అక్షరం ఆసరాగా..

నేనెప్పుడూ ప్రాముఖ్య పదమవ్వాలనే కోరుకుంటాను
ఏవో కొన్ని చెత్త వాక్యాల పద పంక్తుల్లో ఇమడలేను
ఉపనిషత్తుల ఉపోద్ఘాతంలో చిన్ని ఉపమానమే నేను!     

ఎత్తుగడతో పొగిడి ఎత్తిపడేస్తే పొంగే ఉద్వేగ వాగుకాను
అనేకానేక ఒత్తిళ్ళను అక్షరాల ఆసరాతో సేదతీరుస్తాను  
అస్తిత్వాన్ని అరగదీస్తే రత్నంలా మారే రాయిని నేను!

వాత్సల్య అన్వేషణలో వడలి వాలిన తామర తూడను 
నిలకడతో నిశ్చల తటాకంపై తేలుతూ ఆలోచిస్తున్నాను
ఆరిపోయిన అనురాగాన్ని తేమతోతడిమి దిద్దను నేను!

మానసికొల్లాసానికి తియ్యని తెలుగు లిపిని వాడతాను 
తిరిగిరాని సమయానికి నెరవేరని కలల్ని జోడించలేను
స్వాభిమాన అక్షర ఆలుచిప్పలో దాగిన ముత్యం నేను!

మదిమడత విప్పి చదవలేని నిస్సహాయత గెంటేసాను
పదబంధాల సౌందర్యంతో ఆత్మబలాన్ని అలంకరిస్తాను        
నా చిత్రాన్నిగీసి సుపరిచితం చేసుకుంటా నన్ను నేను!

మాయా మచ్చలు


మచ్చా మచ్చా నువ్వు ఏమడతలో నక్కావంటూ
నుదుటిపై ఉంటే కీర్తిప్రతిష్టలూ దానికి క్రింద ఉంటే
ఏకాగ్రత విజయాలకు తిరుగులేదనుకునే తింగరోడా
మచ్చల్ని నమ్ముకుంటే బొచ్చె చేతపట్టుకుంటావు!

చర్మకణాల మార్పుతో పుట్టే మచ్చ మార్చునంటూ
కనుబొమ్మపై ఉంటే కష్టపడాలని ముక్కుమీదుంటే
క్రమశిక్షణా లోపమని పెదవిపై కావాలనే మూర్ఖుడా
చర్మం గీకి మరీ బుగ్గపై మచ్చతో సిరులు కోరేవు!

నల్లని మచ్చ నాలుకపై ఉంటే తెలివి సొంతమంటూ
చదవక విద్యను కైవసం చేసుకునే మార్గముందంటే
కాల్చుకుని వాతతో భుజం తడిమేసేటి అసమర్ధుడా 
దాంపత్య దాగుడుమూతల్లో తొడమచ్చని తడిమేవు!

ఎడమ చేతిలో మచ్చ ఒడిదుడుకుల హేతువంటూ
గుండెలపై ఒక్క పుట్టుమచ్చతోటే ధనం దక్కదంటే 
చంకలో మచ్చకోసం చేతులెత్తి మ్రొక్కేటి చవటగాడా
మెడపై మచ్చలు లేకపోయినా మోసగించబడతావు!

నాభికడ పుట్టుమచ్చ రుచులు కోరేటి నాలుకంటూ
కంటిపై మచ్చతో నమ్మకం కోసం నిజాయితీని గెంటే
చెవిలో మచ్చే అదృష్టం అనుకునే దురదృష్టవంతుడా
పాదంపై పుట్టుమచ్చతో పెళ్ళాం ఆస్తి కావాలంటావు!

వెన్నెముకపైన మచ్చతో వేలు గడించెను ఒకడంటూ
గాడితప్పిన పుట్టుమచ్చలు గంజాయితో స్నేహమంటే
కుడి ఎడమలు రెండూ వేరువేరనే చాదస్త సొల్లుగాడా
మర్మస్థానంలో మొలకెత్తి మచ్చతో మాయచేయలేవు!                                 

వెజ్ లో నాన్ వెజ్

పుల్లట్టులోన పుట్నాల పప్పుపొడేసి నూపప్పునూనేస్తే
పుల్లైసు పుచ్చుకుని పుట్టుక్కని పైనాకిందా చీకినావు

చింతపండు బెల్లం జీలకర్రతో కలిపిదంచి చీకని చేతికిస్తే
చిన్నిసేపలట్టుకొచ్చొండని చిత్తకార్తి కుక్కోలె పైనపడ్డావు 

కందముక్క పులుసెట్టి ఏడన్నం ఆదరాబాదరగా అందిస్తే 
కల్లుముంత ఎత్తింది దించక నాటుసారా ఏసమేస్తున్నావు

