తమలో తాము ఏడ్చి నవ్వించినా పైకి నవ్వుతూ లోలోన ఏడ్చినా.. వారు ఉన్నా లేకున్నా తేడా ఏమిటి? జోలపాడి కలల ఊహలు ఊగించినా దరిచేర్చుకుని దూరంగా నెట్టేసినా.. నిదుర మేల్కున్నోళ్ళు చేసింది ఏమిటి? కోరిన కోరికలు తీర్చి దివాళా తీసినా వాస్తవాలను కలలుగా చూపించినా.. వచ్చి వాటేసుకున్న ఆస్తులు ఏమిటి? పగలురేయి వచ్చిపోతూ కాలం గడిచినా నేడుని రేపటి ఊహలతో బ్రతికించినా.. సమయానికి వచ్చిన సమస్య ఏమిటి? నా ఆలోచన్లు అర్థంలేని ప్రశ్నలే అయినా వచ్చేదేమిటి ఒరిగేదేమిటని అడిగినా.. జరిగేవన్నీ జరుగక ఆగిపోవునా ఏమిటి?
అవయవ అందాలు చూసారు అందరూ అంతరంగమదనం కాంచలేదు ఎవ్వరూ అంగాంగం ప్రదర్శించెనని నిందలు వేసి ఆయుధంగా శృంగారం సంధించెనన్నారు! అందం చూసి నిగ్రహం కోల్పోయినవారు అంతరంగ సిం హాసనం పై కూర్చోబెట్టారు అనుయాయులకు ఇది అర్థంకాక గేలిచేసి అనైతికం ఆమె భావాలోచనలు అన్నారు! ఆధ్యాత్మికత జీవిత అవసరం అన్నవారూ అంతర్గతంగా రాజీపడి ఆనకట్టలేసినవారూ అబల సంధించిన సమ్మోహన అస్త్రం అని అదే కామకళా వైదుష్యంలో మూర్చిల్లారు! అందని అందం వికృతమని సర్దుకున్నవారు అధికమించి కొంతైనా అర్థం చేసుకున్నవారు అవసరమైన ఊరడింపుతో అభయమే ఇచ్చి అంతిమంగా కాలసర్పకాటు పడేలా చేసారు!