ఏమిటి?

కొందరు గొంతు చించుకు అరిచినా
మరికొందరు మౌనం వహించినా..
ఎవర్లో మార్పొచ్చి ఒరిగింది ఏమిటి?

తమలో తాము ఏడ్చి నవ్వించినా
పైకి నవ్వుతూ లోలోన ఏడ్చినా..
వారు ఉన్నా లేకున్నా తేడా ఏమిటి?

జోలపాడి కలల ఊహలు ఊగించినా
దరిచేర్చుకుని దూరంగా నెట్టేసినా..
నిదుర మేల్కున్నోళ్ళు చేసింది ఏమిటి?

కోరిన కోరికలు తీర్చి దివాళా తీసినా 
వాస్తవాలను కలలుగా చూపించినా..
వచ్చి వాటేసుకున్న ఆస్తులు ఏమిటి?

పగలురేయి వచ్చిపోతూ కాలం గడిచినా
నేడుని రేపటి ఊహలతో బ్రతికించినా.. 
సమయానికి వచ్చిన సమస్య ఏమిటి?

నా ఆలోచన్లు అర్థంలేని ప్రశ్నలే అయినా
వచ్చేదేమిటి ఒరిగేదేమిటని అడిగినా..
జరిగేవన్నీ జరుగక ఆగిపోవునా ఏమిటి?

25 comments:

  1. ఏమిటని వర్ణించేది వర్ణాలకే అందని వర్ణన
    గొంతు చించుకున్న వేళ గాత్రమే ఎండేన
    చివరాఖరికి మిగిలింది వడబోసిన వేదన

    తిమిరమున వెతలకు నయనాలు చెమ్మగిల్లిన వేతన
    పైకి నవ్వుతు లోన కుమిలిపోతు చెప్పుకోలేని యాతన
    చివరాఖరికి కనులు సోలి లోలోపల గుండె ఆక్రందన

    లాలి లాలి యంటు తడుతు ఒడిలో సేదతీర్చేన
    రెప్పల అలికిడులకు కాటుక కన్నులు అలసి సొలిసేన
    నిదురే మరచి తాను నిద్రిస్తే చాలనుకున్న లోనేదో ఆవేదన

    దరికి రారమ్మని కోరిన వేళ చీర సారెలతో చేస్తే నివేదన
    పలకరించి అబ్బుర పరచి కలను నిజమని ఋజువుగ సాంత్వన
    ఆభాసు పాలు కానిక మనసులో ఏదో తెలియని రణగొణ

    పగలు రేయని వ్యత్యాసమే లేకుండ కాలం గడిచిన
    పగటి పూట ఎండ గాయం చేసేనని రేయి జాబిలిపై చులకన
    రేయి పగలు రెండు ఉంటేనే కదా రోజుకి రోజుకి పొంతన

    ఆలోచనల ఝరిలో పదాల డోలన
    పదాల లోగిలిలో భావాల మేళన
    కవితయే ఇది మరి కాదు కారాదు హేళన

    కవిత లో మీరు ఏమిటని ప్రశ్నలకు కవితతోనే వ్యాఖ్య ప్రయత్నం. ప్రతి పంక్తి చివరలో న తో ముగింపు ఇద్దామని చిరు ప్రయత్నం. మీ కవితాపదఝరిలో భావాలన్ని తొణకిసలాడుతు ఉంఠే..అక్షరాలుగా పలకలేక భావాలన్ని కవితగా కనుల ముందు కదలాడేనేమో.. ఇది పొగడ్త కాదు వాస్తవికత. అక్షరాలలోన దాగిన నిరీక్షణ భావం మీరు పెట్టిన ఇమేజ్ కి సరితూగింది పద్మ గారు.

    లెన్త్ ఎక్కువైంది.. ట్రంకేటింగ్ దిస్ హియర్ అబ్రప్ట్-లి

    శ్రీనివాస విజయతే

    ReplyDelete
  2. ప్రశ్నలు జవాబులు మీరే చెప్పితిరి
    చిత్రం చూస్తూ అవాక్కు అయితిని
    మీరు అన్నింటా సిద్దహస్తులని తెలిసె.

    ReplyDelete
  3. అందాల అతివ వేదాంతము పలికినా
    రస హృదయాలకు వినిపించునా

    వేదన వెల్లువై మది చీల్చుకొస్తున్నా,మోములో ఆ ప్రశాంతత ఏమిటి?

