కలలో...

కలలమాటున దాగిన ఆంతరంగికుడా
నీపై నాకెందుకు ఇంత తగనిమక్కువ!
ఎగసిపడే హృదయస్పందనల నడుమ
నలుగుతున్నాననేగా నేనంటే లోకువ!
కలలో కనబడితేనే నాకింత పులకరింత
కనులు తెరచితినా తెలియని కలవరింత
ఒకటవని మనకోరికలకి కళ్ళెం వేయలేక
కలలుకంటున్నా వెన్నెలోవేకువో తెలియక

తెలుపని భావాలకు జాబీయని ప్రియుడా
ప్రేమలో స్వార్థం పెరిగి మూగగా ప్రశ్నించి!
నీతో ఊసులాడే నా ఎదను ఎత్తుకెళ్ళాలని
ఓడేప్రయత్నాలెన్నో చేసి నన్ను నే మరిచి!
చివరికి కలలోవిన్నా నీ అడుగుల సవ్వడి
నాలోనే నాకు తెలియని ఏదో వింత అలజడి
ఏకాంత పయనంలో కలలతో వాదించిగెలవక
జీవితాన్నేమార్చా వాస్తవమో ఊహో తేల్చలేక

23 comments:

  1. మనసెరిగినవాని కోసం మనసులో రేగే అలజడిని మధురంగా చెప్పారు.
    ప్రతీ పదమూ చాలా చాలా నచ్చేసింది.ఎలా చెప్పాలో తెలియడంలా....

    ReplyDelete
  2. కలలోను నీ తలపు, కలవరంలోను నీ వలపు.......మరో కమ్మని ప్రేమకావ్యం మీ కలం నుండి.

    ReplyDelete
  3. వెన్నెల్లో స్వప్న సందేశాన్ని, వేకువలో మేఘసందేశాన్ని పంపుతోంది మీ కవిత. వలపు జల్లుల వాన. కనురెప్పల మాటున దాగిన కలనూ చిత్రించిన వైనం. కలల అలలకు, కనులు పలికిన భావాలకు... రంగులద్దిన మీ చిత్రంలో ప్రేమావేశాన్ని ఒడిసిపట్టిన మీ కలం నుంచి జారిన ప్రతీ సిరా చుక్క... ఎంత విరహవేదన పడుతూ అక్షరమైందో కదా...

    ReplyDelete
  4. ఓ ఆంతరంగికుడా! నీపై నాకెందుకు ....
    ఇంత తగనిమక్కువ? నీ అడుగుల సవ్వడి విని నాలో నాకీ తెలియని ఇంత వింత అలజడి?

    చక్కని భావన
    అభినందనలు పద్మార్పిత గారు!

    ReplyDelete
  5. అంతరంగికుడా అర్థం చేసుకోరా ....

    ReplyDelete
  6. "కలలో కనబడితేనే నాకింత పులకరింత
    కనులు తెరచితినా తెలియని కలవరింత"
    ....... అబ్బ! అక్కడ మొదలైయింది ఆ వింత.
    ఆ తర్వాత ఎక్కడెక్కడో విహరింపచేసింది
    మా అందరిచే . ఇది న్యాయమా చెప్పండి పద్మార్పిత గారూ

    "చివరికి కలలోవిన్నా నీ అడుగుల సవ్వడి
    నాలోనే నాకు తెలియని ఏదో వింత అలజడి"
    ...... కాస్తా ఏదో ఉరట మరి . నూటికి
    నూరు పాళ్ళు శృంగారమే అయినా అందులో
    నిష్కల్మషముంది - నిజాయితీ ఉంది -
    అందుకే మీ ఈ కవిత ఎవరికీ వల వేయని ఓ తీయని కల.
    సూపర్ పద్మార్పిత గారూ .
    శ్రీపాద

