చేజారిన


పసితనానికీ పరిపక్వానికీ నడుమ ప్రేమబీజమేసి
అంకురించని అనురాగానికి పరిపూర్ణత్వం జోడించి
వికసించని పువ్వులోని పుప్పొడంతా మాయంచేసి
ఫలం అందించలేదంటూ నిందలుమోపడం ఎందుకో!

అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి
స్వయంవరానికి రానన్న వరునికి వలపుపీఠమిచ్చి
కళ్యాణ తోరణం అనుకుని తమలపాకుల పందిరల్లి
బంధమేదో బహుగట్టిది అంటూ విందులు ఎందుకో!

పతనమైన పరిచయంలో నుండి పుట్టిన భావాన్ని
గొంతు నులిమేసి రాగం రంజింపజేసిందంటే నమ్మి
కాలిన కాలితో వెర్రిగెంతులేస్తూ చేసిన తాండవాన్ని
మెచ్చి చప్పట్లు కొట్టారంటూ తెగసంబరం ఎందుకో!

అవనికీ అంబరానికీ నడుమ అంచనాల్లేని నిచ్చెనేసి
చలనంలేని చెలిమిలో చంచలమైన నెచ్చెలిని గాంచి
మెండైన మైత్రినందీయలేని అల్పాయుష్షుపై బాసచేసి
దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో!

21 comments:

 1. చాన్నాల్లకి మళ్ళీ యక్ష ప్రశ్నల్లా పద్మప్రశ్నలు... కవిత ఇరగదీశారండోయ్...

  ReplyDelete
 2. అద్భుతమైన భావాలతో అక్షరాలకి అభిషేకం చేసారు. మీలోని కళామతల్లికి శతప్రమాణాలు.

  ReplyDelete
 3. అవును. ఈ వ్యాకులతకు అర్ధం ఉంది.
  ఆలోచనా సరళి అలా సాగిపోవడమూ సహజమే మరి.
  " అవనికీ అంబరానికీ నడుమ అంచనాల్లేని నిచ్చెనేసి
  చలనంలేని చెలిమిలో చంచలమైన నెచ్చెలిని గాంచి
  మెండైన మైత్రినందీయలేని అల్పాయుష్షుపై బాసచేసి
  దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో! " ......

  ఎన్నో భావాలున్న కవిత ఇది. కదిలించింది కుడాను.
  ఇలా రాయడం మీకే సాధ్యం పద్మార్పిత గారూ .
  సరస్వతీ దేవి మీ నాలుకపై స్థిర పడిపోయిందా అని అబ్బురపడ్డా.
  కవిత కు జోడించిన 'బొమ్మ' ఆకర్షణ తో పాటు కవితకే కొత్త రంగులద్దింది.
  అభినందనలు మీకు మరో మారు పద్మార్పిత గారూ.

  *శ్రీపాద

  ReplyDelete
 4. నీవొక కవితల కల్పపతరువు. Hats off.

  ReplyDelete
 5. "పతనమైన పరిచయంలో నుండి పుట్టిన భావాన్ని
  గొంతు నులిమేసి రాగం రంజింపజేసిందంటే నమ్మి"
  "అవనికీ అంబరానికీ నడుమ అంచనాల్లేని నిచ్చెనేసి
  చలనంలేని చెలిమిలో చంచలమైన నెచ్చెలిని గాంచి"
  "పసితనానికీ పరిపక్వానికీ నడుమ ప్రేమబీజమేసి
  అంకురించని అనురాగానికి పరిపూర్ణత్వం జోడించి"
  ఇంత పరిణితి చెందిన వాక్యాలు ఎలా సాధ్యం పద్మా!
  చదివినప్పటి నుండి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా నువ్వు నా నెచ్చెలివని.

