పువ్వుని పలుకరిస్తే!! వాటికే చూపొస్తే!!
చామంతికి చేరువైతే చైతన్యాన్ని ఇస్తానంటుంది.
కలువని కలవరపెడితే కంటిపై కునుకు కరువౌతుంది.
గడ్డిపువ్వు గ్రహణం పట్టిన వేళ గరగనై గతించిపోతానంది.
బంతితో బంధాన్ని పెంచుకుంటే భారమై నిన్ను బాధిస్తుంది.
గన్నేరు గళమందు చేరితే తనువంతా గజగజ లాడుతుంది.
తంగేడుకి తళుకులు తక్కువని తనలో తానే మదనపడుతుంది.
గులాబిని గుబులుపుట్టిస్తే గునపమై గుండెలో గుచ్చుకుంటుంది.
మొగలిపువ్వా మోహించమంటే మాలగా నేను పనికి రానంది.
సంపంగితో సరసాలాడితే వాసనేగాని సావాసానికి తగనంటుంది.
నందివర్థనాన్ని నేచేరుకుందామంటే నటరాజుకే తానంకితమంది.
కనకాంబరాలపై కరుణ చూపితే కటాక్షించి కనువిందు చేస్తానంది.
మందారాన్ని మరులుగొలిపితే మమతలమాలై నన్నల్లుకుంటానంది.
పారిజాతాన్ని పరిణయమాడదామంటే పవళింపు వేళ నేపనికిరానంది.
మల్లె సువాసనల మత్తులో మంచిని మరువకని మెల్లగా మందలించింది.
ఉమ్మెత్తా నీవు ఊసులాడవేమంటే ఊహలలోకూడా నా ఊసెక్కడుందంది.
కుంకుమపువ్వా నీకు కులుకులేలనంటే, కాసులతోనే తన కాపురమంది.
పొద్దుతిరుగుడుతో పొందుకోరితే సూర్యుడు పొంచి చూస్తున్నాడంటుంది.
మరువం మమకారమే లేదు మీకు నాపై నేను పువ్వునేకాదు పొమ్మంది.
బాగుంది ..పువ్వు ల యొక్క లక్షణాలను ఒక్కోక్కటిగా బాగా చెప్పారు ..
ReplyDeleteమీ కవిత పువ్వుల పాదాలతో కదిలివచ్చి, చిగురుటాకుల చినుకుల్లా నన్ను తాకింది. "సంపంగితో సరసాలాడితే వాసనేగాని సావాసానికి తగనంటుంది" ఎంత బాగుందండి ఈ లైను
ReplyDelete"పూల బాసలు తెలుసు యెంకికీ..తోట పూల మనసులు తెలుసు యెంకికి.."
ReplyDeleteఅని నండూరి వారి యెంకి పాట గుర్తు వచ్చింది మీ కవిత చుస్తే!! చేమంతికి చేరువౌతే చైతన్యం "ఇస్తానంటుంది" అంటే మిగిలిన వాక్యాలన్నింటితో కలిసిపోతుందేమొ చూడండి..
బాగుందండి..
ReplyDeleteనేస్తం, రఘు, మురళి గార్లకి ధన్యవాదాలండి.
ReplyDeleteతృష్ణగారు మీరన్నది నిజం మార్చాను, బాగుంది చూసారా? ధన్యవాదాలండి.
Nice
ReplyDelete>>సంపంగితో సరసాలాడితే వాసనేగాని సావాసానికి తగనంటుంది.
ReplyDeleteచాలా బాగుంది.
పద్మగారు! ఆ పూలు మీ బ్లాగ్ ని చూస్తే పూలగుచ్చెలతో మిమ్ము ప్రశంసించేవేమో! చాలా బాగున్నాయి పూల పలుకులు....
ReplyDeleteపూవులు భాదించినా అందంగానే ఉంటుంది..మరి..అన్నట్టు.. "మరువం" మాత్రం..ఆకుపచ్చ రంగులో పెట్టారేంటి చెప్మా... :) మరో మాట.. మీ కొత్త ప్రొఫైల్ ఫోటో బాగుంది..
ReplyDeleteఅమ్మాయిగారికి, శేఖర్ గారికి, సృజనగారికి, శివచెరువుగారికి ధన్యవాదాలు.
ReplyDeleteశివచెరువుగారు మీకు నా ప్రొఫైల్ ఫోటో నచ్చినందుకు థాంక్సండి! మరువం పువ్వుని కాను ఆకుని అందని అలా రంగు మార్చాను అంతే!
పువ్వు కాకున్నా వాడినా వాసన వీడనిది ఆ మరువమే నేస్తం! మమకారం చూపితే మరులు గొలుపుతుంది, లేకపోయినా మన పైన కనికారం చూపి పరిమళం కానుకగా ఇస్తుంది. మీరు విన్న ఈ పూల భాష బాగుంది.
ReplyDeleteఉషగారు.... మరువపై మీ మమకారం నాకు తెలుసులెండి, గుబాళించడానికి పువ్వే కానవసరం లేదని చెప్పేది మరువమే కదండి! మీ స్పందనకి ధన్యవాదాలు.
ReplyDeleteపద్మాన్ని పలకరిద్దామంటే అంది అర్పితమయ్యాను పద్మకు
ReplyDeleteపలుకుల ప్రవాహంతో అయ్యాను పద్మార్పితను.
భావాల పరంపరకు ప్రతిరూపం ఇస్తుంటాను కవితల రూపంలో
మీ అందరి స్పందనలకై ఎదురుచూస్తుంటాను అంది పద్మం.
సిరాకిపుత్రగారికి.....పద్మం పలికిన పదాలని పరిహసించక ప్రేరేపించి ప్రశంసించే మీ(ప్రతి) పెద్దమనసుకీ చేస్తున్నా ప్రణామం!!!
ReplyDeleteBavundi..
ReplyDeleteతంగేడుకి తళుకులు తక్కువని తనలో తానే మదనపడుతుంది బావుంది.
ReplyDeleteతపనపడుతుంది అంటే ..ఎలా వుంటదొ..క్షమించండి..మిమ్మల్ని తప్పుపట్టడం కాదు నా వుద్దెస్యం..
చంద్రశేఖర్ గారు.. మీరన్నది బాగుంది, ప్రాసకూడాకుదిరింది నాకు అప్పుడు తట్టలేదు. మీరు నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదాలండి! సదా మీ స్పందనలని ఆశిస్తూ...
ReplyDeleteభలేగా వ్రాశారు.
ReplyDelete