    ReplyDelete
  4. ఇన్ని ప్రశ్నలు ఒకేసారి కురిపించారు. మెదడు వాచిపోయింది.

    ReplyDelete
  5. చాలా తెలివి
    ఏమిటీ ఏమిటీ?
    ప్రశ్నించారు ఓకే
    నో ఆన్సర్ మాడంజీ

    ReplyDelete
  6. జీవితం ఏమిటి అని ప్రశ్నించుకుంటే జవాబు ఉండదు.అందరూ అన్ని సవ్యంగా సాగాలని అనుకుంటారు కానీ సాగదు. ఎందుకు ఏమిటని ప్రశ్నించక సాగిపోతే సరి సమయతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి.
    నూతన పంధాలో కవిత వ్రాసి ఆలోచింపజేసారు.

    ReplyDelete
  7. Beautiful Painting
    Thoughtful lines

    ReplyDelete
  8. అన్ని ప్రశ్నలకూ జరిగేది జరుక మానదని చివరి లైన్లో జవాబు ఇచ్చరు బాగుంది.

    ReplyDelete
  9. వాస్తవాలు కలలుగా చూపించడం అనగా ఊహల్లో విహరించడం అంటారా? కాలానికి అతీతం ఏదీ జరుగదు అనుకుంటా మిగిలినవి అంతా మన భ్రాంతి.

    ReplyDelete
  10. పరేషాన్ చేసే ప్రశ్నలు.
    బుల్లెట్స్ లేవు పిస్టోల్ ఖాళీ.

    ReplyDelete
  11. ఎక్కడ, ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎంతగా ఆకర్షించబడునో ఎందుకు చూరం అవునో చెప్పడం కష్టం సుమా....

    ReplyDelete
  12. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎక్కడ? ఎప్పుడు? ఇలా ప్రశ్నలు నీలో ఉద్బవించాయి అంటే జరుగుతున్న విషయాలను అన్నిటినీ గమనిస్తూ విచక్షణతో ఆలోచిస్తున్నావు.
    ఆ ఆలోచన వల్లే ప్రతీది ప్రశ్నించుకుంటూ వాటి సమాధానం కోసం పరిశోధించడం, దాని వల్ల కొత్త విషయాలు తెలుసుకోవడమో చేస్తున్నావు. అందుకే ఇంత అభివృధ్ధి సాధించి అద్భుతంగా వ్రాస్తున్నావు. ప్రశ్నించుకో వాటికి జవాబులు సొంతగా అన్వేషించుకో అర్పితా,ఆశిస్సులు-హరినాధ్.

    ReplyDelete
  13. మంచి ప్రశ్నలు అడిగి ఆలోచింపజేసారు
    పెయింటింగ్ పిక్ నాచురల్

    ReplyDelete
  14. తమలో తాము ఏడ్చి నవ్వించినా
    పైకి నవ్వుతూ లోలోన ఏడ్చినా..enta correct

    ReplyDelete
  15. వాస్తవాలను కలలుగా చూపించడం సాధ్యమా?

    ReplyDelete
  16. ' ఏమిటి? ఏమిటి? ఏమిటి? '
    సామాజిక స్పృహలు లేక సామాన్యులుగా
    పోమారే బ్రతుకు బతుకు
    సోమరులను ప్రశ్న లడుగుచో ఫలమేమీ ?

    ReplyDelete
  17. ఇలాంటివి ఎన్ని వ్రాసి చదివి ప్రయోజనం ఏమిటి?

    ReplyDelete
  18. గొంతు చించుకు అరిచినా మౌనం వహించినా ఒరిగేది ఏమీలేదు....కొందరి జీవితాలు అంతే.

    ReplyDelete
  19. జరిగేవన్నీ జరుగక ఆగిపోవునా ఏమిటి?
    ???????????????????????????

    ReplyDelete
  20. బాగున్నాయి భావాలోచన తరంగాలు.
    Nice picture

    ReplyDelete
  21. నా ఆలోచన్లు అర్థంలేని ప్రశ్నలే...silly

    ReplyDelete
  22. అందరి స్పందనలకు నా కృతజ్ఞతలు.

    ReplyDelete
  23. కాలం
    వయసు
    జీవితం
    ఏదీ ఆగదు..

    ReplyDelete
  24. మీరు ఖడ్గం కలం కమలం కుంచె వీణ ధనం చేతిలో పట్టుకుని కూర్చున్న సరస్వతీదేవి అండీ

    ReplyDelete