ఏం తెలుసు!

సర్వసంగపరిత్యాగైన సన్యాసికేం తెలుసు
సరసం తెలిసిన జవ్వని సొగసు ఎక్కడుందో

రాతిగుండె వంటి రాక్షసుడికేం తెలుసు
రసికత ఎరిగిన రాగిణి ఆలాపించే రాగమేదో

వరాలు ఇచ్చి వచ్చిన విటుడికేం తెలుసు
వన్నెలాడి వయసు చేసే వింతవిన్యాసమేదో

మొద్దులా మారిన మొరటోడికేం తెలుసు
మొగ్గై ముడుచుకున్న ముదిత మురిపమేదో

పొగరు పొరగప్పిన పోటుగాడికేం తెలుసు
పొగడపువ్వులా పొదవిన పడతి పరిమళమేదో

దొరవోలెకాక దొంగై దోచుకొనేవాడికేం తెలుసు
దోబూచులాడాలనుకున్న దొరసాని సిగ్గుదొంతరేదో

మాయదారి మగాడి మనుగడకేం తెలుసు
మారామంటున్న మగువ మనసులో మర్మమేదో

22 comments:


  1. మగువ మనసును ఖచ్చితంగా తెలుసుకునే మగాడే లేరన్నమాట!! నిజమే కావొచ్చేమో మేడం. భావగర్భితం. బహుశా ఆ నిగూడతను ఎవరూ చేదించలేరేమో... అక్షరాల్లో ... భావాల్లో చాలా అద్భుతంగా అమరింది మీ (మన) కవిత... చిత్రం అద్భుతం.

    ReplyDelete
  2. మమ్మల్ని తెలివితక్కువ వాళ్ళం అని తిట్టినా బాగుంది మాడంజీ.

    ReplyDelete
  3. మగువ మనసు తెలుసుకోలేని బుధ్ధిహీనులని సున్నితంగా చెప్పారు పద్మార్పిత. చిత్రం చూడ ముచ్చటగా ఉంది.

    ReplyDelete
  4. మేము ఎంత ప్రయత్నించి మాత్రం ఏం లాభం.
    మగువల మనసు తెలుసుకోవడం మాకు సాధ్యం కాదు
    తెలిసేలా ప్రవర్తించడం మీకు చేతకాదు.....హా హా హా

    ReplyDelete
  5. ఏం తెలుసు అని బాగనే అడిగినారు తెలుసుకునేదెట్లా చెప్పరాదా

    ReplyDelete
  6. మీరు నిలదీసి ప్రశ్నిస్తే ఏం తెలియదు అని ఒప్పుకోరు ఎవరైనా. మంచి కవిత సరళమైన పదజాలంతో.

    ReplyDelete

  7. పొగరు పొరగప్పిన పోటుగాడికేం తెలుసు
    పొగడపువ్వులా పొదవిన పడతి పరిమళమేదో
    దొరవోలెకాక దొంగై దోచుకొనేవాడికేం తెలుసు
    దోబూచులాడాలనుకున్న దొరసాని సిగ్గుదొంతరేదో
    నాకు చాలా నచ్చేసింది . బొమ్మలు ఎక్కడివి మీకు

    ReplyDelete
  8. మాకేం తెలుసో లేదో మీకు తెలుసుకదండీ మరలా మా నోటితో ఎందుకు చెప్పించి చిన్నబుచ్చడం.:-)

    ReplyDelete
  9. తెలుసును అన్నవారు తెలివిలేనివారు
    తెలియనివారంతా తెలివైనవారు ఈరోజుల్లో
    ఇప్పుడు చెప్పండి ఎవరు తెలివైన వారో ఎవరు బుద్ధిహీనులో.

    ReplyDelete

  10. మగువ మనసే కాదు అసలు మనిషి మనస్తత్వం తెలుసుకోవడమే బహుకష్టం. కవిత బాగావ్రాశారు.

    ReplyDelete
  11. ఇంతకీ అన్నీ తెలిసిన అ సమర్ధులు ఎవరో :-)

    ReplyDelete
  12. నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  13. happy new year.
    eppatiki telusukoru

    ReplyDelete
  14. నూతన సంవత్సర శుభాకాంక్షలు
    ఆయురారోగ్యాలతో అందరినీ అలరించాలని ఆశిస్తూ-హరినాధ్

    ReplyDelete
  15. Belated new year wishes Padmaji.
    మాపైనే సంధించారు మరో అస్త్రం. బాగుంది

    ReplyDelete
  16. మగవారిపై ఇంత శాంతంగా ద్వజమెత్తారు ఏంటి సంగతి పద్మా

    ReplyDelete
  17. తిట్టడంలో కూడా మీ మృధుస్వభావంతో అలరించారు పద్మాజీ.. :-)

    ReplyDelete
  18. ఇన్నున్నా పట్టించుకోలేదంటే ఈమెలోనే ఏదో లోపం ఉందన్నమాట:-) అధ్యక్ష్యా!!

    ReplyDelete
  19. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు._/\_
    నా ఆలోచల్ని ఆదరించి అభిమానించే అక్షర అభిమానులందరికీ...అభివందనాలు.

    ReplyDelete
  20. ఈ మధ్య మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి మాత్రం ఏం తెలుసు అని అడగండి పద్మార్పితగారు. అంతా యాంత్రిక జీవనం. ఆలోచనాత్మక కవిత.

    ReplyDelete
  21. very nice andi

    ReplyDelete