
ఒక ద్వీపంలో ప్రేమ, సంతోషం, విషాదం, ఐశ్వర్యం, జ్ఞానం,అందం, సమయం, మిగిలిన వాటితో కలసి జీవిస్తుండేవి. ఓ రోజు ఆ ద్వీపం మునిగి పోబోతుందని తెలిసి అన్నీ ఎవరి దారిన అవి వేరొక చోటికి పయనమైనాయి.
ప్రేమ తనకి ఎవరైనా సహాయము చెస్తారేమో అని ఆశగా కనబడిన వారిని అడుగుతూ, ఆ దారిన ఎంతో హంగు ఆర్భాటాలతో వెళుతున్న ఐశ్వర్యాన్ని అర్ధించింది. ఐశ్వర్యం ఎంతో దర్పంతో నా నావంతా బంగారం, ధనంతో నిండి వుంది నీకు చోటు లేదని చెప్పి వెళ్ళిపోయింది.
అటువైపుగా అందం వేరొక నావలో వెళుతూ నీవు నా పడవలో ఎక్కి ,దాన్ని తడిపేసి అంతా పాడుచేస్తావు అని ప్రేమ అడిగినదానికి ఒయ్యారాలు పోతూ సమాధానం చెప్పి చల్లగా జారుకుంది.
ప్రేమ విషాదాన్ని నీతోపాటు నన్ను తీసుకుని వెళ్ళవా అని అడిగితే..."ఓ ప్రేమా నేనే బాధలో వున్నాను నిన్ను ఏమి భరించను, నన్ను ఒంటరిగా వదిలివేయవా" అని చెప్పి వేడుకుంది.
సంతోషం ఆనందంగా కేరింతలు కొడుతూ, ప్రేమ తనని పిలిస్తున్న విషయాన్ని కూడా వినిపించుకోలేదు.
ప్రేమ నిరాశతో ఏమి చేయాలో తోచక ఆలోచిస్తుంటే , ఒక గంభీరమైన గొంతు వినిపించింది.."ప్రేమా నాతో రా, నిన్ను నేను తీసుకుని వెళతాను....." అన్న మాటలకి ప్రేమ ఆనందం తో ఆ పెద్దరికాన్ని పేరు కూడా అడగకుండా వెళ్ళి నావలో కూర్చుండిపోయింది. ప్రేమని సురక్షిత ప్రాంతానికి చేర్చి ఆ పెద్దరికం తన దారిన తను వెళ్ళిపోయింది.
ప్రేమ తనకి సహాయపడింది ఎవరని జ్ఞానాన్ని అడిగితే...."నిన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకుని వచ్చి చేర్చింది సమయం" అన్న సమాధానాన్ని విని, సమయమా నాకు ఎందుకు సహాయపడింది!!! అని ఆశ్చర్యపోయింది ప్రేమ. జ్ఞానం నవ్వి " పిచ్చిదానా ఎందుకంటే సమయం మాత్రమే ప్రేమ ఎంత అవసరమో అర్థం చేసుకుంటుంది కనుక" అని చెప్పింది.