స్వగతం

స్వగతాలనే తలచి స్వయంవరం వలదని
ఒంటరితనాన్నే వరించి కౌగిలిలో బంధిస్తే..
వేదనే నీకు సరైన జోడని సంబంధం కూర్చి
కన్నీరే తెగసంబరపడి ఏరులై పొంగిపొర్లింది!

స్వఛ్ఛతలేని హృదయం ఇంకేదో కావాలని
కోర్కెలతో కొత్తపరిమళాలనే కోరి ఎగిరిపోతే..
పాచిన పాతజ్ఞాపకాల దొంతర గుప్పున చేరి
ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరిని చేసింది!

స్వలాభమేదో ఆశించిన కొత్తపరిచయాన్ని
ప్రేమపుప్పొడి అద్దమని పురివిప్పి ఆడితే..
వాడినపువ్వుకి వాసన ఎక్కడిదని విసిరేసి
వికసించని మొగ్గవైపు విప్పార్చి చూసింది!

స్వయంకృతం తెలిసి స్వరమే సరిచేసుకుని
కోయిలవలే కూస్తూ మన్నించమని కోరితే...
నేలరాలబోయిన ఆకుని నీడకోరబోకని జారి
నీలినీడలపై కప్పుగామారి కన్నీటినే దాచింది!

40 comments:

  1. స్వఛ్ఛతలేని హృదయం ఇంకేదో కావాలని
    కోర్కెలతో కొత్తపరిమళాలనే కోరి ఎగిరిపోతే..
    పాచిన పాతజ్ఞాపకాల దొంతర గుప్పున చేరి
    ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరిని చేసింది!
    అద్భుత పదమంజరి-------పద్మ పదఝరి

    ReplyDelete
    Replies
    1. పదఝరి మెచ్చిన మీకు వందనాలు.

      Delete
  2. Wonderful thoughts
    Hot gun shots your words

    ReplyDelete
    Replies
    1. this is not fair....you are comparing with your profile pic :-) thank you

      Delete
  3. గతమూ స్వగమూ అంతా వేదనేనా ? వలపులో వేదన.. తలపులో వేదన..కలలో వేదన.. కన్నీటి అలల్లో వేదన..
    వేదన మీ జన్మ హక్కా???

    ReplyDelete
    Replies
    1. వేదన నా హక్కు కాదు నాకు అక్క వినోద్ :-)

      Delete
  4. స్వగతాలనే తలచి స్వయంవరం వలదని
    ఒంటరితనాన్నే వరించి కౌగిలిలో బంధిస్తే..
    వేదనే నీకు సరైన జోడని సంబంధం కూర్చి
    కన్నీరే తెగసంబరపడి ఏరులై పొంగిపొర్లింది!
    వేదనాభరిత అక్షర సుమమాల-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. వేదనలో పొంగే భావాలు మనసుని తాకుతాయి అన్న భావం నాలో...ధన్యవాదాలండి.

      Delete
  5. గుండె గుప్పిట బంధించి మనసులోని నిర్మలత్వాన్ని ప్రేమలోని వేదనను మేళవించి చిత్రంతో పాటు ఆవిష్కరించడం మీకు మాత్రమే తెలుసు. అభినందనసుమాలతో

    ReplyDelete
    Replies
    1. మనసున ఉన్నదే మాటల్లో రాయగలం కదండి :-) అభివందనం

      Delete
  6. aap ki yeh adaa bahut khoob padmaji

    ReplyDelete
  7. మీ మార్క్ కవిత.
    చిత్రం అద్భుతం

    ReplyDelete
  8. చిక్కని పదాలతో కవితలు అల్లి గుండెను బరువు ఎక్కించారు

    ReplyDelete
    Replies
    1. చదివి అస్వాధించి బరువు దించేసుకోండి.:-)
      thank you

      Delete
  9. ఎప్పుడూ ఏదో ఒకటి అని ఏడిపించడం పద్మార్పిత కవితలకు పరిపాటైపోయింది:-)

    ReplyDelete
    Replies
    1. ఏడిపిస్తే ఏడ్చేంత చిన్నపిల్లాడివి కాదు కదా మహీ :-) నవ్వేయ్

      Delete
  10. వేదన మీరు రాసిన కవితల్ని చదివి మనుషుల్ని తాము సున్నితంగా తాకుతున్నామని విర్రవీగుతాయేమో:-)

    ReplyDelete
    Replies
    1. విర్రవీగేంత ధైర్యమా నా రాతలకి :-)

      Delete
  11. గుండెలోతుల్లో నుండి పలికే అక్షరాలు మీ కవితలు అందుకే గుండెల్ని పిండినా హత్తుకుంటాయి. చక్కని మరో కవిత మీ కలం నుండి.

