ఒక కల...

ఒక కల...అధ్భుతమైన చిత్రాన్ని గీయాలని
ఆ చిత్రంలో జీవకళ ఉట్టిపడాలని!!!

ఒక కల...మంచి కవిత వ్రాయాలని
నా భావాలన్నీ అందులో పొందుపరచాలని!!!

ఒక కల...మధురమైన గేయం రచించాలని
ఆ పాటతో అందరూ పరవశించిపోవాలని!!!

ఒక కల...ఎంతో ఉన్నతంగా జీవించాలని
నా జీవితం అందరికీ ఆదర్శం కావాలని!!!

ఒక కల... అజ్ఞాతంగా అంతమైపోవాలని
అంతమై అందరిలో జీవించాలని!!!

వినాయకుడికి దండాలు!

అమ్మచేతితో మలచబడ్డ అద్వితీయుడు

పదునాలుగు భువనాలకు పరమాప్తుడు

మనందరి మ్రొక్కులలో ముందుంటాడు

విఘ్నాలను తొలగించే వినాయకుడు

కొలచిన ప్రతిమదిలో కొలువుండేవాడు

కలిమిని బలిమిని కలిగించువాడు

శక్తిని యుక్తిగా చూపే స్కందాగ్రజుడు

యఙ్జాలపతిగా నిలచే యశస్కందరుడు

సర్వజనులను రక్షించే సర్వరాయుడు

స్వీట్స్ ప్రపోసల్కి హాట్ ఆన్సర్!

ఓయ్...కుర్రాడా!
నువ్వే నా ఆవడా
నీ దొంగ లుక్స్...
వేడి వేడి ఆలుచిప్స్!
నీ హెయిర్ స్టైల్...
విడివడిన మాగీనూడిల్!
నీ రెండు నయనాలు...
గుర్తొస్తున్నాయి చిట్టిచెకోడీలు!
నీ మీసకట్టు...
మాడిన పెసరట్టు!
మొటిమలతో నీ చెంపలు...
తలపిస్తున్నాయి శెనగపప్పుచెక్కలు!
నీలో ఏముందో నాకు తెలియకుంది...
అయినా నువ్వే నాకిష్టమైన కారప్బూంది!
నీపై ఆలోచనలు సన్నకారప్పూస...
నీ మనసు మాత్రం వెన్నపూస!
నచ్చింది నాపై నీకున్న ఆశ...
అది కమ్మని మసాలాదోశ!
సై అంటున్నాను నీ స్వీట్స్ ప్రపోసల్ కోయ్...
తిందాం చిన్ని ఉల్లి సమోసాలు పదవోయ్!:)

స్వీట్స్ ప్రపోసల్

ఓ...అమ్మాయి!!!
నీవే నా పీచుమిఠాయి
ఓరకంట చూడమాకే ఓ పిల్లా
నాకు గుర్తుకొస్తుంది రసగుల్లా
నీ అధరాలపై దరహాసం
నాకది సేమ్యా పాయసం
నీవు నడుస్తుంటే భలే మజా
తలపిస్తుందది తాపేశ్వరం కాజా
నీ జడలోని గులాబీ
నాకు అక్కర్లెద్దు జిలేబీ
నీ బుగ్గలపై పడే సొట్లు
నా మదిలో మెదిలే బొబ్బట్లు
నీ చీరమాటున దాగిన బొడ్డు
గుర్తుచేస్తుందది తొక్కుడులడ్డు
నీ నల్లని కురుల సిరులు
రాసులై కనిపిస్తున్న పూతరేకులు
అమ్మో! నీ అందాన్ని కొల్వ
సరిపోదు నూరుకిలోల హల్వ
నాకు నీవే సరి అయిన సిరి
నీవుంటే నాజీవితం రవ్వకేసరి
కాదని అనకే ఓ! డింగ్రీ
నేనౌతా తీపిలేని జాంగ్రీ
సరే అని ఒప్పుకోవే నా చెలీ
అందరికీ పంచుదాం చక్కెరపొంగలి!!!

అభ్యర్ధన:-అమితంగా స్వీట్స్ ని ఇష్టపడే ఓ అబ్బాయి తన ప్రేయసికి చేసిన స్వీట్స్ ప్రపోసల్......స్వీట్ స్వీట్ గా చదివి ఆనందించండి, ఆరగించకండేం:):)

కవితలాంటి జీవితం...

కవితలాంటి జీవితంలో....

కొన్ని భావాలు మరికొన్ని ఆశయాలు
కొన్ని కోరికలు మరికొన్ని కల్పితాలు
కొన్ని సత్యాలు మరికొన్ని ఆశలు...

హృదయమే దాని శీర్షిక
భావమే దానికి వాటిక
ఎన్నెన్నో స్వప్నాల డోలిక...

గాలితెమ్మెరలవంటి మాటలు
అలలై ఎగసిపడే భావనలు
సుగంధాలవ్వాలని తాపత్రయాలు...

అర్థం తెలియని పదాలతో తికమక
అందరినీ మెప్పించాలనే కోరిక
తీరుతుందో లేదో వేచి చూడాలిక...

ప్రేమ-పెళ్ళి


ప్రేమ పెళ్ళికి సూర్యోదయం అయితే ప్రేమకి సూర్యాస్తమం లాంటిది పెళ్ళి!

