జలమునై గళమువిప్పిన!

నేను జలమునై గళము విప్పితే!
శివుని శిరమున గంగనై, భగీరధుని తపస్సునై
పరవళ్ళు తొక్కుతూ సముద్రుడిలో ఏకమౌతా...

నేను జలమునై గళము విప్పితే!
వర్షించే మేఘమై, వరద కాని వాగునై
హరివిల్లుల జల్లులతో మీకు ప్రియమై మీలో ఒకరినౌతా...

నేను జలమునై గళము విప్పితే!
పంటల పచ్చదనానై, కర్షకుల ఆశాజ్యోతినై
సస్యశ్యామల జగతికి సోపాన మార్గమౌతా...

నేను జలమునై గళము విప్పితే!
జీవనాధారమై, సేదతీర్చ చల్లదనానై
ఆకలి దప్పికలు తీర్చి అందరి పెదవులపై చిరునవ్వునౌతా...

నేను జలమునై గళము విప్పితే!
ఒక వ్యధా గాధనై, కన్నీటిధారనై
చెంపన జలజలా జారి, ఎదను చేరి ఓదార్పునౌతా...

జలమేలే అని జారవిడిచి వృధాచేస్తే?
బీడువారిన నేలనై, స్వేదబిందువునై
గాయపడిన హృదయముతో ఆవిరై మీకు దూరమౌతా!!!

12 comments:

 1. ఎంత చక్కని కవిత !
  ఎంత చిక్కని భావుకత !
  బొమ్మకు ’అమ్మ’లా ఉంది మీ కవిత ...
  అందుకోండి నా అభినందన చందనం !

  ReplyDelete
 2. నేను వ్యాఖ్యనై గళం విప్పితే,
  ప్రశంశల వర్షమై మీ కామెంట్ బాక్స్ నింపుతా..

  ReplyDelete
 3. pl.correct--"ప్రశంస"..

  ReplyDelete
 4. 'పచ్చదనాన్నై' 'చల్లదనాన్నై' అని మార్చండి.. బాగుంది కవిత..

  ReplyDelete
 5. చక్కని భావమండి...

  ReplyDelete
 6. చాలా బాగుందండి కవిత. నీరు ఎంత ముఖ్యమో చాలా చక్కగా చెప్పారు.

  ReplyDelete
 7. పైంటింగ్ కూడా చాలా బాగుంది మీరే వేశారా?

  ReplyDelete
 8. చాలా బాగుందండి మీ కవిత...

  ReplyDelete