"వెజిటేబుల్ సలాడ్"

"అలోచనలతో బుర్రలో తిరుగుతున్నాయి సుడులు
ఏమి వండి వడ్డించాలని గుండె నిండా గుబులు
అంతగా వంటరాని నాపై నాకే చెప్పలేని దిగులు
ఎన్నో రుచులవంటలకై జిహ్వ ఎదురుచూపులు
వనభోజనాల నాడు మెప్పుకై చేయాలి జిమిక్కులు
లేకపోతే తప్పవు పాకప్రావీణ్యులతో మొట్టికాయలు"

ఏంటి పద్మా! నీకు చెప్పిందేమిటి నువ్వు చేస్తుందేమిటి? వంటావార్పుతో వనభోజనాలకి రమ్మంటే పదాలకూర్పుతో తవికలల్లి దిగులని గుబులని నేర్పుగా తప్పించుకోకు అంటారని నాకు తెలుసు అందుకే.......తెల్లవారుజామునే అయిదు గంటలకే తలంటుకుని చెంగావిరంగుపై ఎరుపు, ఆకుపచ్చ రంగంచున్న చీరకట్టి ( ఎందుకు డ్రెస్స్ కోడ్? అని అడక్కండి మీకే తెలుస్తుంది మున్ముందు ).......
భగవంతునికి దీపం, ధూపం వందనమాచరించి....అవిఘ్నమస్తు! అందరి మెప్పులు ప్రాప్తిరస్తు! అని నాకు నేనే ఆశీర్వదించుకుని వంటగదిలో వంద ప్రదక్షణాలు చేసినా ఒక్కవంటైనా నన్ను కనికరిస్తే కదా వండి వడ్డించడానికి......
ఏదో నాలుగు ప్రాస పదాలతో కవిత వ్రాసుకోక జ్యోతిగారి బ్లాగ్ లోకి వెళ్ళి మరీ ఈసారి చేసేస్తా పెట్టేస్తానని ప్రగల్భాల వ్యాఖ్యలు పెట్టనేల అని నన్ను నేను పరిపరి విధముల తిట్టుకొనుచుండగా......

పూర్వము నా బ్లాగ్ లో ఒకానొక పోస్ట్ "కాయగూరలతో కబుర్లు!!!" చెప్పితినని అవి నన్ను కనికరించి "కూరగాయోపదేశము" చేసి నా చేతికి కత్తిరించమని కత్తినిచ్చినవి.....
ఉపదేశమెట్టిదనగా.....
పిచ్చి పద్దూ.... "ఈ యాంత్రిక జీవనశైలిలో వంటావార్పెందులకు? కడుపుమంటా, షుగర్, బీపీలను పెంచేందులకు!
అంటూ మంతెన సత్యనారాయణగారి లాంటి నలుగురి ప్రముఖుల పేర్లను రెఫరెన్స్ గా చెబుతూ....
పద్దు! నీవు వంట జోలికి వెళ్ళవద్దు....
పచ్చి కూరగాయలతో నీవు చేసేయి "వెజిటెబుల్ సలాడ్"
అది అతిగా భుజించకుండా ఏర్పరుస్తుంది ఒక సరిహద్దు....
ఆ హద్దుతో ఆఖరున భుక్తాయసమంటూ ఎవరూ బాధపడరు....
అదే మనందరికీ ఎంతో ముద్దు"
అని అంటూ....

నీ హస్త కళానైపుణ్యముతో నన్ను అందంగా మలచు అంటే నన్ను అంటూ కారెట్, కీరదోసకాయ, బీట్ రూట్, కాప్సికం, ఉల్లిపొరక, టమాటాలు నేనంటే నేనంటూ నా ముందుకు నర్తించాయి....