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారు.....మీ మనసుని హత్తుకునేలా సదా రాసే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్యూ

      Delete
  12. పాచిన పాతజ్ఞాపకాల దొంతర గుప్పున చేరి
    ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరిని చేసింది!
    జ్ఞాపకాలు గుప్పుమన్నా కంపుకొట్టినా అలవాటైన ప్రాణం ఆగకుంది మీ కవితలు చదవకుండా నిదురరాకుంది ...మీరు గాప్ ఇవ్వకుండా రాస్తూ ఉంటే పాచిపోయే చాన్స్ ఉండదు...అలోచించడిలా :-)

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్షా....కవితలు కంపుకొడుతుంటే నిద్రమాట అటుంచి ఇంఫెక్షన్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త :-) రోజుకో కొత్తది ఎక్కడ రాయను అసలే ఆలోచనలు హరించిపోతుంటే....ఆలోచించు :-)

      Delete
  13. ఎక్కడైతే కవిత్వం కమ్మని తేనై ఉప్పొంగి, చదువుతుంటే జిహ్వను తాకి కొత్త రుచిని పరిచయం చేస్తుందో...
    ఎక్కడైతే మది భావాలు సున్నితపు పొరలను తొలచి అక్షరాలకు కొత్త భాష్యాన్ని నేర్పుతుందో...
    అదే మన పద్మార్పిత గారి బ్లాగ్...
    ఎంత చక్కటి భావావిష్కరణ మీ ఈ కవితలో... చలా రోజులతరువాత ఇలాంటి కూర్పుతో.. భావంతో జాలువారిన కవిత... ( అంటే ఇది మిగతా కవితలతో పోలిస్తే కాస్త డిఫరెంట్.)హ్యాట్సాఫ్... మేడం..

    తెలుగమ్మాయిగారన్నది నిజం.

    ReplyDelete
    Replies
    1. మీ అందరి అభిమానం నాలోని భావాలకి అక్షర రూపాన్ని ఇచ్చి ప్రేరేపించడం నా అదృష్టం.

      Delete
  14. " వాడినపువ్వుకి వాసన ఎక్కడిదని విసిరేసి
    వికసించని మొగ్గవైపు విప్పార్చి చూసింది! "

    ఇదే ప్రకృతిలోని జీవుని ప్ర(తి)కృతి .

    ఇక చిత్రం అందాల హొయలు కుమ్మరిస్తూనే నిస్సారమై పోయింది భావానికి తగ్గట్లుగా .

    ReplyDelete
    Replies
    1. కృతి.....ప్రకృతి గురించి చెప్పే జ్ఞాన సంపన్నులు మీరు, నిస్సారమైన చిత్రంలో సారాన్ని చూడలేరంటే నమ్మేదెలా :-)

      Delete
  15. మీరు నాకు ఈ జన్మకి అర్ధంకారు:-) అప్పుడే ప్రేమ ఎంతో మధురం అనే భావాన్ని కలిగిస్తారు. మరో కవితలో ప్రేమ సుద్ద వేస్ట్ అనేటట్లు మా బ్రెయిన్ వాష్ చేస్తారు. అర్ధం అయినా కాకున్నా పర్వాలేదు అంటారు.

