జంటపదాలమై...

ఉండి-ఉండి అనుకోకుండా దగ్గరైనావు
మెల్ల-మెల్లగా నా మనసునే దోచేసావు

చూస్తూ-చూస్తూ వెర్రిమది నీదైపోయింది
తియ-తీయని నీ ప్రేమలో పడిపోయింది

పదే-పదే పెదాలు నీపేరే పలుకుతున్నాయి
నన్ను-నన్నుగా నిలువనీయక ఉన్నాయి

చిన్ని-చిన్ని సైగలతో నన్ను మాయచేసావు
మిణుకు-మిణుకుమన్న కోర్కెల సెగ రేపావు

ఏవో-ఏవో కలలంటూ మనసు మాటవినకుంది
నువ్వే-నువ్వే కావాలని కునుకు కలవరిస్తుంది

ఇలా-ఇలా తెలియకనే నావన్నీ నీ వసమైనాయి
క్రమ-క్రమంగా నాలోనే నన్ను లేకుండా చేసాయి

చిలిపి-చిలిపి చేష్టలతో చిత్రంగా ఒకటి అయినాము
ఏడు-ఏడు జన్మలకి జంటపదమై మనముందాము

పయనం

ఈ జీవితంలో జవాబులేని ప్రశ్నలు ఎన్నో
అడిగడిగి విసిగిస్తున్నాను నేను ఎందుకనో
కొన్నింటికి జవాబు తెలిసినా సరిపెట్టుకోలేక
సరైనదో కాదో తెలీని ప్రశ్నగా మిగిలున్నానో
సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ వేధిస్తున్నానో
తెలీక ప్రశ్నించి నన్ను నేను అన్వేషిస్తున్నా!!

సమాజంపై సంధించబోయాను శరాలు ఎన్నో
యోచిస్తే సమాజమంటే నేనున్నా అందులో
ఇక ఎవరిపై ఎక్కుపెట్టేది వక్రించిన బాణాలను
అందుకే బంధీనైతి సంస్కరణల విల్లంబులలో
కర్తవ్యమేదో కాళ్ళనిచుట్టేసింది నేనేం చేయాలో
కార్యాచరణలో ఇక ప్రశ్నించక సాగిపోతున్నా!!

ఈ పోరాటంలో గెలుపు ఓటములు ఎన్నెన్నో
ప్రయాణంలో మజిలీ ఎరుగని మైళ్ళు మరెన్నో
అలసి విరామమంటూ స్వేదాన్ని ఆవిరవనిస్తే
దూసుకుంటూ పోయే పదునైన మలుపులెన్నో
కాలానుగుణమై సాగితే దొరికే జావాబులింకెన్నో
అందుకే నేను నేనుగా ఆగకుండా అడుగేస్తున్నా!!

ఎవరికోసం


సవ్వడి చేయని గుండెకి లయ ఎక్కడిది?
వెలిగించని ఒత్తుకి దీపకాంతులు ఎక్కడివి
ప్రేమించని మనసుకి వేదనవేడెలాతెలిసేది
వ్యధలేని ప్రేమకి అర్థమేలేదని ఏం చెప్పేది
ఎగసిపడని కోర్కెలసెగలో ధూపమెలాతీసేది

కవితలూ కావ్యాలు రాసి ఏం వినిపించేది
పలుకుల మధ్యన పదాలెన్నని జోడించేది
లిపికోసం వెతికితే కంటిభాషేలే కనిపించేది
ఒకరికోసం ఒకరున్నప్పుడు ఎవరికేంచెప్పేది
ప్రేమేలోకమైతే ఎవరి కోసం వేడుకలు చేసేది

ప్రాణం ప్రణయం రెండొకటని ముడి వేసింది
నీటముంచినా పాలముంచినా ఒకటేననంది
జ్ఞాపకాలతో హాయిగా కాలాన్ని సాగనివ్వంది
మరింక నన్నునేను మరచి ఎవరిని తలచేది
ఉఛ్ఛ్వాసలోని నిన్ను నిఛ్ఛ్వాసలో ఎలావీడేది!

"తూనికరాళ్ళు"

అంగుళంగుళం అందగత్తెనని
ఆమడ దూరంలోనే ఉంచేసావు
ఆరుగజాల చీర నే చుట్టానని
మూరెడుమల్లెలు తీసుకురానినీవు
జానాబెత్తెడు బట్టకట్టిన దానిని
నెరజాణనంటూ చూసి లొట్టలేసావు
ఇంచు అందాలను తాకి ఆమెని
అప్సరసంటూ అందలమెక్కించావు
చిటికెడు నవ్వుని ప్రేమనుకుని
తబ్బిబై తెగ సంబర పడిపోయావు
లీటరుబీరు పావుశేరు పలావుతిని
నోట్లని లెక్కచేయక గుమ్మరించావు
అడుగడుక్కి రోగం అంటించుకుని
కొండంత ఆస్తి కరిగినాక తిరిగివచ్చావు
ఇప్పుడింక రెండు గజాలైనా చాలని
బారెడంత బాధ్యత నాకు అంటగట్టావు
చివర్లో గుప్పెడంత గుండెలో నేనని
పిడికెడుప్రాణంలో పిడిబాకు దింపావు

(ఇది వ్యసనాలకు బానిసై చరమాంకంలో తిరిగి వచ్చిన భర్త పై భార్య విసిరిన "తూనికరాళ్ళు" )

వ్యధావేదన

కంటపడకుండా బాధను మునిపంటితో నొక్కి
ముసినవ్వుతో ఎదను పిండే వ్యధను దాచేస్తే
ఎగశ్వాసలో ఎగసి పడింది మదిలోతుల సెగ
ముఖం మారింది నవ్వుని ముసుగ్గా కప్పేసి!
వ్యధనణచిన పలుకులు కంటికి తడిగా తగిలి
తనువు తడిసి ఆనందాన్ని అప్పు అడగబోతే 
సంతోషపు స్థిరాస్తుల దస్తావేజులు అడిగింది
లేదన్నానని ముఖం పైనే తలుపేసింది కసిరేసి!

