నాకు నేనే..

నాకేం నాలుగ్గోడల మధ్య నలగాలనిలేదు
స్వచ్ఛమైన అభిప్రాయలమర్చిన సొరుగునై
భావోద్రేకాలు అన్నింటినీ వ్యవస్థీకృతంచేసి
నా జీవితారణ్యానికి నేనే లాంతరునౌతా..
నాకెవరూ సహకరించలేదని కృంగిపోలేదు
గాఢాంధకారంలో నాకు నేనే తోడూనీడనై
సంతోషాలు పంచి దుఃఖాన్ని దిగమ్రింగేసి
నా సొంత మంటలలో నేనే వెలిగిపోతా..
నాకేదో అయ్యిందని పరామర్శ అక్కరలేదు
బాధించేవారి సహేతుక సాకులకి దూరమై
మాట్లాడలేని వారికి మాటలు అప్పగించేసి
నా ఆయుష్షురేఖకు నేనే భరోసా అవుతా..
నాలోని నిస్తేజం నాకలసట కలిగించలేదు
ఎందుకంటే నేను నా శరీరానికి బానిసనై
పరుగులు పెట్టించి నన్నునే పరిపాలించేసి
నా బ్రతుకుకి మంచి అర్థం నేనే చెబుతా..

ఇల్లాలు-ప్రియురాలి

తనకేమో కాలం కలిసొస్తుంది
అది క్రమబద్ధమైన సంబంధం
ఈమెదేమో అక్రమసంబంధం!

తను అధికార బద్దమనిపిస్తుంది
ఆమెది చెక్కు చెదిరిపోని స్థానం
ఈమెదేమో గడియకో నిగూఢం!

తన అవసరాలని లాక్కుంటుంది
ఆమెది అందరి ఆమోద యోగ్యం
ఈమెపైనేమో ఛీత్కార అభియోగం!

తనేమో అడిగి అలిగి సాధిస్తుంది
అది బాధ్యతగా చేయాల్సిన కార్యం
ఈమెదేమో ఎదురుచూసే తరుణం!

తన కడుపున వంశాంకురం ఉంది
అది భార్యగా అమెకున్న అదృష్టం
ఈమె కడుపు కొవ్వు కాలుజారడం!

తనకి అన్నింటా భాగస్వామ్యముంది
ఆమెది హక్కుతో కూడిన యవ్వారం
ఈమెదేమో ఇచ్చి పుచ్చుకునే బేరం!

తాను నలుగురిలో తలెత్తి నడుస్తుంది
ఆమెది గర్వంతో కూడిన నిర్భయం
ఈమె మనసున మూలెక్కడో పదిలం!

తను తిట్టినా కొట్టినా పక్కనుంటుంది
ఆమెతోటి చావుబ్రతుకుల సమ్మోహం
ఈమెతో ఉంటే అది రంకు బాగోతం!

ఇంటా బయటా ఇల్లాలు గెలుస్తుంది
అతడు కాదని అవునన్నా ఇది నిజం
ప్రియురాలు ఎప్పుడూ ఆమడ దూరం!

చిల్లు గాలిపటం

చీపురుపుల్ల త్రుంచి కాగితాన్ని దానిక్కట్టేసి
ప్లాస్టిక్ పతంగీతో పంతమేల గాలిపటమా
చంద్రుడ్ని తాకబోయి చెట్లలో చిక్కుకుంది
అది దాని గొంతెమ్మ కోరికని అనుకోవచ్చు
గాలిపటానికి దారమాధారమని ఎవరికెరుక?
హద్దుమీరిన ఆశయాల్ని ప్రేమతో పెనవేసి
పైకెగిరితే పడిపోతానని తెలిసీ గాలిపటము
ఎవరో పట్టుకుంటారన్న ధీమాతో ఎగసింది
రాలినగాలిపటం రంగులు నచ్చి ఉండొచ్చు
ఉరికొమ్మకు వ్రేలాడుతుందని ఎవరికెరుక?
ఆశల ఆధారాలన్నీ దారంగా ముడులువేసి
పైకెగిరిన మనసు చిల్లుపడిన గాలిపటంలా
క్రిందపడి ఇంకా రెపరెపలాడుతూనే ఉంది
ఎగరేసే వారికది కాలక్షేపం అయ్యుండొచ్చు
ప్రాణాన్ని ఫణంగా పెట్టిందని ఎవరికెరుక?