అతడే నేను...

అతనన్నాడు:-
నాకు అర్థం కాదని
గాజువంటిది తన మనసని
రాతిగుండెలాంటిది లోకమని...

నేనన్నాను:-
ఆ మనసు నాదని
దాన్ని అతనికెపుడో ఇచ్చేసానని
రాయిగా మనసుని మారనీయకని...

అతనన్నాడు:-
నాకు లోకాన్ని చుపుతానని
ఆనందానికి నిర్వచనం తనేనని
పరుల మాటలు పట్టించుకోవద్దని...

నేనన్నాను:-
నీ కళ్ళలో నాలోకం ఉందని
అతని నవ్వే నా ఆనందమని
పరాయిగా నన్ను చూడకని...

అతనన్నాడు:-
నాకు తోడై ఉంటానని
కంట నీరు రానీయనని
జీవితాంతం నాతోనేనని...

నేనన్నాను:-
నా నీడై నడచిరమ్మని
కలతలకు తావీయనని
నా జీవితమే అతడని...

కవిత రాయలేను....

ఓ చేతిలో కలంతో కాగితంపై గీస్తూ
మరోచేతి గోళ్ళను మునిపంటితో కొరికేస్తూ
కలువల్లాంటి కళ్ళకి శూన్యాన్ని చూపిస్తూ
మెదడుకు మేతను తినిపిస్తూ.....

హృదయాన్ని తికమక పెట్టేస్తూ
మీ పెదవులపై నవ్వుని విరబూయిస్తూ
మంచి కవితనొకటి రాయాలని యోచిస్తూ
నడిరేయంతా మేల్కొన్నాను ఆలోచిస్తూ....

నాలుగక్షరాలని అటువిటు రాస్తూ
మురిసిపోయాను పైన క్రింద చదివేస్తూ
నా పిచ్చి రాతలనుండి మిమ్మల్ని రక్షిస్తూ
సమయం మేల్కొల్పింది నన్ను వెక్కిరిస్తూ....

నా రాతలు!


రాతలతో నా స్నేహం.......
అక్షరాలతో నా అనుబంధం!
నేను రాసే వివిధ పదాలు.......
తెలియకుండానే నా ప్రియనేస్తాలు!
నూతన పరిచయాల యత్నం.....
నన్ను నేను శోధించుకునే ప్రయత్నం
కవితలలో రాసే నా ప్రేమ.......
తెలుపుతుందది నామది చిరునామ!
విధి లిఖించిన నుదిటి రాతలు.....
వాటిని మార్చలేవు ఏ కవితలు!
ఇలా రాయడంలో వుంది నాకు తృప్తి....
అదే నేను రాసే ఈ రాతలకు స్పూర్తి!
నా రాతలకు మీరంతా స్పందిస్తున్న తీరు...
మీ అందరికీ నేను చేస్తున్నాను జోహారు!

అతివ అతిచిన్ని ఆశ!!

కనీసం ఇవ్వుంటే చాలు.....
ఇంకేం నాకు అక్కర్లేదు.....
అందరిలాగ అడిగేదాన్నికాను!
కొందరిలాగ కొసిరేదాన్నికాను!

అందమైన ముఖవర్చసు...
దానికి తగిన సున్నిత మనసు...
ఆజానుబాహుడు, ఎత్తు మాత్రం ఆరడుగులు!
ప్రేమించడంలో నాకన్న ముందు రెండడుగులు

ఏదో మెడలోకి ఒక మోస్తారు వజ్రాల హారం.
పెళ్ళికి విచ్చేసిన వారికి చిన్ని విందుఫలాహారం...
వెన్నెలరేయికై ఏలాగో తప్పదు చంద్రమండల విహారం!
తిరుగు ప్రయాణంలో తప్పవు బహుమానాల పరిహారం!




మాకంటూ ఉండాలి కదా ఒక గృహం...
ఇరువురికీ కావాలి చెరొక వాహనం...
ఇంటిలో పనికై తప్పరు నౌకిరీజనం!
ఇంటి ముంగిట అందమైన నందనవనం!

సంధ్యవేళ సమయానికి రోజూ శ్రీవారు...
క్రమం తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు...
చిలిపి తగాదాలు తప్పవు ఎప్పుడో ఒకమారు!
సాగిపోవాలి సరదాగా సంసారపు జోరు!