పరువుని కాపాడిన కూరగాయలపై ప్రేమతో అలా ఆ చీర మాచింగ్ అన్నమాట...:)




మరింక ఆలస్యమెందుకు?
ఆరగించండి అందరూ.....
నేనందిస్తున్న "వెజిటేబుల్ సలాడ్"

ఏదో ఒట్టి చేతులతో కాకుండా నేను సైతం ఒక వంట(అమ్మో!వంట అంటే తంతారేమో!!:) తెచ్చాను అనుకుని
మీరంతా "సలాడ్స్" ని ఆరగిస్తే......
ఉపదేశించినందుకు కూరగాయలు,
మీ అందరితో వనభోజనం చేసినందుకు నేను ఎంతో ఆనందిస్తానండి!
(Serving With Love)

ఇట్లు,
ప్రేమతో
పద్మార్పిత!!!

వేళ కాని వేళ!


ఏ రాగం ఆలపించను, అనురాగం శృతి తప్పినవేళ!
ఎలుగెత్తి నేనేమి తెలుపను, నీవు మౌనం దాల్చినవేళ!

హృదయం అలిసేలా రోధించాను, లోకం నిదురించిన వేళ!
చందమామనే చూడనెంచాను, కారుమబ్బులు కమ్మినవేళ!

బీడుబారిన నేలలో మొక్కను నాటాను, మండు వేసవి వేళ!
బాధను దిగమ్రింగి నవ్వాను, నీవు వేరొకరి సొంతమైన వేళ!

కన్నీటితో దాహంతీర్చ తలచావెందుకు? కనులు మూతపడిన వేళ!
ఏడిపించిన నీవే కుమిలిపోతావు ఎందుకు? నేను కాటికి సాగిన వేళ!

పూలలో మనమిద్దరం....

నా నవ్వు నిన్ను చేస్తుందంటే పరవశం
స్వఛ్ఛమైన మల్లెల నవ్వులే నీసొంతం

పిలచి చూడు నా పేరులోని ఒక్క పదం
పద్మాల కొలనునై సేద తీరుస్తాను నిత్యం

ఎడారిలోని మండుటెండలో నీతో పయనం
నాకది గులాబీల తివాచిలాంటి మెత్తదనం

నీ హృదయంపై నా తలవాల్చి నిదురించడం
చామంతిపూల పరుపుపై పవళించిన చల్లదనం

నీవు నా చెంతన ఉన్నప్పుడు ప్రతినిముషం
నాశ్వాస అవుతుంది మొగలిపూల సుగంధం

మదివిప్పి మాట్లాడకుండా నీవుంటే మౌనం
నా మనసే అవుతుంది గంపెడుబంతుల భారం

ఒకరి మెడలో ఒకరం వేసుకుంటే పూలహారం
కనకాంబరాల గుత్తై చేస్తుంది నామది నాట్యం

జీవితం ఏమిటి?


విధివ్రాతను ఎవరూ మార్చలేరు

కాగలకార్యాన్ని ఎవరూ ఆపలేరు

మార్చగలిగితే! ఆనందం ప్రతిఒక్కరిదంట
ఆపగలిగితే! భాధలకి చిరునామాయేలేదంట

తలచినది జరగని నాడు చింత పడవలదు
పలుమార్లు ప్రయత్నించడంలో జాప్యంవలదు

నిరాశ పడకు నీవు, ఏదీ నీకు సాధ్యం కాదని
తెలుపు సాధనతో అసాధ్యం కూడా సాధ్యమని!

ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే జీవితం...
భాధలున్నా దిగమింగి నవ్వడమే జీవితం...
గెలుపొంది ఆనందించడమే కాదు జీవితం...
ఓటమిని చిరునవ్వుతో స్వీకరించడం జీవితం!

వెలిగిస్తున్నా!!!



నరకచతుర్థినాడు నరికేసాను...
నాలోని అహాన్ని
అది కలిగిస్తున్న అంతరాయాన్ని!

అమావాస్యనాడు తొలగిస్తున్నాను...
నాలోని అంధకారాన్ని
మార్చాను వెలుగువైపుకి నా గమ్యాన్ని!

