ఇద్దరమూ..

ఒక నిస్సహాయతల నదిలో.. 
నీవు ఆదరిన నేను ఈ దరినా
ఏ ఒడ్డునా నిలకడగా ఉండలేక
సతమతం అవుతూ ఇద్దరమూ!

ఒకప్పుడు ప్రేమ ప్రపంచంలో..
నీవూ నేనూ పూర్తిగా మునిగినా 
నేడు మనసు విప్పి మాట్లాడలేక
సంశయిస్తూ వ్యధతో ఇద్దరమూ!

ఒకానొక వసంత ఋతువులో..
నీకు నేను నాకు నువ్వే అయినా
ఇప్పుడు రాలిన ఆకులై చిగురించక
జ్ఞాపకాల సుడిలో చిక్కి ఇద్దరమూ! 

ఒకటే బాటై గమ్యానికి చేరువలో..
నువ్వూ నేనూ కలవక విడిపోయినా
ఎడబాటు పవన అశ్రువులు రానీయక  
నీవునీవుగా నేనునేనుగా ఇద్దరమూ!

ఒకానొకరోజు కలిసి నెరసిన జుట్టులో..
నన్ను నీవు గుర్తించి దరిరాక పోయినా
మన అలసిన హృదయాలపై అలుగలేక
పరిస్థితుల చెరలో బంధీలై ఇద్దరమూ!  

28 comments:

  1. కాలం కడలిలో వడివడిగా కొట్టుకుపోతున్న జీవితాల్లో రసాస్వాధన కరువైపోతుంది.

    ReplyDelete
  2. ఒక అనుభూతి హృదయ అంతరాల్లో
    ఒక తీయని జ్ఞాపకం అలనాటి గురుతులు,.

    ReplyDelete
  3. స్థితిగతుల పర్యవసానం జీవితం
    పరిస్థితుల సమాహారం జీవితం
    ఉద్రిక్తతల కలగాపులగం జీవితం

    శ్రీత

    ReplyDelete
  4. ప్రేమించడం
    ప్రేమించబడడం
    ఒక గొప్ప వరం
    కానీ...
    జీవితం చేతిలో
    కీలుబొమ్మలం
    మనం అందరం

    ReplyDelete
  5. హృదయ కవాటాలు ఎప్పటికీ తెరచి ఉంటాయి
    స్థితిగతులే మనుషులను తారుమారు చేస్తాయి

    ReplyDelete
  6. నాకు ఎందుకో మీరు ప్రేమలో పూర్తిగా విఫలమైన ఛాయలు కనబడుతున్నాయి
    తప్పుగా అనుకోవద్దు..ఈ మధ్య మీ కవితల్లోని భావం అలా అనిపిస్తుంది.
    అయినా మీరు ఇలాంటివి ఎన్ని వ్రాసినా చదవడానికి బాగుంటాయి.

    ReplyDelete
  7. హృదయ నిండా అనురాగం ఎంత ఉన్నా పరిస్థితులకు తలవంచక తప్పదు
    జీవితం ఎంతో తీయనైనది అనుకుని సాగిపోవడమే ఉత్తమం. ప్రేమ ఎప్పుడూ అమరం.

    ReplyDelete
  8. మార్పు అనేది అన్నింటికీ ప్రధాన లక్షణం. ఇది ఒక బాహ్య ప్రపంచానికే కాక, అంతఃప్రపంచంలో కూడా ఉంటుంది. ఒకప్పుడు కోపం, ఒకప్పుడు శాంతం, ఒక చోట ద్వేషం, ఒక చోట రాగం, విజయం సాధించటం వల్ల ఆనందం, ఓడిపోవటం వల్ల దుఃఖం, ఇవన్నీ మనకు అనుభవమే. ఈ దేశ, కాల, కారణాలతో నిమిత్తం లేని, ఈ మార్పులేని ప్రపంచాన్ని మనం ఊహించటం కూడా కష్టం. అందుకే అన్నింటికీ అలవాటు చేసుకోవాలి ప్రేమ కూడా అందులో ఒక భాగం అయినప్పుడు మార్పు సహజమే అనుకోవాలి.

    ReplyDelete
  9. పరిస్థితుల చెరలో బంధీలై చాలానచ్చింది.

    ReplyDelete
  10. fantastic conclusion ichi gauravam pencharu

    ReplyDelete
  11. ఎందుకు ఈ నిస్సారవంతమైన ఆలోచనలు?
    అనవసరంగా నీరసాన్ని కొనితెచ్చుకనేల!!?

    ReplyDelete
  12. ఏదో ఒకసారి గుర్తుకురావడం ఏమిటి?
    మస్తిష్కంలోని ప్రతికణంలో నిక్షిప్తమైపోతే
    ఏదో ఒక స్థితి పరిస్థితి
    ఏదో ఒక సంఘటన ఒక అనుభూతి
    అప్పుడప్పుడూ మేఘాలు కమ్మే
    మనసు ఆకాశం అయిపోయి
    హృదయతంత్రులు వేదనతో నిండె

    గుండె భారం అయిపోయి
    అయినా ఏదో రాగం ఆలపిస్తున్నా
    నువ్వు నేను ఒకటే అనుకున్న ఊహల్లో..

    ReplyDelete
  13. బంధీలో బానిసలు మీరు

    ReplyDelete
  14. మీ అక్షరజ్ఞానానికి నా సలాం.

    ReplyDelete
  15. నీవునీవుగా నేనునేనుగా
    Lovely mam

    ReplyDelete
  16. ఆవేదనతో ఇద్దరూ ఒక్కరికి ఒకరు సరిజోడి.

    ReplyDelete
  17. ఈ ప్రేమ మత్తు నుండి బయట పడకపోతే
    జీవితం దుర్లభం.. ప్రయత్నం చేయాలి

    ReplyDelete
  18. పద్మా భావపటిమలో వేదన చదవడానికి బాగుంటుంది
    ఎవరికీ ఇలాంటి వేదన వద్దు.

    ReplyDelete
  19. సమస్యలతో సతమతం అవుతూ బ్రతకడమే జీవితమా!?

    ReplyDelete
  20. వ్యధల భాంఢాగారంలో ఇద్దరు బంధించబడ్డారు
    సున్నితంగా మనసుని తాకుతాయి మీ వాక్యాలు.

    ReplyDelete
  21. వేదనతో రెండు హృదయాలు కలబోసిన భావన బాగుంది.

    ReplyDelete
  22. అందరి అప్యాయతకూ నా నమోఃవందనములు.

    ReplyDelete
  23. ఇద్దరూ ఇద్దరే

    ReplyDelete
  24. ప్రేమ రాగయుక్తం

    ReplyDelete