చిరునవ్వుతో శ్రమించడం శ్రీవారి వంతు...
శ్రీమతికి తప్పదు చిన్ని ఖర్చుల తంతు...
నెలకి ఒకసారి స్వదేశంలోనే చిరు వినోదం!
ఏడాదికోమారు విదేశీయానంతో కనులకానందం!


అడగకపోయినా అబ్బురపరిచే బహుమానాలతో...
వారాంతంలో ఖరీదైన హోటల్లో విందువినోదాలతో...
పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడని ప్రేమానురాగాలతో!
అప్పుడప్పుడూ కాస్తో కూస్తో సెక్యూరిటీ డిపాజిట్లతో!


కనీస అవసరాలివి అనుకున్న కాంత..
చివరికి ఒక మార్గమున్నది మగవాని చెంత...
సన్యాసిగా మారడమే అతని మార్గమంట!
అతివా అతిగా ఆశపడడం ఎందుకంట???

(మనవి:- ఇంగ్లీష్ మెయిల్ ని నాదైన రీతిలో మీతో పంచుకోవాలన్న తాపత్రయమే ఈ ప్రయత్నం అంతే కానీ ఎవరి మనసునీ నొప్పించాలని కాదు!
)

ఓ! మహిళా....

అమ్మవైనా....
ఆలివైనా.....
అక్కవైనా.....
ఆకాశమంత ఎత్తుఎదిగినా!
అమ్మాయివై అందంతో అలరించినా!
ఆకతాయిగా అల్లరితో మురిపించినా!
'అ" అక్షరం నుండి 'అం' 'అః' వరకు!
ఆదియు అంతము నీవే కదా మనుగడకు!!
అందుకో మహిళాదినోత్సవ శుభాకాంక్షలు నీ కొరకు!

ఇలా సాగిపోనీ!


కలలోనైనా వినని ఆ పలుకులు....
కర్ణంలో ప్రతిధ్వనిస్తున్నాయి పలుమార్లు!

పతనానికి కారణం కావు నా భాధలు...
భాధిస్తున్నవి పతనానికై జరిగిన పలుచర్చలు!

ఏమని వర్ణించమనేది ఈ సౌందర్యాలు....
అంధునికి అందించి కళ్ళజోడు పలుమార్లు!

జీవనపయనంలో ఈ షరా మామూలు....
సాగించక తప్పదు ఇలా అంచెలంచెలు!

తెలియదు!


నా కనులకు కలలు కనడం తెలుసు
నిన్ను మరువడం మాత్రం తెలియదు..

నీ తోడు నేను కానని తెలుసు
నీనుండి దూరమవడం మాత్రం తెలియదు..

నా పెదవులకు నిన్ను పిలవడం తెలుసు
పరుషంగా మాటలతో గాయపరచడం తెలియదు..

నీ నీడనైన నాకు నీవు తప్ప నీ స్పర్శ మాత్రం తెలియదు..
నా ఊపిరైన నిన్ను వదలి తుదిశ్వాసను వీడడం నాకు తెలియదు!

చేసెయ్ బాసను!

నిన్ను వీడి క్షణముండలేను...
మరణాన్నికూడ దరిచేరనివ్వను!
నీతోనే కలసి జీవిస్తానన్నాను...
చేసిన బాసను నేనెన్నడు మరువను!

కలసిన వేళ కష్టాలేనని తెలుసును...
అయినా నిన్ను కలవక నేనుండలేను!
అధైర్యంతో ఎన్నడూ వెనుకడు వేయను...
నీతోడు లేనిదే ముందడుగు వేయలేను!

నాలోని భావాలే నీవైతేను...
నన్ను నీవుగా అనుకుంటేను!
నా చేతిలో చేయి వేసి నీవును...
చేసెయ్ కలకాలం కల్సుంటాననే బాసను!

పండుగ సంబరాలు

ముగ్గుల ముంగిళ్ళు
గోబిపూల గొబ్బిళ్ళు
పాల పొంగుళ్ళు
బోసినవ్వుల భోగిపళ్ళు....



రంగురంగుల గాలిపటాలు

హరిదాసుల కీర్తనలు
కొత్త అల్లుళ్ళ మురిపాలు
ఇవి సంక్రాంతి సంబరాలు....



కోడిపందాలతో కనువిందు
గారెబూరెలతో పసందైన విందు
ధాన్యరాసులు చేరు గాదెలయందు
కనుముక్కనుమలు మనకెంతో పసందు..



సంక్రాంతి శుభాకాంక్షలు అందుకోండి మీరందరూ!!!