  ReplyDelete
 6. ఇంత భారమైన భావాలతో మనసుని భారం చేసి అంతలోనే మళ్ళీ మరో పోస్ట్ లో మల్లెపూలవాన జల్లులతో ముంచేస్తారు కాబట్టి ఈ భారాన్ని సునాయసంగా మోసేస్తున్నాం.....మల్లె పూలవానకై ఎదురుచూస్తూ

  ReplyDelete
 7. నా ఆలోచనలకు అందనంత అందమైన అద్భుత భావవీచక.

  ReplyDelete
 8. అందమైన అక్షరమాల ... అధ్భుతం మేడం.

  ReplyDelete
 9. నువ్వు వ్రాస్తూ ఉండు, మేము చదివి ఆస్వాధిస్తూ ఉంటాం, ఇంతకుమించి ఏం చెప్పను.

  ReplyDelete
 10. అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి
  స్వయంవరానికి రానన్న వరునికి వలపుపీఠమిచ్చి
  కళ్యాణ తోరణం అనుకుని తమలపాకుల పందిరల్లి
  బంధమేదో బహుగట్టిది అంటూ విందులు ఎందుకో...? ఎవరికోసం ఈ ఎదురు చూపులు

  ReplyDelete
 11. మీ మనసు పలికిన మౌన భావాలా ఇవి. చాలా సున్నితంగా ఉన్నాయి.
  అంతే భారంగానూ ఉన్నాయి. పూరేకులు, ఆ కిందనే ముళ్లు. పసిప్రేమ, బోసినవ్వు
  ఒకటే. మీ కవిత అలానే ఉంది. చాలా బాగుంది పద్మగారు. నిండైన వ్యక్తిత్వం...
  ఉన్నప్పుడే.. ఇలాంటి నిండైన కవితలు వస్తాయి.

  ReplyDelete
 12. అంధమైన తెలుగు అక్షరాలకు వేదిక మీ బ్లాగ్ పద్మ గారు:-)
  ప్రతీ పదం చాల మృదువుగా, అందంగా మీ భావాలతో తీర్చిదిద్దుతారు:-)
  ఇవన్ని మీ మనసు పలికిన మౌన భావాలు కదా!
  మేము మీ బ్లాగ్ లో మెంబెర్స్ అవడం మా అదృష్టం:-) షుక్రియ:-)

  ReplyDelete
 13. దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో!...ఎదను పిండినా కవితకు ఊపిరిపోసింది

  ReplyDelete
 14. ఎందుకని ఇంత వ్యధ చెందే పదాలు అని అడిగి వేదనలో మునిగి బయటకు రాలేనంత గొప్పగా .
  చేజారిపోతున్న తెలుగుతనం నీ పదాలతో కొత్త ఊపిర్లు పోసుకుంటుంది-హరినాధ్

  ReplyDelete
 15. ఏమాటకామాటే.....ఏడుపులో కూడా అందంగానే ఉంటార.:-)

  ReplyDelete
 16. వేదనే అయినా చిత్రంలోని ధీమా మీ కవయిత్రి మాటల్లో కనబడుతుంది.

  ReplyDelete
 17. తెలుగమ్మాయి మాటే నాదీను...

  ReplyDelete
 18. పద్మగారు, నిజానికి కవిత అర్ధం అవడం కష్టం. నాలుగుసార్లు చదవాల్సి వచ్చింది . పరిపూర్ణ ప్రతిభావంతురాలు ఈ కవిత వ్రాసిన వ్యక్తి అని ఒక ప్రముఖ వ్యక్తి అంటే ఎంతో గొప్పగా అనిపించింది. ఎంతైనా మా గురువు మీరు .

  ReplyDelete
 19. పద ప్రశ్న బంధనం బాగుంది పద్మార్పితా

  ReplyDelete
 20. అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి
  స్వయంవరానికి రానన్న వరునికి వలపుపీఠమిచ్చి
  కళ్యాణ తోరణం అనుకుని తమలపాకుల పందిరల్లి
  బంధమేదో బహుగట్టిది అంటూ విందులు ఎందుకో!//// మీకు మాత్రమె సాధ్యం ఇలాంటి కవితలు రాయడం. చక్కని భావంతో అలరించారు.

  ReplyDelete