సంగటిముద్ద తోటకూరపప్పుతో సల్లారకుండా నోటికందిస్తే 
సందువాసేపా ఇప్పసారా లేకుంటే సరసం చేతకాదన్నావు

పచ్చిపులుసులో ఉల్లిపచ్చిమిరపకాయలేసి పిసికి పట్టనిస్తే
పచ్చిరొయ్యల ఇగురు ఏదని పైత్యంతో కొట్టుకుంటున్నావు

అప్పడాల కర్రతో అటూఇటూ నాలుగుబాది మూలకూలేస్తే
అఫ్ఫుడే చెయ్యాల్సిందని ఇచ్చిన గంజితో గమ్ముగున్నావు 

ఆశాలింగనం

అర్థరూపాయికి ఆరుబయట కాచే ఎండను 
ఆరురూపాయలకు ఆకాశం నుండి వానను
అతిచౌకగా అంగడి నుండి తెస్తావన్న ఆశని
ఆదిలోనే అణచివేయలేకపోయాను ఎందుకో!

సూర్యకిరణాల కాంతిని వడగళ్ళిచ్చే వానను
పరిమళ పుష్పాల సుమధురమైన జల్లులను
పరవశింపజేసే ప్రతీ ఋతువు తనై రావాలని
కోరడం సొమ్ములేని ఖాతాని తెలియలేదెందుకో!

వడపోత ఎండ నుండి సేదతీర్చే చల్లనినీడను
నూలుపోగుల తెల్లదుప్పటి పరచిన పరుపును
ప్రణయ సుధాభరిత తుది ఊపిరి తానవ్వాలని
బజారులో బేరమాడ్డం గుడ్డోడికి చత్వారమనుకో!

ఆరిన కన్నీటిలో మొండిగ మొలకేసిన విత్తును
కాపాడితే చిగురించి పెరిగి అందించిన ఫలాలను
ఎవరో తింటారని తక్కెట్లో తులాభారం వేయడం  
అస్తిపంజరాన్ని ఆబగా చుంబించే ఆత్మ అనుకో! 

రాయలేను..

ఏం రాయను ఎలా రాయను..రాయాలనున్నా
రాను రాను రాసే అర్హతను కోల్పోతున్నాను!!
మనసు మాయమై రాతి గుండెతో నేనున్నాను

ఏం చేసి ఎలా సరిచేయను..దిద్దుకోవాలనుకున్నా
చేసే ప్రతీ పనిలోను నాదే తప్పు అంటుంటేను!!
కాదని నిరూపించుకుని మాత్రం ఏం ఉద్దరించను

ఏం సమస్యంటే ఏం చెప్పను..సమస్య కాదన్నా
నేనే ఒక పెద్ద సమస్యగా కనబడుతున్నానంటేను!!
సాగిపోతున్న గమ్యానికి నేను అడ్డు అనుకుంటాను

ఏం చెప్పి ఎలా మెప్పించను..నీవు నేను ఒకటన్నా
ఆలోచనాభిప్రాయాల్లో బోలెడంత వ్యత్యాసముంటేను!!
ఇంకేం కలుస్తాను దగ్గరనుకున్న నువ్వే దూరమైతేను

ఏం రాయను ఎలా రాయను..శ్వాసతో ఊపిరిలేకున్నా
నవ్వుతూ నవ్వించి నవ్వులపాలు అవుతున్నాను!!
అడ్డదిడ్డంగా రాసేసి రాతల్ని ఎవరికో ఎలా అర్పిస్తాను 

మలుపులో మాయం

ఒక మలుపులో కలిసి కాసేపాగి మాయమైన జీవితమా
మరోసారి నా చేయిపట్టుకుని దివిని భువిని కలిపేయవా
ముక్కలైన నక్షత్రాన్ని అనుకోకుండానే రాలిపోతుంటాను
లేదని తెలిసి కూడా నీ నీడలో ఆశ్రయం కోరుతున్నాను!


అంత అకస్మాత్తుగా జరక్కూడనిదేం జరిగిందని జీవితమా
ఆత్మీయుడిగా హత్తుకుని అపరిచితుడివోలె అంతమైనావు
ఎండిరాలిన ఆకునై నీటిప్రవాహంలో కొట్టుకుని పోతున్నాను
అన్నీ తెలిసిన మదినెందుకు కట్టడి చేయలేకపోతున్నాను!


కొన్నిక్షణాలు కలిసి యుగాల ఎడబాటు వొసగిన జీవితమా
మేఘాల నడుమ నుండి సూర్యకిరణంలా వెలిగిపోతుంటావు
ఎదురుగా నువ్వే కనబడి చేజారుతున్నావని ఎలా చెప్పను     
వెళ్ళినప్పట్నుంచీ విశ్రాంతి లేకుండా నిన్నే వెతుకుతున్నాను!