వైకల్య వ్యధ

భరించలేనంటూనే వ్యధని భరిస్తూ
చేసినబాసల బాటలో ముళ్ళేరుతూ
మూసిఉన్న మదితలుపులు బాదేస్తూ
తెరుచుకోవని తెలిసినా విరగ్గొడుతున్నా!

చీకటి జీవితంలో చమురులేని దీపంతో
ప్రజోజ్వల వెలుగు ఇస్తుందన్న భ్రాంతిలో
మిణుగురులతో చెలిమి అంటుకట్టి ఆశతో
చిగురించబోయే బంధానికి పందిరి అల్లేస్తున్నా!

సంప్రదింపు చర్చల్లో కుంటిదైన సంబంధమేదో
నడవలేదని తెలిసి రేసుగుర్రమల్లే పరిగెత్తాలని
మత్తుమమతల చర్నకోల్ ఝళిపి చేసిమాయేదో
రోజూ రేయింబగలు పలకలేనని నామంజపిస్తున్నా!

అలసటతో విరిగిన అంచనాలకు ఆసరా అతుకేసి
సహనమంటూ ఆగలేక కన్నీటితో కొలనంతా నింపి
ఉప్పనీరు దాహం తీర్చదని తనకన్నీళ్ళు తానేతాగేసి
సమాలోచలతో కోల్పోయిన నాలో నన్నే వెతుకుతున్నా!

రంగులద్దిన వర్ణం

వసంతోత్సాహకేళి హోలీ నాడు...

గులాల్ లో రసాయనం కలిసిందని

కేసరిరంగులో బూడిద ఎక్కువైందని

పచ్చరంగులో ఏ ఆకుపసరూ లేదని

నీలిరంగు నీరంతా విషపూరితనీడలని

సునేర్ రంగు కాదు కదా!.....మెరుపని

పనికిరాని పంచరంగులకి పిచకారేలని?

వర్ణాక్షరాలు రంగరించి వసంతమాడాలని

పంచవర్ణాల పదజాలం పరవశంగా పేర్చి

పదాలులేని హృదయ కవాటాలని తెరచి

మిళితరంగు స్వచ్ఛ శ్వేతవర్ణ హస్తాలతో

పద్మ అర్పిస్తున్న "హోలీ" శుభాకాంక్షలు

ఏదో రోగం

కంటిభావాలకే కరిగిపోయానంటూ...

శరీరాన్ని సాంతం స్కాన్ చేసి చూసేవు

నవ్వితేనే చాలు తీయని తేనంటూ...

గ్లూకోస్ లెవెల్ పెరిగిందని కంగారుపడేవు

కోరుకున్న కోరికలు ఏం లేవంటూ...

కల్లబొల్లి కబుర్ల కొలెస్ట్రాల్ లెవెల్ దాటేవు

స్నేహానికి కొత్తర్థం చెప్పేద్దామంటూ...

ఎదసవ్వడి వినమని ఎకో పరీక్ష చేసేవు

ప్రేమ లేదంటే గుండెతూట్లంటూ...

కనబడని కన్నాల ఆంజియోగ్రాం చూపేవు

ఉన్నమాటంటే ఉసూరుమంటూ...

నీరసించి హిమోగ్లోబిన్ ఏదో తగ్గిందంటావు

పరీక్షలన్నీ ప్రేమరోగ సాక్ష్యమంటూ...

పదికాలాల ఆయుషుని పదిలంగా కోరతావు