    ReplyDelete
  7. అంతరంగం లో మెదిలే భావాలే కన్నుల్లో కలలై మెదులుతాయి రోజుకోమారు
    అల్లంత ఎత్తులో ఉన్న వెన్న ఉట్టి అంటే కృష్ణుడికి ఎలా ఐతే మక్కువో
    అందని ద్రాక్ష కోసం నక్క పడే పాట్లు, అందుకోవాలనే ఆశ మనలో కలిగించే ఆత్రం
    కన్నులు చూసిన కొన్ని చూడాలనుకున్నవి కొన్ని చూడలేని కొన్ని కలగలిపి మనసు గీసే 'సిత్రం'
    భావాలలొగిలిలొ మనసుముంగిలిలొ విరబూసే నయనానందకర ఘట్టమో
    అందుకోసం మీ అంతరంగం లో అన్తరమథనమ్ కావ్యలొకానికే వన్నె తెచ్చి పెట్టినట్టుంది పద్మగారు

    ReplyDelete
  8. very beautiful feeling.. with wonderful words. Very nice painting:-)

    ReplyDelete
  9. కలలుకనే కళ్ళకి అన్నీ అందమైన భావనలే.

    ReplyDelete
  10. భావాలు తెలిపినా బదులీయని ఈరోజుల్లో మీరు తెలియజేయని భావాలకి జవాబు ఇవ్వమనడం అన్యాయం.

    ReplyDelete
  11. చాలా చాలా చాలా బాగుంది మేడం ...

    ReplyDelete
  12. కలలమాటున దాగిన ఆంతరంగికుడా
    నీపై నాకెందుకు ఇంత తగనిమక్కువ!
    ....
    ఏకాంత పయనంలో కలలతో వాదించిగెలవక
    జీవితాన్నేమార్చా వాస్తవమో ఊహో తేల్చలేక

    ప్రేమలోని పారదర్శకత్వాన్ని పరిమళాన్ని ఆవిష్కరించారు పద్మార్పిత గారు.. మరో ఆణిముత్యం మీ హృదయ కలం నుండి. సుమాభివందనాలు...చిత్రం ఎప్పట్లానే అదిరింది..

    ReplyDelete
  13. నిదురపోని మీ కళ్ళు కలలు ఎలా కంటున్నాయి మేడం.....ఊహలే కానీ

    ReplyDelete
  14. బాగుంది, పదాలను మించిన చిత్రం, చిత్రాన్ని మించిన భావం.
    మీదైన ఈ సున్నిత భావం చాలా బాగుంది పద్మా.

    ReplyDelete
  15. ఒకటవని మనకోరికలకి కళ్ళెం వేయలేక
    కలలుకంటున్నా వెన్నెలోవేకువో తెలియక
    నాకెంతో నచ్చిన రెండు వరుసలు

    ReplyDelete
  16. పద్మాజీ చాలారోజులకి మీ ప్రేమభావాలని కవితగా కలలో అందించి అలరించారు. కూల్ కూల్ కవిత

    ReplyDelete
  17. సున్నితత్వం ప్రేమ విరహవేదన కలబోసి కమనీయమైన మరో కమనీయ కవిత పద్మార్పిత కలం నుండి.

    ReplyDelete
  18. మీ ఆ ( మ ) న్ తరంగం ...మీ ఆంతరంగికుడి హృదయ తీరం వరకు చేరాలని ..... ఒక అందమైన ( చిత్రం ) కవిత ....

    ReplyDelete
  19. నీదైన స్టైల్ లో మరో ప్రేమాకావ్యం

    ReplyDelete
  20. "కలలో" భావాక్షరాలని కవితగా ఆదరించి అభిమాన స్పందనలు అందజేసిన అందరికీ నా అభివందనాలు._/\_

    ReplyDelete
    Replies
    1. ఇలా ఒక్క లైన్ లో స్పందించి నిరుత్సాహపరచడం బాలేదు :-(

      Delete
    2. అన్యాయం ఇలా అర్థంతరంగా ఒక్క ముక్కలో రిప్లై :-)

      Delete
  21. మీ ఈ కమ్మని కలలకు సహకారం ఎవరో ? :-)

    ReplyDelete