నా సంపూర్ణం..


అందమైన దృశ్యాల నుండి రంగులు దొంగిలించినా
భావాలోచనలకు పదాలను చేర్చి మాలలు అల్లినా
దేవాలయాల్లో దేవుళ్ళని కొలచి దీవెనలు పొందినా
పగటికలగా వచ్చి నిజమయ్యే స్వప్నానివిగా నీవు
నీ నుండి పొందే స్ఫూర్తికి ఇవేవి సరికావు, రావు
అందుకే నీకోసం వేచి చూసే నిరీక్షణను నేను...

                            *****

నక్షత్రాల నుంచి వెలుతురుని నేను దొంగిలించినా
గాలితెమ్మెర సంగీతాన్ని సాధనతో ఆలాపించినా
చందమామ నా పై చల్లని వెన్నెలను కురిపించినా
ప్రపంచం పరాయైనా నా సొంతమనే ధీమావి నీవు
నీవు నా చెంతలేని లోటును ఇవేవీ పూరించలేవు
అందుకే నీకే హాని జరగరాదని తలుస్తాను నేను...

                             *****

పరుగులేసే వయసును కాలం నుండి దొంగిలించినా
పుస్తకాలు విజ్ఞాన విషయాలు ఎన్నింటిని భోధించినా
స్థితిగతుల నైసర్గిక స్వరూపం నాకణువుగ నర్తించినా
నువ్వు లేనిదే వెలసిన రంగాయె వసంత ఋతువు
నీవల్ల అయిన ఖాళీని ఇవేవీ పూర్తిగా భర్తీచేయలేవు
అందుకే నే కోల్పోయి నిన్ను దక్కించుకుంటాను...

లేపుకు పో..

నా ఆత్మ అటు ఇటూ అల్లాడెనే కానీ 
సుఖమైన సంకెళ్ళలో బంధించబడలేదు
ఒక్కసారైనా మనసు ఆరాటాన్ని తీర్చు
అబద్ధపు ఆత్మ సంతృప్తినే ఇచ్చి పో..

నేను గొంగళి చుట్టిన సీతాకోకచిలుకను
రంగుల రెక్కలొస్తే విప్పుకు ఎగురుతాను
ప్రతికూల పరిస్థితుల కోసం వేచి ఉన్నా
సానుకూలతను సవ్యంగా కూర్చి పో..

ఒంటరైన హృదయ కదలికలు నిస్తేజమై
ఎందుకో తోడుగుండెను జతకోరుచున్నవి
తిరస్కరణకు గురై మది ముక్కలయ్యేను
పరిమితులెరగని తనువును తాకి పో..

తిరుగుబాటు చేసి నీ నుంచి నిన్ను దోచి
అగ్గికి ఆజ్యాన్ని జతచేసేటి ప్రక్రియలో కలిసి
మిగిలినవి నీకు కైవసంచేసే సంకల్పం ఇది     
లేచిపోయే సూత్రంచెప్పి సొరంగం త్రవ్వి పో..

మదిరొద..

ఎప్పుడో ఆవిరైపోయాయి అనుకున్నా కన్నీళ్ళు
మసకబడ్డ కళ్ళను తడిమితే తడిసాయి చేతులు
భావాలను ఏమార్చి నవ్వడం సులభమేం కాదు
విరిగిన మనసును అతికినా కనబడతాయి గీతలు!

నా రక్తంతోనే తడిసారి ఎర్రబడ్డాయి నా చేతివేళ్ళు
గాజుమదిని నమ్మడం తప్పని తెలిపాయి గాయాలు
ఇంకెన్ని కోరికలు కలలను కప్పెడతానో తెలియదు
కానీ పుట్టిపోయేది వట్టిచేతులతో అంటారు లోకులు!

నన్ను ఎవరో తలచుకుంటున్నారని చెప్పె వెక్కిళ్ళు
కొత్తగాలి తెచ్చేను కబురని తెరచి ఉంచాను కిటికీలు
నవ్వి ఆహ్వానిస్తుంది వేడుకో వ్యధో అర్థంకావడంలేదు
జీవితానికి తర్ఫీదుఇస్తున్నా ఒకటేనని వెలుగునీడలు!

చెవిటి మనసుఘోష చేస్తుంది గులకరాళ్ళ చప్పుళ్ళు 
నిండుగా తమ పాత్రని పోషిస్తూ అలసినాయి బాధలు
ఆనందమా నువ్వు నీ పాత్రని ఎలా పోషిస్తావో తెలీదు
అప్పుడప్పుడూ వచ్చి ఇచ్చిపోరాదా కొన్ని సంతోషాలు! 

అక్షరాభరణం


నాకూ నా ఆలోచనలకూ ఏదో అవినాభావ సంబంధం
బాధలోను ఆనందంలోను అక్షరాలుగా అల్లుకుంటాయి
రంగురంగుల ఊహల పరిచయాలకు రూపం ఇస్తాయి!
నాలోనాకు నా అనుభూతులకీ తెలియని అంతర్మధనం
భావాలుగా బయటపడుతూ ఆవేశాన్ని వెదజల్లుతాయి
ఆవేదన చెందుతుంటే ఆత్మీయంగా పెనవేసుకుంటాయి!

నాతో చెలిమి చేయాలనుకునే అదృష్టానికి ఈర్షాధ్వేషం
అవే అందమైన పదాలుగా అల్లుకుని బంధువులైనాయి 
తెలిసీ తెలియని విజ్ఞానపు వ్యక్తిత్వమై వికాసాన్నిస్తాయి!     
నావల్లకాని పనులకు నా రచనలంటే ఎంతో అభిమానం
ఈ విధంగా విశ్వవీక్షణ గవాక్షాలై మురిసి గెంతులేస్తాయి
ఏ మాధ్యమ పరిజ్ఞానంలేని నాతో రచనలు చేయిస్తాయి!
   
నాలో రసాస్వాధన్ని పెంపొందించిన నీకు పద్మ అర్పితం
ఉత్తమాభిరుచినిచ్చిన నీకు నాభావాలన్నీ గులామైనాయి 
ఆప్తంగా అలరించే అక్షరాలకు సాష్టాంగ ప్రణామాలన్నాయి!