గెలుపు నాదే!

జీవితంలో ముందుకి సాగాలన్న యత్నం
ప్రతిసారీ వెనుకబడిపోయె నా ప్రయత్నం
ఒక్క అడుగు వేయబోయింది నా పాదం
నాలుగడుగులు ముందుకి సాగె జీవనం!

జీవితందే ప్రతిసారీ అవుతుంది విజయం
నాకు దక్కింది ఎల్లప్పుడూ పరాజయం
ఓడిపోయిన నేను చేసాను దరహాసం
అదిచూసి జీవితానికి కలిగెను ఆశ్చర్యం!

జీవితంతో కొన్నేళ్ళిలా సాగింది నా పయనం
ఒకనాడు నన్ను ఇలా అడిగింది జీవితం
ఓటములను చూసిన నీకు రాదేల ధుఃఖం
మది నిట్టూర్పు విడిచింది ఆ క్షణం!

జీవితానికి ఇచ్చాను నేను సమాధానం
ఓరోజు తనకన్నా ముందన్నాను నా గమనం
మృత్యువు వెంట నేనెదిగిపోతాను ఆ దినం
నాకోసం జీవితమా....నీవు చేస్తావు నిరీక్షణం!

జీవితాన్ని చూసి నేను చేస్తాను విజయహాసం
గడచిన కాలాన్ని తలచి సాగిస్తాను ప్రయాణం
మరణించి సాధించాను జీవితంపై విజయం
గెలుపు ఓటముల్లో నవ్వలేకపోయింది జీవితం!

సప్తహృదయ రాగాలు...

ఈ హృదయ రాగాలు, నావి కావు వేరొకరి భావాలు...
కలల బాటసారి కవితాపధం నుండి జాలువారిన పలుకులు...
నా హృదయపధంలో చెరగని ముద్రవేసిన సరాగాలు ...
మీ సహృదయాలను మెప్పిస్తాయేమో చూడాలి ఈ కవితలు!

గతకాలపు జ్ఞాపకాలు
విత్తులే కదా అని ఓ మూలకి విసిరేసా
ఊడలతో సహా పెరిగి
మనసంతా అల్లుకుపోయాయి!

నేనీ జీవితంలో ఒంటరిని
నేను నీ సమక్షంలో సమస్తాన్ని
నేనీ పయనంలో అలసిన ప్రాణాన్ని
నేను నీ తోడులో అలుపెరుగని పయనాన్ని!

మౌనం నీదైనప్పుడు,
నిశబ్దాన్ని మించిన శబ్దం లేదు.
పయనం నాదైనప్పుడు,
నిలకడని మించిన పరుగూ లేదు!

జరిగేదేది జరగక మానదు
జరిగిన దానితో జీవితం ఆగదు
సమాధాన పడకపోతే దారినిండా ముళ్ళే
చిన్ని సూత్రం తెలిస్తే సెలయేటి ఉరవళ్ళే!

నిన్న నీకు ఆద్యంతాన్ని
నేడు ఒట్టి ఏకాంతాన్ని
నిన్నటి పరిచయానికి అపరిచితుడ్ని
నేటి ఏకాంతానికి చిరకాల మిత్రుడ్ని!

రోజూ చూపులు కలిసినా..
గాలితో ఊసులు పంపినా..
చినుకులతో తనువంతా ముద్దాడినా..
కలిసేదుందా నింగీ నేలా యేనాటికైనా??

పువ్వు నవ్వెందుకు చెరపడమని కొమ్మనుండీ తుంచలేదు
చూసీ ఎందుకు తెంచి ముద్దాడలేదని రాలాక తగువాడింది.
చెలికి చింతెలనని నే చితినెంచుకుంటే.........
మరో గూటికి చేరి, తన గొంతుకోసానని తెగడుతోంది!

పెళ్ళి/చావు

పల్లకీలో కూర్చున్నావు నీవు
పాడెపై పడుకోపెట్టారు నన్ను
పూలతో నిన్ను అలంకరించారు
పూలని నాపై పరిచారు.....

అలంకరించుకున్నానీవు
అలంకరించారు నన్ను
నలుగురిలో కూర్చోబెట్టారు
నలుగురు మోసుకెళ్ళారు....

గమ్యంవైపు పయనం నీవు
తుది మజిలీకి చేర్చారు నన్ను
ఆనందంతో కేరింతలు అందరు
రోదనలతో ఇక్కడ కొందరు....

పురోహితుని మంత్రాలు వింటూ నీవు
కాటికాపరి కాలుస్తున్నాడు నన్ను
నిన్ను అక్షింతలతో ఆశీర్వదించారు
నన్ను ఆశ్రువులతో సాగనంపారు....

బంధాలకు బానిసవు నీవు
బంధవిముక్తున్ని చేసారు నన్ను
జీవితం వైపుకి నీది పయనం
నాతోనే అంతం జీవితం....

నేడు/రేపు

దినచర్య నుండి నిన్నటిని తొలగించాను
నిన్న నేర్చుకున్న ఙ్జానంతో నేటిని ఆహ్వానించాను
నేడు రేపు రాదని, ఈనాడే నాదని నాకు తెలుసును!

