాకని శోభనం చేసుకోవాలి!

లవ్లీ ఎండ్…


ఫలించిన ప్రేమకు భగ్నప్రేమకు తేడా ఏంటని ఆలోచిస్తే తెలిసె
ప్రేమించాక ప్రియురాలిని పొందనివాడు దమ్ముకొట్టి దుమ్ములేపి
మందుకొట్టి మస్తుగ ఎక్కడంటే అక్కడ తిరిగి గెడ్డం పెంచుకుని
మాగట్టి మనసున్నోడైతే షాయరీలు గజల్స్ చెప్పి కవిత్వం రాసి
ఇంట్లోవాళ్ళతో తిట్లు తిని మిత్రులతో ప్రేమికుడు అనిపించుకుని
ఇంకా పిచ్చి ముదిరితే ఫకీరులా మారి బికారిలా తిరుగుతాడు
లేదా..ఆలోచించి లైఫ్ లో లవ్ అంటే లైట్ తీసుకోవాలంటాడు!     

ప్రేమ ఫలించినోడి కధ..జబర్జస్తుగానో లేచిపోయో పెళ్ళిచేసుకుని
ఎవరో ఒకరి ఓకేతో మొదలై అక్కడో ఇక్కడో అడ్జస్ట్ అయిపోయి 
పెళ్ళైన వారం రోజులకే ప్రేమలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 
ప్రేమిస్తే పెళ్ళి చేసికోవాలా అని పెళ్ళంటే ఇంతేనాని ప్రశ్నించుకుని 
వేరే దారిలేక కూరగాయలతో కొత్తిమీర ఉచితంగా ఇమ్మని అడిగి
ఇంటికి వస్తూ వస్తూ దారిలో అవసరమైన వస్తువులు కొనుక్కుని
ఆదివారం సీలింగ్ ఫ్యానో తుడుస్తూ ప్రేమలో సక్సెస్ అనుకుంటాడు!

ప్రేమలో పడనోడు ప్రేమించలేనోడు లవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని
ప్రేమగా ఫిలాసఫీ చెప్పి తలబాదుకోవడానికి ఏ రాయైతే ఏమిటని
ఎవరినో ఒకరిని పద్దతి ప్రకారం ప్రేమగా పెళ్ళాడి కాపురం చేస్తాడు
ప్రేమించినా ప్రేమించకున్నా పిల్లల్ని పుట్టించి ఎండ్ అనుకుంటాడు!

ముడిపడని బంధాలు

పుట్టగానే బొడ్డుకోయడంతో మొదలైన బంధాలు తెంచుకోవడం
కాటికెగసే వరకూ కంటిన్యూ అవుతాయని ఎలా మరచిపోతావు!

తల్లిప్రేగు నుండి తెంపుకున్నది మొదలు పాలు కావలంటూ ఏడ్చి
పడిలేచి పరిగెడుతూ అన్నీ సొంతంచేసుకోవాలని ఆరాటపడతావు!

పట్టి నడిపించిన చేతిని వదిలింది మొదలు నిలవక ప్రాకులాడి
ఆపై కొత్తబంధాల బిగుతులో పాతబంధాలు బోర్ కొట్టి వదిలేస్తావు!

సంపాదించే శక్తి సంఘర్షణకి ఓపిక సంభాషించే వారు లేక తిరిగి
చివరికి అల్లుకున్న భ్రమలు తొలగి చక్రభ్రమణంలా తిరుగుతావు!

ఎన్నో వదిలి మరెన్నో పోగేసిన జ్ఞాపకాలను చెత్తలా తగులబెట్టి
ఒంటరిగా మౌనసముద్రంలో మునిగిపోయి కొట్టుకునిపోతావు!

కాలంతీరిన తరువాత సమయం వచ్చినప్పుడు ఎక్కడో తేలియాడి
నిలబడలేక ఉన్నచోటే కుప్ప కూలి చితిలో బూడిదై మిగిలిపోతావు!

అలుపు..

పట్టెమంచం పరుపుపై మఖ్మల్ దుప్పటేసి
తెల్లచీర కట్టి సిగలోన మల్లెపూలు పెట్టేసి   
ఆరుబయట నక్షత్రాలు చంద్రుడి వంక చూసి
పాలగ్లాసు పట్టుకుని ప్రక్కనొచ్చి చేరితే...
రాలే తోక చుక్కకై చూస్తూ కోరికుందంటావు!   

అదేమి కోరికో కదాని ఆత్రుతగా ఆరా తీసి
ఆకాశంలో పాలపుంతవైపు ఆరాటంతో చూసి
ఆవలింతలు ఆగక ఆరుబయట కునుకు వేసి
కోడి కూసేటి వేళకు లోనికి వెళ్ళబోతే...
అక్కడే నులక మంచంపై గురకపెడుతున్నావు!

అడవిగాసిన వెన్నెలాయెనని మల్లెలు గోలచేసి
మండేటి ఎర్రబారిన కనులు కాటుకని కసిరేసి
ఎండమావులాయె కదాని ఎద కోరికలు ఎగసి 
వయ్యారమే వగచి చిర్రుబుర్రులాడబోతే...
శృంగారానికి శ్రీకారమని చీరలాగి అల్లుకున్నావు!

ఆపైన పట్టె నులక మంచాలతో పనేమిటంటూ
క్రిందపడి పైనదొర్లి కటికనేలపైనే కార్యమన్నావు
పనిచేసి అలసిపోతినంటే..నడువంపులోన గిల్లి
చిదిమిదీపం పెట్టేటి నీ అందచందాలు చూసి...
పనిచేసి అలుస్తుంది నేను నువ్వుకాదంటున్నావు!