ఇలా జరగనీ

మనసులోనే మూతపడ్డ వ్యధని కరిగి కన్నీటి జల్లవనీ
కన్నీటితో తడిసిన కోర్కెలు ఆశల గాలిసోకి మరీ ఆరనీ
నమ్మకంలో సొమ్మసిల్లిన మదిని నీరుతాకి కాస్త లేవనీ
బరువు తీరి మనసు తేలికైనదని తెలిసి మరల ఎగురనీ
విప్పారిన రెక్కలు ఆరగానే విహంగినై గగనాన్నే తాకనీ!

దారిలేని మజిలీలు ఎన్నున్నా కొన్ని అయినా నెరవేరనీ
రేయంతా తపనతో తడిసిన చెమటకి వేకువవేడేదో సోకనీ
కరిగిపోబోయిన కలలని మనోధైర్యంతో మంచుగా మారనీ
సూర్యకిరణాల తాకిడికి సాధించాలన్న పట్టుదలనే పెరగనీ
ఆ స్థైర్యంతో ఒడుదుడుకులనే ఖండించి ముందుకు సాగనీ!

మనసు మైనం ముద్దలా కరిగిపోయి మమతలనే వెతకనీ
ప్రేమనే అన్వేషిస్తూ పై మెరుగులకే లొంగక బయట పడనీ
గుండె పగిలితే అతుక్కుని గుణపాఠమై ముందుకు సాగనీ
అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి చెడుని మరచిపోనీ
మచ్చలనే దాచి చందమామనై చీకటిలో వెలుగునే పంచనీ!

28 comments:

  1. SUPERB
    HATS OFF TO YOU AND YOUR THOUGHTS

    ReplyDelete
  2. ప్రతి వాక్యం ఎంతో ఇన్స్పైరింగ్ గా రాశారు మేడం. చదునైన సముద్రంపై సాఫీగా సాగిన వెన్నెల కిరణాల్లా ప్రకాశిస్తున్న మీ ఈ కవిత అభిమానుల మనసు-మెదళ్ళలో వెలుగుదీపమై నిలుస్తుందని కాంక్షిస్తూ.... మీ అభిమాని

    ReplyDelete
  3. ఇది పద్మార్పిత బ్రాండ్ కవిత అనడంలో సందేహం లేదు. అభినందనలు.

    ReplyDelete
  4. +వ్ థాట్స్.. మీ బ్లడ్ గ్రూప్ B+ అన్నమాట :-)

    ReplyDelete
  5. అన్నీ మంచివే జరగనీ అంటే ఇంక చెడుకి ఆస్కారం ఎక్కడుంటుంది అర్పితగారు.

    ReplyDelete
  6. ఇలా జరగనీ అని అన్నీ మంచి మాటలు మీరే చెప్పేస్తే మా విశ్వం అసలే మాలోకం ఏం చెప్పగలడు చెప్పండి. మీ కవితా మాయలో పడ్డం తప్ప :-)

    ReplyDelete
  7. మీలోని పాజిటివ్ ఆలోచనలే మిమ్మల్ని ఇంత అనందంగా వ్రాయడానికి ప్రేరేపిస్తున్నాయి అనిపిస్తుంది మీ ఈ అధ్భుతమైన కవిత చదువుతుంటే. కుడోస్ పద్మార్పిత

    ReplyDelete
  8. Mastugundi. paintinglo nuvvena akka.

    ReplyDelete
  9. బరువు తీరి మనసు తేలికైనదని తెలిసి మరల ఎగురనీ
    విప్పారిన రెక్కలు ఆరగానే విహంగినై గగనాన్నే తాకనీ!
    Very good positive thoughts.

    ReplyDelete
  10. మాడం మరోమారు మీకు వందనం. అచ్చ తెలుగు ఆత్మబలం ఉన్న భావమాల అందించారు.

    ReplyDelete
  11. 1."మరల ఎగురనీ" బదులుగా "మరల ఎగరనీ" అంటే మరింత బాగుంటుంది!
    2"విహంగినై గగనాన్నే తాకనీ" బదులుగా "విహంగినై గగనాన్ని" అంటే మరింత బాగుంటుంది!

    మొత్తం మీద భావం ఆశని నింపేదిగా బాగుంది!

    ReplyDelete
    Replies
    1. హరిబాబుగారూ,
      ఎగురు అన్నదే సరైన రూపం కదా, అందుచేత మీతో ఏకీభవించలేకపోతున్నాను. విహంగినై గగనాన్నే తాకనీ అన్నదే బాగుందని నా అభిప్రాయం, విహంగినై గగనాన్ని తాకనీ అన్నదీ సరైనప్రయోగమే ఐనా అర్థఛ్ఛాయాబేధం కొంత ఉంది కాబట్టి కవయిత్రితోనే ఏకీభవిస్తున్నాను.

      Delete
    2. మీ వివరణ బాగుందండి శ్యామలీయంగారు.పద్మార్పిత తెలియకుండా/తెలుసుకోకుండా అనాలోచితంగా ఏదీ వ్రాయరని మా నమ్మకం. చాలా ఏఅళ్ళుగా ఆవిడ బ్లాగ్ ని ఫాలో అవుతున్న అనుభవం.

      Delete
  12. మంచి స్ఫూర్తినిచ్చే కవితను వ్రాశారు పద్మార్పిత

    ReplyDelete
  13. ప్రేమనే అన్వేషిస్తూ పై మెరుగులకే లొంగక బయట పడనీ
    గుండె పగిలితే అతుక్కుని గుణపాఠమై ముందుకు సాగనీ
    అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి చెడుని మరచిపోనీ
    మచ్చలనే దాచి చందమామనై చీకటిలో వెలుగునే పంచనీ! outstanding lines mam.

    ReplyDelete
  14. అందమైన భావాలతో కూడిన మీ కవితలా జీవితం సాగిపోతే ఎంతో బాగుంటుంది పద్మార్పతగారు.

    ReplyDelete
  15. తలవంచని నీ ఆత్మస్థైర్యమే నీ ఆలోచనలకి నీ భావాలకి నిచ్చెనలు అవే నీవు అధ్భుతమైన కవితలు అందించేలా చేసాయి. ధీర్ఘాయుష్మాన్ భవః-హరినాధ్

    ReplyDelete
  16. so beautiful art pic padmaji.

    ReplyDelete
  17. రోజు రోజు అభిమానం పెరిగి అభినందించడానికి అక్షరాలు కరువైపోతున్నాయి పద్మ.

    ReplyDelete
  18. జబర్దస్త్ తూటాలాంటి మాటలు. :-)

    ReplyDelete
  19. సుమధురభావాల సుమమాలకి తగిన చిత్రాన్ని జోడించారు పద్మార్పిత.

    ReplyDelete
  20. HAPPY VALENTINE DAY PADMA.

    ReplyDelete
  21. స్పందనలతో ప్రేరణనిస్తున్న అక్షర అభిమానులు అందరికీ అభివందనం_/\_

    ReplyDelete
  22. మీ భావాలకి అద్దంపట్టే మరో కవిత ఇది.

    ReplyDelete
  23. సూపర్ పెయింటింగ్ మాడం. ఎక్కడ దొరుకుతాయండి బాబు మీకు ఈ చిత్రాలు. కవిత అదరహో అదుర్స్

    ReplyDelete
  24. ఇలానే జరగనీయండీ... మీరేం చెప్పినా ఓ తాత్వికత అంతర్లీనంగా ఒద్దికగా ఒదిగిపోయుంటుంది కదా.. అభినందనలతో.

    ReplyDelete