విస్ఫోట విసర్జన..

                                                                             చల్లగా వచ్చి గుండెపై మత్తుగా కూర్చున్న నీవు
నాకే తెలియకుండా నా నరాల్లోకి నవ్వుతూ ప్రాకావు
ఎంతైనా నా ఊహాలోకపు ఉపక్రమణ ఉపోద్ఘాతం నాకు
అంతం ఏమిటో చెప్పకుండా చెప్పి ఉపేక్షించమంటావు!

వెలిసిపోయిన చీరకు రంగు నగీషీలు అద్దిన నీవు
కట్టుకుంటే చూడక అకస్మాత్తుగా అంతర్ధానమైపోతావు 
ఎంతైనా ఎండిన మదికి ఎదురైన ఎండమావివి నాకు
మిణుగురుల మెరుపులా మెరిసి మాయమైపోయినావు! 

ఇంత కాలం నా మనసును అంటిపెట్టుకున్న నీవు
హఠాత్తుగా నీ మందీమార్బలంతో తప్పించుకుపోతావు
ఎంతైనా నేను పరాయిదానని అప్పుడనిపిస్తుంది నాకు
కుమిలి ఏడ్చినా రానని కన్నీటిని దిగమ్రింగుకోమంటావు!

ఊటబావిలో నుంచి నీరులా ఉబికి వస్తావనుకున్న నీవు
నాకు తెలియకనే పలాయనవాదికి పర్యాయ పదమైనావు
ఎంతైనా రక్తస్రావం ఆగీ ఆరక కనబడని గాయానివి నాకు 
మనం కలిస్తే పుట్టే నిప్పుముప్పని విస్ఫోటం విసర్జించావు!