గుండె గదిలో ఏదో ఒక మూల ఎప్పుడూ తచ్చాడుతూనే ఉంటావు.. రేయింబవళ్ళు అలసటలేక అంతటా నీవై ఆరని జ్యోతివలె వెలుగుతుంటావు.... ఆ వెలుగులో ఆనందం కానరాక ఆర్పనూలేక నీ ఆలోచనలు వద్దన్నా గిలిగింతలు పెడితే నన్ను నీలో బంధించిన నిన్ను నింధించక నన్ను నేను తిట్టుకుని మనసు తలుపు తీసి నిన్ను పారద్రోలాలని ప్రయత్నించినా ఫలించక ఏకాంత రాయబారమే జరిపి పంపించనూలేక.. సతమతమై ఎదురుగా లేని నీతో ఎన్నో ముచ్చటించి నా మనసుకు నేనే అలుసైపోతూ నీకు దగ్గరౌతాను!
ప్రతి ప్రయత్నం ఒకదాని వెంట ఒకటి శత్రువై రోజుకి ఒక ఆశని చేజార్చి నిట్టూర్ప జేస్తుంటే ఇంకెన్ని వ్యధలు భరించే సత్తువ ఎదకుందోనని ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా లేచి నిలబడుతూ కొన్ని జ్ఞాపకాల్ని మనోపల్కం పై పేర్చుకుంటాను!! కాలిబాటన ముళ్ళెన్నో పాదాల్ని బీటబార్చినా ప్రతి దారిలో పయనించి పొడిబారే ప్రోత్సాహానికి మరో ఎండమావిని ఎరగా వేసి దప్పిక తీరుస్తూ ఆశ్రువుల అలలే ఎగసి పొంగిపొర్లుతున్న కళ్ళలో కొన్ని అందమైన స్వప్నాల్ని అలంకరించబోతాను!! నమ్మకాన్ని వలచి గెలవాలని కంటి కాగడాతో వెతికి విశ్వాసానికి బదులు ఛాతీ చీల్చిన నిరాశ గాయాలకి ఓదార్పు లేపనం అద్దబోయి మరింత మంటరేపుతూ ఏ ప్రలోభానికీ లొంగని శిరస్సును వ్యధభారంతో వంచి క్రొత్తదారి దొరుకునని కంటి వెలుగునే పెంచుకుంటాను!!