దినచర్యను నేను చిరునవ్వుతో ప్రారంభిస్తాను
నిన్న లభించని అవకాశాన్ని నేడు నేను వదులుకోను
నేడు దక్కిన సమయాన్ని మైలురాయిగా మలచుకుంటాను!

దినమంతా ఆశావాదిగానే పని కొనసాగిస్తాను
నిన్నలా కాకుండా నేడు విజయానికై ప్రయత్నిస్తాను
నేడు చేజారిన కార్యాన్ని రేపు ఎలాగైనా సాధిస్తాను!!!

నన్ను నేను!!

నన్ను వదిలి వెళుతూ అన్నావు నవ్వమని
నవ్వేసాను నేను నీ ఆనందం కోసమని!

నీకు ఎరుక నాకు దక్కనిది నాది కాదని
నీవు వదిలిన నేను నీకు మాత్రమే సొంతమని!

నాకు తెలుసు నీకు నాపై ఎంతో నమ్మకముందని
నీకు తెలియని నిజం నా అదృష్టం నన్ను కాదన్నదని!

నాది అనుకున్న చావుని కోరాను తనతో తీసుకెళ్ళమని
నాతో రాకంది చావు...ఛీ! ఛీ! నీవు నాకు వలదని!

నన్ను నేనే ప్రశ్నించు కున్నాను ఈ జీవితం నాకు ఎందుకని?
జీవితమంది... మలచి చూడు అవుతుందది ఆదర్శదాయకమని!

నవ్వుతున్నా!

ప్రేమలో తేలియాడాలన్న కోరిక
తీరింది చివరికి ఇలాగిక.....

హృదయం హృదయాన్ని చేరాలని
మనసులోని భావాలని చెప్పాలని

వ్యక్తపరచడానికి మాటలెన్ని ఉన్నా
మూగమనసు తెలుపలేకున్నన్నా

నరుడి కంటికి నల్లరాయి పగిలి
ప్రేమకి నలుగురి దృష్టి తగిలి....

కన్నీటితో తీర్చుకుంది అది ఋణం
శిక్షగా పెదవులపై విరిసింది నవ్వీక్షణం!

రంగుల గులాబీలు!

ఎరుపురంగు గులాబీ ప్రేమకు చిహ్నం....
ముదురుఎరుపురంగు హృదయాన్నదాగిన అనురాగానికి ప్రతీకం!

తెలుపురంగు గులాబీల ప్రేమ కలిగించు ఆనందం....
పాలమీగడ తెలుపురంగు స్వచ్ఛమైన మనసుకు తాత్కారణం!

లేతగులాబీరంగు సున్నితమైన హృదయం....
ముదురుగులాబీ రంగు వెళ్ళబుస్తుంది కృతజ్ఞతా భావం!

పసుపురంగు గులాబీ స్నేహం ప్రేమగా మారుతున్న తరుణం....
పసుపుఎరుపు కలసిన గులాబీల గుత్తులు పలకరింపుల కవచం!

ఏ గులాబీ అయినా తెలుపుతుంది మనలోని భావం....
అది అర్థం చేసుకోవడంలోనే ఉంది మన సహృదయం!

బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
అందమైన ఆట బొమ్మలు
కోమలమైన కొయ్య బొమ్మలు
మర్మమెరుగని మట్టి బొమ్మలు
ఆడుకోవడానికి అనువైన బొమ్మలు
మనిషి చేసిన ఈ ఆట బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
జీవితపు రంగులద్దిన బొమ్మలు
మమతలమన్నుతో అతికిన బొమ్మలు
కారుణ్యమేకాని కఠినత్వమెరుగని బొమ్మలు
మంచికి మారుపేరుగా నిలచిన బొమ్మలు
ఇవి అలనాడు దేవుడు చేసిన బొమ్మలు!

బొమ్మలండీ...బొమ్మలు
ప్రేమ ఫైబర్ గా మారిన సైబర్ బొమ్మలు
అనుబంధాలకి అతీతమైనవి ఈ బొమ్మలు
గిరిగీసుకుని బ్రతుకుతున్న గిల్టు బొమ్మలు
స్వార్థమనే మూసలో తయారైన బొమ్మలు
క్రొత్తరంగులద్దుకున్న ఆధునికపు మరబొమ్మలు!

ఎలాచెప్పను?

ప్రేమించిన నాచిట్టి మనసుని గాయపరచావు
వేటగాడివి నీవని నామనసుకి ఎలాతెలుపను?

నీ నిరీక్షణలో జీవితాంతం నేను వేచివుండగలను
నా హృదయాన్ని వేచి ఉండమని ఎలాచెప్పను?

దూరమై నాకు నీవు ధుఃఖాన్ని మిగిల్చావు
ఆ భాధని నీకివ్వమని భగవంతుని ఎలాకోరను?

నీ రూపమే కనపడుతుంది చందమామలోను చంద్రుని మబ్బులో దాగమని ఎలాచెప్పను?

కనుమరుగై నీవు నన్ను కలవర పరిచావు
నీ కంట కునుకు రానీయకని ఎవరికితెలుపను?

నీ ప్రేమే దక్కని నేను జీవించలేను
నిన్ను మరణించమని ఏలాచెప్పను?