సాగరతరగల పరువం గలగల పొంగి పొర్లిపోతుంటే
చూసి ఈలలు వేయాలన్న కోరిక సహజమే కదా
బిడియంగా బెంబేలు చూపులతో నది నడుస్తుంటే
జలధిని కవ్వించుకోవాలి అనుకోడం తప్పుకాదుగా
సరుగుడు తోపులల్లో హోరుగాలి జగడమాడుతుంటే
తారలు నర్తించే మందాకినిలా కనబడుతుంది కదా
తెల్లని హిమపాతము గిరులపై పైటై పెనవేసుకుంటే
వర్ణకాంతులు వలపురంగరించి వెదజల్లక తప్పదుగా
ఆమని అల్లరి అడుగుల అలికిడికి తోట నర్తిస్తుంటే
పూలగంధ పరిమళ హాసము ఎంత రమ్యమో కదా
నింగిలోని జాబిల్లిరేడు విల్లులా ఒళ్ళు విరుచుకుంటే
పద్మ భానుడికై ఎదురుచూస్తూ అలసి నిదురించెగా!