తడారిన గొంతుతో నర్తించమంటూ నవ్వుని కోరి
అలుసైపోయాను తోడురానన్న కన్నీటి ధారకు
గాయమైన గుండెలో రగిలిన సానుభూతి పొగ
ఆరకుండానే తలపు పరిహసించె మరో గాటుచేసి!
దుఃఖం అలవాటైపోయి సంతోషం చుట్టంగా మారి
నవ్వినా ఏడ్చినా కన్నీరు పెట్టని కరగని శిలనైతే
ఆశావాదంతో ముందుకు సాగడానికేం మిగిలింది
నమ్మకమే తియ్యని విషమై కాటేసింది మాటువేసి!

మదికే శిక్ష

కరిగిపోతున్న కల నిందిస్తూ నాతో అంది..
నీవు మనసుకు దగ్గరై కనులకు దూరమని

రాలుతూ తార బింకంగా ముఖం తిప్పుకుంది..
ప్రేమించి వేదన్ని నేనే కోరి కౌగిలించుకున్నానని

కన్నీరు చెంపలపై జారుకుంటూ చర్చల్లోకి దిగింది..
మనసులు ఏకమైతే కళ్ళతో వెతకడం వెర్రితనమని

మనసు మాత్రం మౌనంగా తనలో తానే అనుకుంది..
ప్రేమిస్తే అవయవాలన్నీ కలిపి శిక్షించేది తననే ఎందుకని

కల మరోమారు మేల్కొని మనసుతో మంతనాలు ఆడింది..
అభాంఢమేల తలచినది ఒకటైతే జరిగేదెప్పుడూ మరొకటేనని

వేదనతో శిక్షించబడ్డ మనసు అంబరాన్ని చేరి మరలి వచ్చింది..
వేగంగా వాన వచ్చి పరామర్శించబోయి మనసునే ముంచేసింది
ఎందుకంటే! కన్నీరు తనతో కలిసి కనబడనందుకు కట్టే రుసుమంది!

రాయబారమెందుకు?

చలనంలేని మనసును ప్రణయమంటూ దోచి
ఊపిరున్న ఊహలకు రూపమంటూ ఒకటిచ్చి
కదులుతున్న శ్వాసలో పలికే భావంగా మారి
గాజువంటి మదిని అందమైన అద్దంగా మార్చి
తడబడుతున్న అడుగులకు తోడుగా అడుగేసి
ఆవేశంతో చెలరేగబోయే సుడిగాలిదిశను మార్చి
అలిగికోరితే అందలమైనా అపూర్వంగా అందించి
మధుర ధరహాసమంటూ జ్ఞాపకాలని జతకూర్చి
కలత పడితే కన్నుల్లో దాగిన కన్నీళ్ళను తడిమి
కమ్మని కోయిల పాటలై ఎద ఊయలపై సేదతీర్చి
పంచభూతాల సాక్షిగా ప్రకృతి నీవు ప్రాణం నేనని
నమ్మి వలచిన ఇరుమది సవ్వడులు ఒకటైనప్పుడు

               ప్రణయానికి  పవరున్నప్పుడు...
                               *****
ప్రమాణపరిణయానికి పసుపుతాడు ముళ్ళెందుకు?
గుండె గోడల్లో కొన్నాళ్ళకి తెలియని బీటలెందుకు??
అ చంచలప్రేమను బలపరిచే రాయబారాలెందుకు???

విత్ లవ్ ఫ్రం.......నరకం!

నావెంటపడి వస్తాను అనకు అల్లంత దూరం
అక్కడ నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువట
నీదేమో అది చూసి తట్టుకోలేని ప్రేమస్వార్థం
పాపులు పాతచుట్టాలుగా చుట్టూ చేరతారంట
నీకేమో నేనంటే అసలే వల్లమాలిన అభిమానం
వారు పలకరిస్తుంటే నీకు ఒళ్ళంతా పిచ్చమంట
యముడికి కూడా నేనంటే అమితమైన ప్రియం
చిత్రగుప్తునికి చెప్పి నన్ను త్వరగా రప్పించాడట
నాపై ప్రేమతోపాటు తెలివైన నీకు తగనంత ఆవేశం
అందుకే నిన్ను నావెంట ఒద్దని బ్రతిమిలాడుతుంట
నీ శక్తి సామర్ధ్యాలతో ఇక్కడ ఎందుకులే గందరగోళం
భువిలోనే మంచిమనిషిగా పేరు తెచ్చుకోమని అంట
నీ వెంట ఆయువు తీరిన నేను ఉండలేను కలకాలం
చేసిన క్రియానుగుణంగా వేయిస్తాను నీకు స్వర్గబాట!!