ఏమి వ్రాయాలా అని ఆలోచిస్తున్న నాతో...
వంకాయ...వద్దు వద్దంటూనే వండిన విధంగా వండకుండా వివిధ విధాల్లో వండుకుని తింటారంటూ వయ్యారాలుపోయింది.
బెండకాయ...జిగురని, ముదురని, పుచ్చని అంటారేకాని అందరికీ నా తెలివితేటలు ఎంతైనా అవసరమంది.
చిక్కుడుకాయ...చిన్నగా, సన్నగా, గింజవున్నా, లేకపోయినా చీల్చి చెండాడి నారతీసి మరీ వండుకుంటారని చిన్నబోయింది.
గుమ్మడికాయ...ఆకారంలో పెద్దనైన నాకు కూరల్లో మొదటి స్థానం ఇవ్వకపోయినా గృహంలో అడుగిడాలంటే నేను లేనిదే జంకుతారెందుకంటూ గుసగుసలాడింది.
మునక్కాయ...ముక్క ముక్కలై నేను మునగనిదే సాంబారుకి రుచెక్కడిదంటూ ముద్దు ముద్దుగా మూలిగింది.
సొరకాయ...సొంత సోది నాకు లేదుకాని పప్పుకి, దప్పళానికి నేను చేదోడు వాదోడునంది.
దొండకాయ...పండుగా నేను పనికిరానని, చిన్నదాన్నైనా ఉడకడానికి కాస్త బెట్టు చేస్తానంటారే కాని నన్ను ఇష్టపడేవారున్నారంది.
కాకరకాయ... చేదు చేదంటూనే దాన్ని విరచడానికి విశ్వప్రయత్నంచేసి ఆరోగ్యానికి మంచిదని కిమ్మనకుండా కమ్మగా తింటారంది.
అరటికాయ...అల్లం, ఆవపోపుతో నన్ను అలంకరించి మరీ ఆరగిస్తారు అది చాలు నాకంది.
మిరపకాయ...నేను లేనిదే మిగతా కూరగాయలకి ఉనికెక్కడిదంటూ, మీసాలు మెలివేస్తూ మిడిసిపడింది.
పొట్లకాయ...పొడుగైనదాన్నని పొగరునాకేల, పనిజరగాలి కాని పొగడ్తలతో నాకు పనియేలనంది.
టమాట...కూరగాయల సామ్రాజ్యానికే మహారాణిని, నాకు వేరొకరితో పోలికేలనంది.
దుంపకూరగాయలు...దురదని, వాతమని మా జాతిని ఎవ్వరూ వదలకుండా పిండి పిప్పిచేసినా మాకు ఆనందమేనంటూ ఆలు(బంగాళా దుంప) అలవోకగా నవ్వింది.
ఆకుకూరలు...అతితక్కువ ధరలో అందరికీ అత్యవసరమైన ఆహారం మేమేనని అదే మాకు ఆదర్శమంది.
క్యాబేజి, క్యారెట్, కాలీఫ్లవర్...దొరలనుండి దొరలి వచ్చినా మాకు భాష రాకపోయినా కాకాలు పట్టవలసిన అవసరం లేదు, ప్రస్తుతం మాదే పైచేయంది.
పద్మా!! మా పలుకులెప్పుడు ఆలకిస్తావంటూ ఫలాలన్నీ పరుగున వస్తున్నాయండి!!!
అమ్మో!!...ఇదేదో పోటీల వ్యవహారంలా తయారయ్యేటట్లు ఉందండి!!!
ఇంతటితో ముగిస్తాను.....చిత్తగించండి!!!