జీవితమా....మా ఇంట అడుగిడుమా మా స్థితిగతులను కాస్త కనుమా తెలుపనా మాఇంటి చిరునామా నాలుగు వైపులా గోడలే లేవుసుమా!
జీవితమా....లేదు నీకు తలుపు తట్టవలసిన అవసరం గుబులుతో గుమ్మం పలుకుతుంది మీకు స్వాగతం పైకప్పుకి తెలుసు ఎండావానల తులాభారం కటికనేల పైనే నిన్ను కూర్చుండబెట్టే పేదలం!
జీవితమా....మా ఇంట అడుగిడుమా మా ఇంటి మారుపేరు ప్రేమా నీ నీడలో మమ్ము తలదాచుకోనీయుమా కాస్త చేయూతనిచ్చి మమ్ము కాపాడుమా!
జీవితమా....మా అభిమానమే నీకు ఆతిధ్యం బోర్లించిన బొచ్చెలని చూసి నీవు చేయకు పరిహాసం మా ఇంట ఏమున్నది నీకు తెలియని రహస్యం నీ ఆదరణతో విరియాలి మా పెదవులపై దరహాసం!
జీవితమా.... మా ఇంట అడుగిడుమా ఆకలి తీర్చి మా ప్రాణాలని నిలుపుమా ఆగలేక అర్థిస్తున్న మా గోడు కాస్త వినుమా మా ఇంట ఆనందాలని కురుపించుమా..ఓ జీవితమా!