బయటివాళ్ళు లోనికి, లోపలివాళ్ళు బయటపడాలి అనుకునే పంజరం పెళ్ళి!

ప్రేమకి మనలో చోటిస్తే, మనకి ఎదుటివారి మనసులో చోటిస్తుంది ప్రేమ!

మనందరి స్వభావాలకి ఉండవలసిన అందమైన అవసరం ప్రేమ!

హక్కులని సగానికి తగ్గించి భాధ్యతలని రెండింతలు పెంచేదే పెళ్ళి!

స్త్రీల సంతోషాన్ని, పురుషులు స్వేఛ్ఛని హరింపచేసేదే పెళ్ళి!

నిత్యయవ్వనంగా కనపడే ప్రతి హృదయంలో నిండి ఉండేది ప్రేమ!

చక్కని వాఖ్ఛ్యాతుర్యంతో శ్రధ్ధగా అలవరచుకునే విద్య ప్రేమ!

వాద ప్రతివాదనలతో సాగే సుధీర్ఘ సంభాషణలఝరి పెళ్ళి!

వద్దువద్దంటూనే వందలాది మంది చిక్కుకునే ఊబి లాంటిది పెళ్ళి!

(ఏంటి పద్మార్పితా....ఈ లెక్చర్ అని నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి ఈ మాటర్ లో, ఇదంతా పోయిన సంవత్సరం పెళ్ళై ఆషాడం ఎండింగ్ లో నా బ్రదర్ కి కలిగిన జ్ఞానోదయనికి నేనిచ్చిన అక్షరరూపం ఈ ప్రేమ-పెళ్ళి!)
Just for fun:):)

ఇలాగైతే ఎలా?

చెలికాని మది చెరకు కన్నా తియ్యనంటే
చీల్చితినడం కన్నా చేదే నయమన్నది!

చెలీ నీకు నేను గొడుగునౌతానంటే
జడివాన జల్లులో తడవడం ఇష్టమన్నది!

అతని మనసున బంధీవై ఉండమంటే
విశాల ప్రపంచంలో విహంగాన్ని నేనన్నది!

ఆమె వేసిన అడుగుని పెదవి తాకిమట్టంటుకుంటే
ముద్దాడబోయిన పెదవులను మట్టివాసనన్నది!

రంగుల కుంచెతో జీవితాన్ని రంగరిస్తానంటే
తెలుపు తప్ప తనకి వేరేది తెలుపవద్దన్నది!

రాగరంజమై తనలో లీనమై పోదామనుకుంటే
కర్ణభేరికి అన్నీ కన్నాలే వున్నాయన్నది!

ప్రతిదానికి ఇలా ఏదో ఒక వంక పెడుతుంటే
అతనిలోని ప్రేమ ఆమెకు ఎలా తెలిసేది!

ప్రేమా! దూరం దూరం...

నా హృదయ వీణను మీట ప్రయత్నిస్తే
నాలో ఊహలకు ఊసులు నేర్పితే
మనసుకి కళ్ళెం వేస్తాను
ప్రేమకి నే దూరం అంటాను.

నాలోని కోరికలు ఎగసి పడితే
అవి తీరం చేరని కెరటాలని తెలిస్తే
వేదనైనా పర్వాలేదు భరిస్తాను
నా మనసుని నేనే వసపరచుకుంటాను.

నా మనసు నా మాట వినను అంటే
మౌనంగా అది రేయింబగలు రోధిస్తే
గాయమైన మనసుతో దూరమౌతాను
పగిలిన మనసుని పదే పదే అతికిస్తాను.

నాలో సహనం నన్ను ప్రశ్నిస్తే
కన్నీటి జలపాతం బీటలుగా మారితే
మనసుని రాయి చేసుకుంటాను
జీవితమా! నీతో నాకు పనిలేదంటాను.

పేదవాని ప్రార్థన!

జీవితమా....మా ఇంట అడుగిడుమా
మా స్థితిగతులను కాస్త కనుమా
తెలుపనా మాఇంటి చిరునామా
నాలుగు వైపులా గోడలే లేవుసుమా!

జీవితమా....లేదు నీకు తలుపు తట్టవలసిన అవసరం
గుబులుతో గుమ్మం పలుకుతుంది మీకు స్వాగతం
పైకప్పుకి తెలుసు ఎండావానల తులాభారం
కటికనేల పైనే నిన్ను కూర్చుండబెట్టే పేదలం!

జీవితమా....మా ఇంట అడుగిడుమా
మా ఇంటి మారుపేరు ప్రేమా
నీ నీడలో మమ్ము తలదాచుకోనీయుమా
కాస్త చేయూతనిచ్చి మమ్ము కాపాడుమా!

జీవితమా....మా అభిమానమే నీకు ఆతిధ్యం
బోర్లించిన బొచ్చెలని చూసి నీవు చేయకు పరిహాసం
మా ఇంట ఏమున్నది నీకు తెలియని రహస్యం
నీ ఆదరణతో విరియాలి మా పెదవులపై దరహాసం!

జీవితమా.... మా ఇంట అడుగిడుమా
ఆకలి తీర్చి మా ప్రాణాలని నిలుపుమా
ఆగలేక అర్థిస్తున్న మా గోడు కాస్త వినుమా
మా ఇంట ఆనందాలని కురుపించుమా..ఓ జీవితమా
!