    ReplyDelete
    Replies
    1. నన్ను అర్థం చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి...."జోగీ జోగీ రాసుకుంటే బూడిదేగా రాలేది" :-)

      Delete
  16. మగువ ప్రేమను అర్థం చేసుకోవాలంటే.... అదొక యజ్ఞమే. ఆ యజ్ఞం కూడా ఎప్పటికీ పూర్తి కాదు. ఇక్కడి విధి వంచిత కనిపిస్తోంది. కానీ... అంతలోనే అంతర్ముఖాన్ని బయటపెట్టలేని అమాయకత్వమూ... తెలుస్తోంది. కొత్త కొర్కెలు ఆశల వారధులని నా అభిప్రాయం. కాలగర్భంలో శిథిలమైపోయే ఆగాథాలు పాత జ్ఞాపకాలు. వర్తమానం ఆశ.. ఆశను వదిలి అగాధం వైపు చూడడమెందుకని... మీ చిత్రమే చెప్తోంది. మరి.. హృదయానికే స్వచ్ఛత లేదని నిందించడం తగునా. చిత్రంలో కవితానాయిక కూడా వికసించిన ఆశలనే వరించింది.... తడి ఊహల్లో కొత్త దనం కోసం ఆరాటపడుతోంది... అది తప్పని మనసు బిడియపడుతోందేమో గానీ... కాదు ఒప్పేనని హృదయం మద్దతిస్తోంది. అందుకేనేమో ఆ హృదయానికి స్వచ్ఛత లేదని నిందలు. అద్దం లాంటి మనసు ఎప్పటికీ వాడదని మీ చిత్రమే చెప్తోంది. ప్రేమ పుప్పొడి పొందే అర్హత ఆ హృదయానికి మాత్రమే ఉందని... వికసిస్తున్న మీ కథానాయిక మనసు పదేపదే ఘోషిస్తోంది. స్వయం కృతాలు ఎప్పుడూ విధివిచిత్రాలు. స్వగతాలు కానేకావు. కోయిలలా మీ నాయిక పిలిస్తే... నేల రాలిన ఆకులైనా చిగురించక మానవుగా.....? చివరిగా... మీ కవితకు ముక్తాయింపు... స్వగతం కాదు... మనోగత సుమాల జల్లుల హరివిల్లులు చిందించే మకరంద మనోహర చిద్విలాస... తపన. ఇంత కంటే.. నేను మీ కవితను విశ్లేషించలేకపోతున్నాను.... పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. సతీష్గారు...దండాలండి, చదివి జీర్ణించుకోవడం కష్టమే. :-)

      Delete
    2. మగువ మనసు ఒక అఘాధం....అర్థం చేసుకోకుండా పైనుండి చూసీ చూడనట్లుగా చూస్తేనే గమ్మత్తు, లేదంటే మైండ్ గల్లంతే :-) అయినా యజ్ఞాలు యాగాలు చేస్తే పుణ్యం వస్తుంది కానీ ఇలా అన్వేషణ ఎందుకు చెప్పండి :-) ( సరదాగా అన్నాను సతీష్ గారు. నిజానికి మీ చిత్రవర్ణన అనన్యసామాన్యం) నా రాతలకి చిత్రాలకి మీ వివరణ శోభాలంకారంగా ఉంది. ధన్యవాధాలండి.

      Delete
    3. పండువలిచి చేతిలో పెట్టినా తినలేను, అరగదు అంటే ఎలా :-)ఆకాంక్ష.

      Delete
  17. సతీష్ మీకు ఇన్ని భావాలు ఈ కవితలో అర్థమైనాయా!!!!! మరి నాకందుకు అర్ధంకాలేదు అర్పితగారు :-)

    ReplyDelete
    Replies
    1. అర్థం కాలేదు అని ఆటపట్టిస్తే ఏం కొత్త అర్థాలు చెప్పగలదు అర్పిత :-)

      Delete
  18. అమ్మా పద్మక్కో ఇలా ప్రతీసారీ కమెంట్లకి రిప్లైస్ ఇవ్వకుండా బ్రతిమాలించుకోవడం భావ్యమా అని నొక్కి వక్కాణిస్తున్నా :-) రండి వచ్చి శాంతపరచండి.

    ReplyDelete
    Replies
    1. వర్షాకాలం సమావేశాలు మీకు వంటబట్టినట్లున్నాయి. నాకు అలవాటు కావాలి కదండి ఆకాంక్షగారు :-) క్షమించడం అలవాటు చేసుకోవాలి కానీ అలిగితే ఎలా చెప్పండి.

      Delete