దీపావళి జ్యోతులతో వెలిగిస్తాను...
రెక్కలులేని ఊహల భూచక్రాలని
మమతల్ని విరజిమ్మే మతాబులని
హద్దులు దాటని ఆశల చిచ్చుబుడ్లని
అలుకలా మాయమైపోయే సిసింద్రీలని
ఆకాశానికి ఎగిరే ఆశయాల తారాజువ్వలని!
బాగ్మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు!!

నాకివ్వు...


నాకు నీపై చెప్పలేని అనురాగం...
తప్పలేదైనా మనమధ్య దూరం...
దొంగిలించావు నాశ్వాసలోని సగం...
అంటున్నావు చేయలేదని ఏనేరం...

ఈ దూరాన్ని ఎడబాటు అనుకోకు...
నా మౌనాన్ని అలుక అని అనుకోకు...
నిన్నేతలచే నన్ను అలుసుగా చూడకు...
విధివ్రాతకు మన బ్రతుకును బలికానీకు...

ఆనందాన్ని అందరికీ పంచి నీ నవ్వుని నాకివ్వు...
సమయాన్ని అందరికిచ్చి నీ జీవితాన్ని నాకివ్వు...
ఆప్యాయాన్ని పదిమందికిచ్చి నీ హృదయాన్ని నాకివ్వు...
ఎందరు నిన్ను ప్రేమించినా నీ ప్రేమను మాత్రం నాకివ్వు...

నా ప్రశ్నలకు నేనే జవాబు!

ఇవి ప్రశ్నలు కావు నాలోని భావాలు...
ఎగసిపడుతున్న ఆలోచనా తరంగాలు...

పనికిరాని పండిన రావి ఆకై రాలనేల?
ఎండికూడా గోరింటాకై పండరాదటే బాల!
హస్తరేఖలు చూసి జీవితాన్ని వ్రాయనేల?
అవిటివారికి కూడా జీవితమున్నదే బాల!
పరుల సొమ్ములకై ప్రాకులాట మనకేల?
ప్రాప్తం ఉంటే పొమ్మన్నా పోదుకదే బాల!
ఎదుటివారిలోని తప్పులు మనమెంచనేల?
అద్దంకాదు మనమోము కడుక్కొనవలెనే బాల!
మెప్పుకై ప్రాకులాడి ముప్పులు తెచ్చుకోనేల?
మనస్సు లగ్నం చేస్తే మెప్పులు మనసొంతమే బాల!
పదాలను కూర్చి పేర్చి ఇలా వ్రాతలు రాయనేల?
కొందరైనా చదివి ఆచరిస్తేనే ఈ వ్రాతలకు సార్థకతే బాల!

సరైనదా!!!

ముళ్ళేలేని గులాబికి రక్షణేది
చీకటే లేనప్పుడు వెలుగుకి పనేది
ప్రేమ ఉన్న చోట ధ్వేషానికి చోటేది
ఆశేలేనినాడు ఆవేదనకు తావెక్కడిది!!!

మధువులేని పువ్వుకడ తేనెటీగ చేరదు
వేర్లను నరికిన చెట్టు మరల చిగురించదు
పరుషపలుకులకి విరిగిన మనసు అతుకదు
సోమరిపోతుని విజయం ఎన్నడూ వరించదు!!!

పసిడిమొగ్గను విరబూయమనడం పాపంకాదా
ధనవంతుడు కాసులతో ప్రేమని కొనలేడుకదా
మనసులేని సౌందర్యం కురూపితో సమానంకాదా
చెడు అని తెలిసి చేస్తే అది క్షమించరాని నేరంకదా!!!

నీవు నావాడివి....

ఎదలోయలో దాగిన
మధుర ఊహల పరిచయానివి....

పెదవులపై విరిసిన
చిరునవ్వుల దొంతరవి....

విరబూసిన వెన్నెలలో
తెరతీసిన చల్లదనానివి....

అణువణువున దాగిన
అంతులేని అనురాగానివి....

ఆలోచనల్లో దొరలిన
ఆనందకేళీ విలాసానివి....

నిదురరాని కనులలో
పవళించిన స్వప్నానివి....

ఎందెందు దాగిన
ప్రియతమా! నీవు నావాడివి....